ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ ఆమోదం.. భవిష్యత్ కార్యాచరణ ఇదేనా?
posted on Jul 20, 2021 @ 7:38PM
ఐపీఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణను ప్రభుత్వం ఆమోదించింది. ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు సోమవారం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం విధుల నుంచి రిలీవ్ చేస్తూ నిర్ణయం వెలువరించింది. ప్రవీణ్‌కుమార్ రాజీనామాతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఐపీఎస్ గా 26 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం అడిషనల్ డీజీ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తన నిర్ణయాన్ని ప్రభుత్వ కార్యదర్శికి ఈ మెయిల్ ద్వారా పంపించారు. తనపై నమ్మకంతో పలు బాధ్యతలు అప్పగించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందాలన్నారు. ప్రవీణ్ కుమార్ ఎవ్వరికీ అమ్ముడుపోడని తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడనున్నట్లు తెలిపారు. పూలే దంపతులు, అంబేద్కర్, కాన్షీరాం చూపిన బాటలో నడుస్తానని ప్రవీణ్ కుమార్ తాను రాసిన లేఖలో వెల్లడించారు. దీన్నిబట్టి ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ స్వచ్చంద పదవీ విరమణ తెలంగాణలో సంచలనంగా మారింది. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన రాజకీయాల్లోకి వెళతారా? టీఆర్ఎస్‌లో చేరిపోతారా? హుజురాబాద్ నుంచి బరిలో దిగుతారా? దళిత బంధు బాధ్యతలు చేపడతారా? లేక, తానే సొంతంగా పార్టీ పెట్టేసుకుంటారా? స్వేరోస్‌ను రాజకీయంగా డెవలప్ చేస్తారా? ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఆదిలాబాద్ నుంచే నా ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని వీఆర్‌ఎస్ ప్రకటించిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాలతోనే మొత్తం వ్యవస్థ మారుతుందనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు.
ప్రవీణ్‌కుమార్ ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరి, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీకి దిగుతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. కానీ టీఆర్‌ఎస్ ముఖ్యులు దాన్ని కొట్టిపారేస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితోనే వీఆర్‌ఎస్ ప్రకటించిన ప్రవీణ్‌కుమార్, ఆ పార్టీలో చేరుతారని ఊహించటం కష్టమని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఇక ప్రవీణ్‌కుమార్ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి వ్యతిరేకమైనందున.. బీజేపీలోనూ చేరే అవకాశం లేదు. ‘జై భీం’ పేరుతో కొత్త పార్టీ పెడతారని, లేకపోతే రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) బాధ్యతలు చేపట్టి, రాజకీయంగా ముందుకు వెళ్తారని సన్నిహితులు అంచనా వేస్తున్నారు.