హుజురాబాద్ పై వరాల వర్షం.. గులాబీ బాస్ కు ఓటమి భయం?
posted on Jul 20, 2021 @ 12:25PM
ఆరు నూరైనా ... నూరు ఆరైనా.. ఏది ఏమైనా హుజురాబాద్ ఉపఎన్నికలో తెరాస గెలిచి తీరాలి ... ఇందుకోసం ఏమి చేసినా ఓకే... ఎన్ని కోట్లు ఖర్చయినా అభ్యంతరం లేదు... ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మనసులో మాట ఇదేనా ... ఇందుకోసమేనా ఆయన అంతలా శ్రమిస్తోంది, అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి ఇది ముఖ్యమత్రి మనసులో మాట మాత్రమే కాదు, పార్టీ నాయకుల వద్ద ఆయన అంటున్న మాట కూడా ఇదే, అని పార్టీ నాయకులే గుసగుసలు పోతున్నారు.అందుకే ఆయన ఓ వంక పార్టీ నాయకులను పరుగులు పెట్టిస్తున్నారు,మరో వంక ఈటలను ఎదుర్కునే అభ్యర్ధి కోసం వేట కొనసాగిస్తున్నారు. అలాగే, ఇంకో చేత్తో నియోజక వర్గం పై వరాల జల్లు కురిపిస్తున్నారు.
నిజంగా, హుజురాబాద్ లో పరిస్థితి ముఖ్యమంత్రినే కలవరానికి గురిచేసే విధంగా ఉందా... లేక ఇది కేసీఆర్ మార్క్ వ్యూహంలో భాగమా? అనే ప్రశ్న కుడా లేక పోలేదు. అయితే ఏందీ ఏమైనా ఒకే ఒక్క నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? అంటే పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి హుజురాబాద్ ఉప ఎన్నికను, ఒక నియోజక వర్గానికి జరుగుతున్న ఎన్నికగా చూడడం లేదు, పార్టీ, కుటుంబ రాజకీయ భవిష్యత్తును తేల్చే .. మహా సంగ్రామంగా చూస్తున్నారు. ఈటల రాజేందర్ విషయంలో ముఖ్యమంత్రి లెక్క తప్పింది. పరిస్థితి ఇంతవరకు వస్తుందని ఉహించలేదు. అయితే, ఈటల రాజేందర్ వ్యూహత్మకంగా హుజురాబాద్’లో పోటీ తనకు, కేసీఆర్‌కు మధ్యే అన్నట్లుగా వాతావరణాన్ని మలచారు. నేరుగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో,ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో తెరాస ఓడిపోతే, అది కేసేఆర్ ఓటమిగా ముద్రపడుతుంది. కేసీఆర్ కుటుంబ రాజకీయాల ఓటమిగానూ ప్రచారం జరుగుతుంది.పార్టీ పతనానికి చివరి మెట్టు అదే అయినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నాఋ. అంతే కాదు హుజురాబాద్ ఉపఎన్నిక రేపటి ముఖ్యమంత్రి పీఠం ఎవరిదో నిర్ణయించే ఎన్నికగా కూడా భావిస్తున్నారు. అందుకే, ముఖ్యమంత్రి సర్వశక్తులు ఒడ్డుతున్నారని, పార్టీలోనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
హుజురాబాద్ నియోజక వర్గంపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపిస్తున్నారు.ఇప్పటికీ,నియోజకవర్గ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల్లో రూ.66.85 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరాలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇదిగాక నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లోని 106 గ్రామపంచాయతీల్లో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామాల వారీగా చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీణవంక మండలంలో రూ.23 కోట్లు, హుజూరాబాద్ మండలంలో రూ.15 కోట్లు, జమ్మికుంట మండలంలో రూ.7 కోట్లు, ఇల్లందకుంట మండలంలో రూ.10 కోట్లు, కమలాపూర్ మండలంలో రూ.45 కోట్లతో పనులను ప్రతిపాదించారు.
ఇంత చేసిన తర్వాత కూడా గెలుపు మీద ధీమా లేక, దళిత బంధు, పథకం అమలుకు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. నిజానికి ఈ పథకాన్ని తీసుకోచ్చిందే హుజురాబాద్ కోసం.హుజురాబాద్ నియోజక వర్గం పరిధిలో దళిత సామాజిక వర్గం ఓట్లు గణనీయ సంఖ్యలో (46వేల పై చిలుకు ) ఉన్నాయి. ఈ ఓట్లను గంప గుత్తగా కొల్ల కొట్టేందుకే ముఖ్యమంత్రి పైలట్ ప్రాజెక్ట్ అమలుకు హుజురాబాద్ నియోజక వర్గాన్ని ఎంచుకున్నారని అంటున్నారు. సరే, అధికార పార్టీ నాయకులు కరీంనగర్ సెంటిమెంట్’ను జత చేసే ప్రయత్నం చేస్తున్నా, జనాలకు మాత్రం ఇది ఉప ఎన్నికల పథకమే అని అర్థమైపోయింది. అంతే కాకుండా, ఈ పథకం రాష్ట్ర బడ్జెట్ రూ. 1200 కోట్లు అయితే పైలట్ ప్రాజెక్ట్ అమలుచేస్తున్న హుజురాబాద్ కే 1500 నుంచి 2000 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం, పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇదిలా ఉండగా ఈటల రాజీనామా తర్వాత ఒకే సారి అంతవరకు పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన రూ.17.08 కోట్ల చెక్కులనూ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అది కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కాదు. ఒక్క హుజురాబాద్ నియోజక వర్గం పరిధిలోనే పంపిణి చేశారు.ఇలా ఉరుకులు పరుగుల మీద నియోజక వర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారంటే, ఈఒక్క సీటుకు ముఖ్యమత్రి ఏంట్ ప్రధాన్యత ఇస్తున్నారో అర్థం చేస్కోవచ్చునని పరిశీలకులు అంటున్నారు. అయితే, కేసీఆర్ శక్తి సామర్ధ్యాలను తక్కువ అంచనా వేయడం అంటే, అది తమ గొయ్యి తామే తవ్వుకోవంతో సమానమనే మాట కూడా వినవస్తోంది. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నిక గులాబీ బాస్ గుండెల్లో ఈటెలా సలుపుతోంది.