ప్రవీణ్‌కుమార్‌కు ఉచ్చు బిగుస్తోందా? అందుకే రాజీ..నామా?
posted on Jul 20, 2021 @ 11:31AM
ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ స్వచ్చంద పదవీ విరమణ సంచలనంగా మారింది. తెలంగాణ గురుకులాలకు మహర్దశ తీసుకొచ్చిన ఆయన సడెన్‌గా ఆ పదవి నుంచి ఎందుకు వైదొలుగుతున్నారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఏకంగా ఖాకీ యూనిఫామే విప్పేయడానికి కారణం ఏంటి? ప్రభుత్వాల సహకారంతో 9 ఏళ్లుగా కదలకుండా మెదలకుండా ఒకే పోస్ట్‌లో ఉన్న ఆయనకు ఇప్పుడు ఆకస్మికంగా ఏ ఇబ్బంది వచ్చిందని ఆ బాధ్యతలను వదిలేసి వెళ్లిపోతున్నారు. ఏకంగా సర్వీస్‌కే సెలవు ఎందుకు ప్రకటించారు? రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమా? టీఆర్ఎస్‌లో చేరిపోతారా? హుజురాబాద్ నుంచి బరిలో దిగుతారా? దళిత బంధు బాధ్యతలు చేపడతారా? లేక, తానే సొంతంగా పార్టీ పెట్టేసుకుంటారా? స్వేరోస్‌ను రాజకీయంగా డెవలప్ చేస్తారా? ఇలా అనేక ప్రశ్నలు.. అంతకుమించి విశ్లేషణలు...
అయితే, ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్ నుంచి వైదొలగడం వెనుక ఓ బలమైన కారణం ఉందనే విషయం ఆలస్యంగా వెలుగుచూస్తోంది. అది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉండటం.. తన ముందరి కాళ్లకు కళ్లాలు పడతాయని భావించడం వల్లే ఆయన వాలంటరీ రిటైర్‌మెంట్ ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఓ ఘటనలో ఆయనపై ఆరోపణలతో పాటు ఫిర్యాదులూ అందాయని.. ఆ కేసులో ఆయనకు వ్యతిరేకంగా వేగంగా పావులు కదులుతున్నాయని.. ఆ విషయం తెలిసే ప్రవీణ్‌కుమార్ అందులో నుంచి బయటపడేందుకే ఇలా రాజీనామా అస్త్రాన్ని సంధించారని అంటున్నారు. ఆ సంఘటన గురించి అందరికీ తెలిసిందే అయినా.. ఆ తర్వాత ఇన్నాళ్లకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మొదలయ్యాయని తెలుస్తోంది.
ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉంటూ స్వేరోస్ సంస్థను నడిపిస్తుండటం.. ఐపీఎస్‌గా ఉంటూ హిందూ దేవుళ్లను కించపరిచేలా భీమ్ ప్రతిజ్ఞ చేయడం.. స్వేరోస్ సంస్థకు భారీగా నిధులు వస్తున్నట్టు, అందులోనూ ఫారిన్ ఫండ్స్ వెల్లువెత్తుతున్నట్టు.. తదితర ఆరోపణలతో ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ మీద చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా స్పందించినట్టు సమాచారం. ప్రవీణ్‌కుమార్‌పై వచ్చిన ఫిర్యాదుపై తగు చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సెంట్రల్ హోంమినిస్ట్రీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ మేరకు.. ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఈ విషయం తెలిసే.. ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ముందస్తుగా జాగ్రత్త పడ్డారని అంటున్నారు. పదవిలో ఉంటే ఇలాంటి ఆటంకాలు తప్పవని.. ఐపీఎస్‌ను వదిలేస్తే మరింత స్వేచ్ఛగా తన లక్ష్య సాధన కోసం ప్రయత్నించవచ్చని భావించి ఉంటారని అంటున్నారు. తెలంగాణ సర్కారు ఎప్పటిలానే తనకు సహకరిస్తే టీఆర్ఎస్‌లో చేరే అవకాశం లేకపోలేదని.. లేదంటే, స్వేరోస్‌ను మరింత డెవలప్ చేసే పనిలో ఉంటారని.. అవసరమైతే సొంతంగా రాజకీయ పార్టీనీ ప్రారంభించే ఛాన్సెస్ ఉన్నాయని చెబుతున్నారు. డ్యూటీలో ఉండగానే, నిబంధనల చట్రంలో ఉండే.. స్వేరోస్ పేరుతో అంత చేసిన ప్రవీణ్‌కుమార్.. ఇప్పుడిక ఖాకీ చొక్కా విప్పేస్తే...? మరింత ఖతర్నాక్ అవుతారనడంలో డౌటే అవసరం లేదంటున్నారు.