ఫైజర్‌తో పక్షవాతం ఛాన్సెస్!.. మన వ్యాక్సిన్లే బెటర్..!
posted on Jul 20, 2021 @ 12:25PM
కరోనాకు మందు లేదు. వ్యాక్సిన్ ఒక్కటే తరుణోపాయం. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుంటేనే కొవిడ్ నుంచి రక్షణ. వ్యాక్సిన్ వేసుకున్నామని బిందాస్‌గా ఉండే పరిస్థితి కూడా లేదు. కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ల సామర్థ్యం సుమారు 75శాతం మాత్రమే. అందుకే, టీకా తర్వాత కూడా మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి. అయితే, వ్యాక్సిన్ వేసుకుంటే జ్వరం వస్తుందని, టీకాతో తలనొప్పి, ఒళ్లు నొప్పులు వస్తున్నాయనే.. రెండు మూడు రోజుల తాత్కాలిక ఇబ్బందులను బూతద్దంలో చూసి.. వ్యాక్సిన్ అంటే భయపడి.. టీకాలు తీసుకోవడం లేదు. ఇండియాలో ఈ ధోరణి అధికంగా ఉంది. సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగిన దశలో జనాలు వ్యాక్సిన్ కోసం ఎగబడ్డారు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో.. టీకా జోలికి వెళ్లడం లేదు. మరోవైపు, వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ప్రచారం వారిని మరింత భయపెడుతోంది. తాజాగా, అలాంటి ఓ ఘటనే వ్యాక్సిన్‌పై మరింత ఆందోళన పెంచుతోంది.
కొవాగ్జిన్, కొవిషీల్డ్ కంటే విదేశీ వ్యాక్సిన్లైన ఫైజర్, మెడెర్నాల సామర్థ్యం చాలా ఎక్కువ. దాదాపు 95శాతం కొవిడ్ నుంచి రక్షిస్తున్నాయి ఆ టీకాలు. అందుకే భారతీయులు సైతం ఎప్పుడెప్పుడు ఆ విదేశీ టీకాలు అందుబాటులోకి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే, చాలా తక్కువ సంఖ్యలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుండటం విదేశీ వ్యాక్సిన్లపై భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చాలా అరుదుగా హార్ట్ స్ట్రోక్స్, పక్షవాతం వచ్చే అవకాశం ఉండటంతో ఆ వ్యాక్సిన్ల విషయంలో నమ్మకం సడలుతోంది.
తాజాగా, ఫైజర్ వ్యాక్సిన్ వల్ల ఒక వ్యక్తికి బెల్స్ పాల్సీ (ముఖ పక్షవాతం) వచ్చింది. ఈ ఘటన యూకేలో జరిగింది. 61 ఏళ్ల వ్యక్తి తొలి డోసు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తన ముఖంలో ఎడమవైపు భాగంలో ఇబ్బంది వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా దాన్ని బెల్స్ పాల్సీగా నిర్ధారించిన వైద్యులు చికిత్స చేశారు. కోలుకున్న కొన్ని రోజుల తర్వాత రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవడంతో ఆ వ్యాధి మరింత ముదిరింది. ఆహారం మింగాలన్నా, ఎడమ కన్ను మూయాలన్నా.. కష్టసాధ్యంగా మారింది. మరోసారి చికిత్స చేసిన వైద్యులు.. ఈ వ్యక్తికి అలా జరగడానికి ఫైజర్ వ్యాక్సినే కారణమని తేల్చారు.
ఇటీవల ఫైజర్ వ్యాక్సిన్‌పై చేసిన ఓ అధ్యయనంలో బెల్స్ పాల్సీ వంటి సైడ్ ఎఫెక్టులు రావడం చాలా అరుదుగా సంభవిస్తుందని తేలింది. కేవలం 0.02శాతం మందిలో మాత్రమే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని పరిశోధనలో వెల్లడైంది. అయినా, భయపడాల్సింది లేదని.. ఇప్పటికీ ప్రపంచంలో ఫైజర్ వ్యాక్సినే అత్యంత సమర్థవంతమైన కరోనా టీకా అని చెబుతున్నారు వైద్యులు. అయితే, మన ఇండియన్ మేడ్ కొవాగ్జిన్ కానీ, మనకు అందుబాటులో ఉన్న కొవిషీల్డ్ వల్ల కానీ, ఇలాంటి ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ ఏమాత్రం లేవని.. భారతీయులంతా నిరభ్యంతరంగా వ్యాక్సిన్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.