అమిత్‌షాతో రఘురామ మీటింగ్.. జగన్‌కు చెక్ పెడతారా?
posted on Jul 20, 2021 @ 8:24PM
రఘురామ. ఈ పేరు వింటేనే జగన్‌కు ఉలిక్కిపాటు. రఘురామ మీడియాతో మాట్లాడినా, తనకు లేఖలు రాసినా.. జగన్‌లో కలవరపాటు. సీబీఐ కోర్టులో కేసు వేసినా, స్పీకర్‌ను కలిసినా, ఎంపీలకు లేఖలు రాసినా, ఎన్‌హెచ్ఆర్డీకి ఫిర్యాదు చేసినా.. ఆఖరికి రఘురామ తుమ్మినా, దగ్గినా జగన్‌కు హైరానే. వీటికే ఇంతలా కంగారు పడే జగన్.. ఇక రఘురామ అమిత్‌షాతో భేటీ అయ్యారనే బ్రేకింగ్ న్యూస్ తెలిసి ఇంకెంతగా ఇదైపోతున్నారో ఊహించుకోవచ్చు. అవును, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సమావేశమయ్యారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. రఘురామ ఆరోగ్య పరిస్థితిని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.
ఇన్ని విషయాలు మాట్లాడుకున్న వారిద్దరూ సీఎం జగన్ గురించి మాట్లాడకుండా ఉంటారా? సీబీఐ కోర్టులో ఉన్న జగన్ బెయిల్ రద్దు కేసు ప్రస్తావనకు రాకుండా ఉంటుందా? సీఐడీ కస్టడీలో ఓ ఎంపీ అయిన తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకురాకుండా ఆగుతారా? డౌట్ ఎందుకు? ఆ విషయాలన్నీ చర్చకు వచ్చాయంటున్నారు. అసలు, జగన్ సంగతి అటోఇటో తేల్చేసేందుకే రఘురామ.. అమిత్ షాను కలిశారని అంటున్నారు. రఘురామ తనకు ఏం చెబుతారో తెలిసే.. ఆ సంగతులన్నీ వినేందుకే అమిత్‌షా సైతం రఘురామకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని చెబుతున్నారు.
ఓవైపు సీబీఐ కోర్టులో కేసు.. మరోవైపు పార్లమెంట్‌లో గతానికి భిన్నంగా వైసీపీ ఎంపీల నిరసనలు. ఇటు, ఎంపీ రఘురామపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలనే పట్టుదలలో వైసీపీ. అటు, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఏపీ సర్కారును పార్లమెంట్ ముందు దోషిగా నిలబెట్టాలనే కసిలో రఘురామ. ఇలా పలు విషయాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఎంపీ రఘురామ చర్చించారని తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలు, సీఎం జగన్‌రెడ్డి తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కోర్టుల్లో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు, ఆలయాలపై దాడులు.. ఇలా అన్నిటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ రఘురామ.
సీఎం జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఏదో జరుగుతోందని.. వేగంగా పావులు కదులుతున్నాయని అంటున్నారు. పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీల ధిక్కారస్వరాన్ని సైతం కేంద్రం సీరియస్‌గా తీసుకుందని చెబుతున్నారు. అందుకే, వైసీపీకి ఝలక్ ఇచ్చేందుకే రఘురామకు అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఈ నెల 26న సీబీఐ కోర్టులో తీర్పు రాబోతుండగా.. జరిగిన ఈ భేటీలో కీలక విషయాలే ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది.
అమిత్‌షా-రఘురామ భేటీతో జగన్‌రెడ్డిలో గుండెదడ అమాంతం పెరిగిందని అంటున్నారు. రఘురామ మళ్లీ తనను ఎలా బుక్ చేయబోతున్నాడో.. అందుకు కేంద్రం నుంచి ఎలాంటి సహాయాన్ని కోరాడనే టెన్షన్ జగన్ కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోందనేది ఆయన సన్నిహితుల మాట.