సీఎం జగన్ తీరుతో రాయలసీమకు నష్టం!
posted on Jul 21, 2021 @ 12:42PM
కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. తెలంగాణ సర్కార్ దూకుడుగానే వెళుతోంది. శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయిలోనే ఉన్నా ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో పవన్ జనరేషన్ చేస్తూ నీటిని దిగువకు వదులుతోంది. కొన్ని రోజుల క్రితం నాగార్జున సాగర్, పులిచింతలలోనూ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదలడంతో దాదాపు నాలుగు టీఎంసీల నుంచి ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వెళ్లాయి. కృష్ణా జలాలపై తాజాగా జరుగుతున్న పరిణామాలతో రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం నీటిని వృధాగా వదిలేస్తున్నా జగన్ సర్కార్ కట్టడి చేయలేకపోతుందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, చేతగానితనంతో రాయలసీమకు తీరని నష్టం జరిగే అవకాశం ఉందని మాజీ మంత్రి, రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు మైసూరా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటోందని చెప్పారు. తెలంగాణకు ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతోందని ఆయన తప్పుబట్టారు. ఇద్దరు సీఎంలు కూర్చుని ఎందుకు మాట్లాడుకోవడం లేదని మైసూరా రెడ్డి ప్రశ్నించారు. మిత్రులుగా ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు జల వివాదంలో మాట్లాడుకోవడానికి ఎందుకు భేషజాలు అడ్డం వస్తున్నాయని నిలదీశారు.
ఇతర రాష్ట్రాల సీఎంలు నీటి సమస్యలను చర్చించుకోవడం లేదా అని మైసూరా రెడ్డి ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఏపీకి మంచిది కాదని హితవుపలికారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టని మైసూరారెడ్డి అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మౌనం వీడరపోతే రాయలసీమ ఎడారిలా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి కేటాయించిన నీటిని ఎక్కడికైనా తరలించే అవకాశం ఆ రాష్ట్రానికి ఉంటుందన్నారు. పెన్నా బేసిన్ కు కృష్ణా జలాలను తరలిస్తున్నారన్న తెలంగాణ ఆరోపణలకు పస లేదన్నారు. ఇప్పటికైనా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి వివాదానికి చెక్ పెట్టాలని ఆయన సూచించారు.