కారు పార్టీనా? కొత్త పార్టీనా? ప్రవీణ్‌కుమార్ దారెటు?
posted on Jul 19, 2021 @ 9:26PM
ఐపీఎస్‌కు రాజీనామా చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్. ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. ఆయన రిజైన్ చేయడం కన్నా.. నెక్స్ట్ ఏంటి? అనేదే మరింత ఇంట్రెస్టింగ్. ప్రవీణ్‌కుమార్ ఎందుకు రాజీనామా చేశారు? ఆ తర్వాత ఏం చేయబోతున్నారు? టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా? హుజురాబాద్‌లో పోటీ చేస్తారా? లేక, సొంతపార్టీతో రాజకీయ అరంగేట్రం చేస్తారా? ఇవే ఇప్పుడు చర్చలో ఉన్న అంశాలు. వీటిలో అన్నిటికీ అనుకూల అంశాలున్నా.. ఇందులో ఏది జరగబోతుందనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్.
26 ఏళ్లుగా ఐపీఎస్. పోలీస్ డిపార్ట్‌మెంట్ డైనమిక్ ఆఫీసర్. 9 ఏళ్ల నుంచి గురుకులాల కార్యదర్శిగా హల్‌చల్. ప్రవీణ్‌కుమార్ కెరీర్ అంతా సంచలనమే. ఆలంపూర్‌లో పుట్టి.. హార్వర్డ్‌లో చదివి.. స్వేరేస్ స్థాపించి.. చేసిన ప్రతీపనిలో తనదైన ముద్ర వేశారు. అలాంటి అధికారి, సడెన్‌గా ఆ బాధ్యతల నుంచి ఊరికే వైదొలగరు. పక్కా ప్రణాళికతోనే ఉంటారు. అదేంటనేదే ఇప్పుడు చర్చనీయాంశం. పూలే, అంబేద్కర్, కాన్షీరాం చూపిన మార్గంలో నడుస్తానని, పేదలకు పీడితులకు అండగా నిలుస్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. అంటే, అది రాజకీయ ఎజెండానా? సేవా మార్గమా? అనేది ఆసక్తికరం. అయితే, ఇటీవల జరిగిన ఓ ఘటన ఆయన పదవిని వీడేలా చేసిందని.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే ఎక్కువని అంటున్నారు.
ఇటీవల స్వేరోస్ కార్యక్రమంలో ఆయన చేసిన భీమ్ ప్రతిజ్ఞ వివాదాస్పదమైంది. హిందుత్వ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అది బీజేపీ వర్సెస్ దళిత సంఘాల టర్న్ కూడా తీసుకుంది. ఓ దశలో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌పై దాడికి యత్నించారు స్వేరోస్ సభ్యులు. ఆ సమయంలో ప్రవీణ్‌కుమార్ వ్యూహాత్మక మౌనం పాటించి.. ఫక్తు రాజకీయ నేతగా ప్రవర్తించారనే ప్రచారం జరిగింది. స్వేరోస్‌ను కట్టడి చేయకపోవడం, దాడులనూ ఖండించకపోవడం విమర్శల పాలైంది. ఈ పరిణామమే ఆయనను రెచ్చగొట్టిందని.. ఐపీఎస్ అధికారిగా ఉంటే తన చేతులు కట్టేసినట్టు, పరిమితుల్లో ఉండాల్సి ఉంటుందని.. తన సుదీర్ఘ-విస్తృత లక్ష్యం నెరవేరాలంటే ఐపీఎస్ కంటే మెరుగైన వేదిక అవసరమని భావించే.. పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఇంతవరకూ ఓకే.. మరి ఇప్పుడిక ప్రవీణ్‌కుమార్ ముందున్న మార్గమేంటి? ఆయన వ్యూహమేంటి?
ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ వెనుక ఉన్నది కేసీఆరే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ వర్సెస్ స్వేరోస్ ఎపిసోడ్‌లో ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. మౌనంగా, మద్దతు ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ డైరెక్షన్‌లోనే ఆయన రాజీనామా చేశారని, హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ గుసగుసలు భారీగానే వినిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి కరీంనగర్ ఎస్పీగా పనిచేయడం, హుజురాబాద్‌లో దళితుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ వాదనకు కాస్త బలం చేకూరుతోంది. ఇటీవల బీజేపీతో స్వేరోస్‌కు ఏర్పడిన శత్రుత్వంతో.. హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఢీకొట్టడానికి ప్రవీణ్‌కుమార్‌ను అస్త్రంగా ప్రయోగిస్తారనేది ఓ వాదన. ఒకవేళ ఇప్పుడు హుజురాబాద్‌లో పోటీ చేయకపోయినా.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ బాధ్యతలను ప్రవీణ్ కుమార్‌కు అప్పగించే అవకాశం ఎక్కువగా ఉందని కూడా చెబుతున్నారు. ఏలాగైనా ప్రవీణ్‌కుమార్ ఇమేజ్ టీఆర్ఎస్ ఖాతాలోనే పడేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారని అంటున్నారు.
అయితే, అభ్యుదయ భావజాలం, పేదలు-పీడితుల అభివృద్ధి కోసం విస్తృత లక్ష్యం ఏర్పరచుకున్న ప్రవీణ్‌కుమార్.. ఏ హుజురాబాద్‌కో, టీఆర్ఎస్‌లో పరిమితమయ్యే రకం కాదని ఆయన సన్నిహితుల మాట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. స్వేరో సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. లక్షలాది మంది స్వేరో సైన్యంలో ఉన్నారు. చదువుకున్నవారు, ఉద్యోగాల్లో స్థిరపడిన వారంతా స్వేరోలుగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్వేరో సంస్థలో పనిచేస్తున్న సైన్యాన్ని సమీకరించి కొత్త రాజకీయ పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. తద్వారా అణగారిన వర్గాలకు రాజకీయ అధికారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. ఆయన రాజకీయ పార్టీ నెలకొల్పితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యావత్ దళిత సంఘాలన్నీ ఆ పార్టీలో చేరే అవకాశం ఉండొచ్చు.
తెలంగాణలో ప్రస్తుతం పొలిటికల్ తీన్మార్ నడుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ మైదానంలో హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉన్నవి చాలవన్నట్టు.. కొత్తగా షర్మిల సైతం దుకాణం తెరిచారు. అన్నలానే ఒక్కఛాన్స్ కోసం ఆరాటపడుతున్నారు. ఇప్పుడిక ప్రవీణ్‌కుమార్ సైతం కొత్త పార్టీ పెడితే.. దళిత వర్గాలకు ప్రతినిధిగా నిలిస్తే.. తెలంగాణ రాజకీయం ఆసక్తికర టర్న్ తీసుకునే అవకాశముంది. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హామీని తుంగలో తొక్కిన కేసీఆర్ సర్కారుపై దళితులంతా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికే.. కొత్తగా 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. ప్రస్తుతం దళితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలురుగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి రాకతో మరింత ఉత్సాహం పెరిగింది. ఇలాంటి సమయంలో.. దళితులకు రోల్ మోడల్ లాంటి ప్రవీణ్ కుమార్ పార్టీ పెడితే.. ఆ వర్గమంతా కాంగ్రెస్ నుంచి ప్రవీణ్‌కుమార్ వైపు మళ్లడం ఖాయం. అంటే, ప్రవీణ్‌కుమార్ వేయబోయే అడుగులు.. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి ప్రతీకూలంగా మారుతాయని అంటున్నారు. ఇలా ఎలా చూసినా.. ప్రవీణ్‌కుమార్ రాజకీయ జెండా ఎత్తితే.. అది కేసీఆర్‌కే అనుకూలమని చెబుతున్నారు. ఇప్పటికే షర్మిల సైతం కేసీఆర్ ఇషారాతోనే రేవంత్ టార్గెట్‌గా పార్టీ పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక, ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇస్తే..? తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు తెరలేచే అవకాశాలు ఎక్కువే.