నా ప్రాణం నువ్వు.. నేను చనిపోతే గానీ నా ప్రేమ విలువ నీకు తెలుస్తుంది.
posted on Jul 19, 2021 @ 6:07PM
నా ప్రాణం నువ్వు.. నేను చనిపోతే గానీ నా ప్రేమ విలువ నీకు తెలుస్తుంది. ఇది సినిమా డైలాగ్ కాదు, నిత్యాజీవితంలో జరిగిన సంఘటన. ఈ మాటలు చెపుతూ ఒక వ్యక్తి తాను ప్రేమించిన ప్రియురాలి కోసం నిండు ప్రాణం తీసుకున్నాడు. ఆ టైం లో అమ్మానాన్న ఎవరు గుర్తుకు రానట్లు ఉన్నారు ఆతనికి. అయినా నేటి తరం యువత వెనక ముందు ఆలోచించకుండా క్షణకాలంలో ప్రేమ అనే చిన్న విషయం కోసం తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు యువత. తాజాగా హైదరాబాద్‌లో అమీర్‌పేట్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. సహజంగా తెలిసి తెలియని వయసు వాళ్ళు ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఐతే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో షోస్ట్ చేశాడు. వివరాల్లోకెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్ (29) అమీర్‌పేట్‌లోని ఓ గదిలో స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇక్కడే ప్రభుత్వం ఉద్యోగానికై ప్రిపేర్ అవుతున్నాడు.
ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. ఆ పరిచయం ఓ అమ్మాయితో ప్రేమలో పడేట్టు చేసింది సుధాకర్ ను. అయితే, సుధాకర్ ప్రేమకు ఆ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఆ కారణంగానే తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నా ప్రేమను నువ్వు నమ్మేలా లేవు. నా చావుతో అయినా నాది నిజమైన ప్రేమ అని తెలుసుకుంటావు’ అంటూ ఆ వీడియోలో తన ప్రేమను వ్యక్తపరిచాడు. పాపం అతను చనిపోయాక అతని ప్రాణం, అతని ప్రేమ రెండు తిరిగిరావని తెలుసుకోలేకపోయాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుధాకర్.. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, స్నేహితులు గదికి వచ్చి తలుపు తట్టగా ఎంతకీ తీయలేదు. దాంతో అనుమానం వచ్చి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లారు. గదిలో సుధాకర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే వారు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని సుధాకర్ మృతదేహాన్ని కిందకు దించారు. సుధాకర్ తీసుకున్న సెల్పీ వీడియోను గుర్తించారు. ప్రేమ విఫలం అవడం కారణంగానే సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించుకున్న పోలీసులు.. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.