షర్మిల పార్టీకి రేవంత్ రెడ్డి దెబ్బ? ఇక జెండా ఎత్తేయడమేనా?
posted on Jul 21, 2021 @ 10:50AM
డబ్బు ఖర్చు పెట్టారు.. హైప్ క్రియేట్ చేసుకున్నారు..హల్ చల్ చేద్దామనుకున్నారు. కాని కరోనా ఒకరకమైన దెబ్బకొడితే... రేవంత్ రెడ్డి మరో దెబ్బ కొట్టారు. దీంతో లాంఛింగ్ లాంఛనంగా మిగిలిపోయింది. పోరుబాట అంటూ మొదలెట్టిన వారం వారం మంగళవారం నిరాహారదీక్షలు పేలవంగా ముగుస్తున్నాయి. దీంతో మేడమ్ ను నమ్ముకున్నవారిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీళ్లు ప్రయత్నిస్తే చూద్దామన్న లీడర్లంతా మొహం చాటేస్తున్నారు. కొత్త లీడర్లు చాలామంది వస్తారు.. హడావుడి చేద్దామనుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. మరోవైపు హూజూరాబాద్ లో పోటీ చేసేది లేదంటూ కుంటిసాకులు చెబుతూ అధినేత్రి చేసిన ప్రకటన కూడా ఇమేజ్ డ్యామేజ్ చేస్తోంది.
వైఎస్సార్టీపీ ఆవిర్భావానికి ముందున్న ఉత్సాహం ఇప్పుడు కనపడటం లేదు. ఆ ఉత్సాహం కూడా మీడియా ఉరిమిందే గాని...సహజంగావచ్చింది కాదన్న విషయం పక్కనబెడితే..ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పటికీ పుష్ చేయడానికి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నా...ఒకవైపు కేసీఆర్ స్పీడు పెంచడం..మరోవైపు స్పీడున్న రేవంత్ రెడ్డి రంగంలోకి రావడంతో.. వారిద్దరి నడుమ ఇంకెవరూ కనపడని పరిస్ధితి ఏర్పడింది. బిజెపియే వెనకబడినట్లు కనపడుతుంటే.. ఇక ఈ కొత్త పార్టీ..అది కూడా అర్దం లేని లాజిక్కులు చెప్పే పార్టీ ఇంకేం కనపడుతుంది.?
నిరుద్యోగ సమస్యను ఎత్తుకున్న షర్మిల.. దానిపైనే ముందుకెళుతున్నారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్యపైనే పోరాటం ఉంటుందని పీసీసీ చీఫ్ కాగానే ప్రకటించారు. దీంతో ఆయనకు పోటీగా అన్నట్లుగా కార్యాచరణ ప్రకటించింది షర్మిల. ఒకవైపు కేసీఆర్ నియామకాల పేరుతో హడావుడి మొదలెట్టారు. దీంతో రేవంత్ రెడ్డి తెలివిగా నిరుద్యోగుల పోరాటాన్ని వాయిదా వేసుకుని..పెట్రోల్ ధరలు, ఇతర సమస్యలపై పోరు మొదలెట్టారు.ఛలో రాజ్ భవన్ అంటూ వేడి పుట్టించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెగాసస్ స్పై వేర్ అలజడి రేగింది. దీనిపై కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్నకర్తవ్యం అదే.
ఇలాంటి సమస్యలపై షర్మిల ఎక్కడా మాట్లాడటం లేదు. బిజెపిపై ఒక్క మాటగాని, ఒక్క విమర్శ గాని ఇప్పటివరకు షర్మిల చేయకపోవడం గమనించాలి. ఎంఐఎం మీద కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం రాజన్న రాజ్యం తెస్తామనే మాట తప్ప.. రాజకీయంగా రకరకాల ఇష్యూస్ మీద తమ విధానం ఏంటో క్లారిటీ లేదు. అదేమంటే ఇప్పుడే కదా మొదలెట్టింది అంటారు. ముఖ్యమంత్రి అయిపోతామని..తమదే అధికారం అని చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఇలాంటి కారణాలు ఉండవు మరి.
హుజూరాబాద్ లో పోటీ చేయకపోవడం కూడా ఓ రాజకీయ వ్యూహాత్మక తప్పిదంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. డిపాజిట్ కూడా రాకపోతే ఆదిలోనే పరువు పోతుందనే పోటీకి దిగడం లేదని అందరికీ అర్ధమైంది. కాని అసలు పోటీకి దిగపోతే.. ప్రత్యామ్నాయ పార్టీ ఎలా అవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అనే విమర్శలను కౌంటర్ చేయలేక నానా తిప్పలు పడుతున్నారు షర్మిల, ఇతర నేతలు. వైఎస్సార్ ఉండుంటే అసలు రాష్ట్రం విడిపోయేది కాదని అందరూ చెప్పుకునే మాటే. అలాంటి నేత కుమార్తెగా..పైగా అదే వారసత్వం అంటూ వచ్చిన ఆంధ్రా ఆడపడచు షర్మిలను తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారా అంటే కష్టమే అనిపిస్తోంది. కేవలం ఒక మార్కెటింగ్ కంపెనీలాగా నేతలను, కార్యకర్తలను సమకూర్చుకోవడమే తప్ప..ఎలాంటి భావోద్వేగం.. ఎలాంటి రాజకీయ ఆకర్షణ లేకుండా వైఎస్సార్టీపీ అడుగులు వేస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి మరి.