కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి ఎమ్మెల్యేల జంప్!
posted on Jul 20, 2021 @ 11:41AM
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లకు పైగానే సమయం ఉన్నా.. రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. మోడీ సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని భావిస్తున్న కాంగ్రెస్.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీ పదవుల విషయంలోనూ గతానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటోంది కాంగ్రెస్ హైకమాండ్. సీనియర్లను కాదని పైర్ బ్రాండ్ లీడర్లుగా ముద్ర పడిన యువ నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన కాంగ్రెస్ పెద్దలు.. పంజాబ్ లోనూ సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకించినా సిద్దూకే పీసీసీ పగ్గాలు కట్టబెట్టింది.
వచ్చే ఏడాది యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండటంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. అయితే కాంగ్రెస్ కు కౌంటర్ యాక్షన్ స్టార్ట్ చేసింది బీజేపీ. ఈశాన్య రాష్ట్రల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న కమల పార్టీ.. హస్తం పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చింది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు తీరని నష్టమని చెబుతున్నారు.
గోవిందాస్ కొంతౌజమ్ వరుసగా ఆరు సార్లు బిష్నాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంపీసీసీకి చీఫ్ విప్‌గా కూడా పని చేశారు. గతేడాది డిసెంబర్‌లో సోనియా గాంధీ ఆయనను మణిపూర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా నియమించారు. నెల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేసిన గోవిందాస్ ఇంత అనూహ్యంగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.