అంతరిక్ష యాత్రకు జెఫ్ బెజోస్.. 100 కి.మీ ఎత్తుకు న్యూ షెపర్డ్!
posted on Jul 20, 2021 @ 9:39AM
అంతరిక్ష పర్యాటకానికి సంబంధించి కీలకమైన మరో అడుగు పడబోతోంది. దిగ్గజ సంస్థ ‘ఆమెజాన్’ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర మంగళవారం జరగనుంది. 20 ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థకు చెందిన తొలి స్పేస్‌క్రాఫ్ట్ ‘న్యూ షెపర్డ్’ బెజోస్‌తో పాటు నలుగురిని భూమి నుంచి సుమారు 100 కి.మీ.ల ఎత్తున ఉన్న కార్మన్ లైన్‌కు ఆవలికి తీసుకువెళ్తుంది. సరిగ్గా 10 నిమిషాల తరువాత తిరిగి వారిని భూమిపైకి తీసుకువస్తుంది. బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్, మాజీ పైలట్ అయిన 82 ఏళ్ల మహిళ వేలీ ఫంక్, 18 ఏళ్ల యువకుడు ఆలీవర్ డీమన్ ఈ అంతరిక్ష యాత్ర చేయనున్నారు. రోదసిలోకి వెళ్లనున్న అతి పిన్న, పెద్ద వయస్కులు వీరు.
అంతరిక్ష పర్యటకానికి సంబంధించి వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ జూలై 12న చేపట్టిన అంతరిక్ష యాత్ర తొలి అడుగు కాగా, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ టూర్ రెండోది కానుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు బెజోస్ బృందం యాత్ర మొదలుకానుంది. బ్రాన్సన్, శిరీష బండ్ల బృందం వెళ్లిన స్పేస్‌ఫ్లైట్‌ను పైలట్లు నడిపారు. కానీ, బెజోస్ యాత్ర పూర్తిగా ఆటోమేటిక్. దీన్ని నడపడానికి పైలట్లు అవసరం లేదు. పైలట్లు లేకుండా పూర్తిగా సామాన్య పౌరులతో చేపట్టే తొలి రోదసియాత్రగా ఇది నిలవబోతోంది. పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఒక సుదూర ప్రదేశం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. బెజోస్ బృందం 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి కర్మన్ రేఖ దాటి భూమి అందాలను వీక్షించి తిరిగి రానున్నారు.
స్పేస్‌క్రాఫ్ట్ ‘న్యూ షెఫర్డ్’ ప్రయాణానికి సిద్ధంగా ఉందని బ్లూ ఆరిజిన్ సంస్థ అస్ట్రోనాట్ సేల్స్ డైరెక్టర్ ఆరియన్ కార్నెల్ ప్రకటించారు. 1961లో అంతరిక్షానికి వెళ్లిన తొలి అమెరికన్ అలాన్ షెఫర్డ్ పేరును బ్లూ ఆరిజిన్ సంస్థ తమ స్పేస్‌క్రాఫ్ట్‌కు పెట్టింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ తరహాలో దీనిని నిర్మించారు. అయితే, పరిసరాలను 360 డిగ్రీల కోణంలో చూసేలా క్య్రూ క్యాప్సూల్‌ను రూపొందించారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ నిట్టనిలువగా టేకాఫ్ అవుతుంది. అలాగే, నిట్టనిలువుగానే ల్యాండ్ అవుతుంది. ఈ అంతరిక్ష యాత్రకు మరిన్ని ప్రత్యేకతలున్నాయి. శిక్షణ పొందిన అస్ట్రోనాట్స్ ఎవరూ ఇందులో లేరు.
న్యూషెపర్డ్ రాకెట్‌ను అభివృద్ధి చేసిన ఇంజనీర్ల బృందంలో.. మహారాష్ట్రకు చెందిన సంజల్ గవాండే (30) కూడా ఉన్నారు. బ్లూఆరిజిన్ కంపెనీలో సిస్టమ్స్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమె పుట్టిపెరిగిందంతా మహారాష్ట్రలోని కల్యాణ్ నగరంలో. ఆమె తండ్రి అశోక్. కల్యాణ్-డోంబివిలి మునిసిపల్ విభాగం విశ్రాంత ఉద్యోగి. తల్లి సురేఖ రిటైర్డ్ ఎంటీఎన్‌ఎల్ ఉద్యోగి. ముంబై వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ పూర్తిచేసిన ఆమె..మిషిగన్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం విస్కాన్సిన్‌లో మెర్క్యురీ మెరైన్ అనే సంస్థలో పనిచేశారు. తర్వాత టొయోటా రేసింగ్ డెవల్‌పమెంట్‌లో పనిచేశారు. 2016లో పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత.. నాసాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారు. కానీ, పౌరసత్వ సమస్యల వల్ల ఆమెకు నాసాలో ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె బ్లూఆరిజిన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసి సిస్టమ్స్ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు.