అన్నీ ఎదురుదెబ్బలే.. అయినా జగనన్న తీరు మారలే!
posted on Jul 21, 2021 @ 10:16AM
మనం లోపలికి వెళ్లకముందే వాళ్లని లోపలికి పంపించాలి. జైలుకెళ్లడం అనేది రాజకీయ కుట్ర తప్పితే.. వేరే కాదని అలా నిరూపించాలి. ఇంత చేసి ప్రజల ముందు నేరస్తుడిలా నిలబడకూడదు. జైలుకెళితే సానుభూతి రావాలి తప్ప.. వ్యతిరేకత రాకూడదు. అందుకే ఎంత స్పీడుగా విచారణ చేసి.. ప్రత్యర్ధిని లోపల వేస్తే..అంత మంచిది. ఇది జగనన్న స్క్రిప్టు. కాని దేవుడు వేరేగా స్క్రిప్టు రాస్తున్నట్లున్నాడు. అందుకే ఏ పని కావటం లేదు. రోజురోజుకు ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది. ఇంకెన్నాళ్లు నేనా ఆర్టిఫిషియల్ చిరునవ్వుతో ఫోజులివ్వాలి..హాయిగా నన్ను నవ్వుకోనివ్వరా అని జగన్ అధికారులపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది.
అమరావతిని సెంటర్ పాయింట్ చేసుకుని తెలుగుదేశాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాలని ప్లాన్ వేస్తే..అది ఎప్పటికప్పుడు ఎదురు కొడుతుంది. అప్పటికప్పుడు అంతా బాగానే ఉంది.. దెబ్బ పడిందన్నట్లు అనిపిస్తుంది.. మరికొన్ని రోజులకే రివర్స్ అవుతుంది. అందుకు అధికారుల తప్పులో.. సాంకేతిక వ్యవహారాలో కారణాలని భ్రమిస్తున్నారు. అంతేగాని అసలు సబ్జెక్టులోనే లోపం ఉందని అనుకోవడం లేదు.ముందు మూడు రాజధానులు ప్రకటించి..అమరావతిని జీరో చేసి.. ఆర్ధికంగా దెబ్బకొట్టామనుకున్నారు. అక్కడ భూములు కొన్న టీడీపీ నేతలంతా స్మాష్ అనుకున్నారు. కాని మొత్తం రైతులను దెబ్బ తీస్తున్నామనే సంగతి మర్చిపోయారు. ఆ రైతుల్లో అన్ని సామాజికవర్గాల వారున్నారని గాని..వారు తమకు ఓటేశారన్న సంగతి గాని పూర్తిగా వదిలేశారు. దీంతో నెగెటివ్ ఎఫెక్ట్ ఓ రేంజ్ లో వచ్చి పడింది.
ఇక తర్వాత ఇన్ సైడర్ ట్రేడింగ్ అని మొదటి నుంచి చెబుతున్న ఆవు కథనే మళ్లీ బయటికి తీశారు. సీఐడీ విచారణ అన్నారు.. నోటీసులన్నారు. కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. మళ్లీ ఒకరోజు సడెన్ గా రైజ్ చేశారు. ఏకంగా సుప్రీంకోర్టు జడ్జినే వివాదంలోకి లాగారు. ఆయన ప్రమోషన్ కే అడ్డం పడదామనుకున్నారు. ఏదీ అవలేదు. పైగా ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ ఆ ఆరోపణల కేసులను కొట్టిపారేశాయి. ఇక ఈ విషయంలో చేయగలిగింది కూడా ఏమీ మిగల్లేదు.అసైన్డ్ ల్యాండ్స్ దళితుల నుంచి బలవంతంగా లాక్కున్నారని.. బినామీ పేర్లతో రాజధాని బెనిఫిట్ పొందారని ఇంకో ఆరోపణల పర్వం మొదలెట్టారు. దీని కోసం స్టింగ్ ఆఫరేషన్లు చేసి..సీఐడీ అధికారులను తిప్పి నానా హంగామా చేశారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి వాయించేశారు. ఇంత చేసినా.. ఆ దళితులు మాత్రం అదంతా అబద్ధం అని చెప్పడంతో అంతా తుస్ మంది.
ఇక ఏపీ ఫైబర్ నెట్ లో టెండర్లలో అక్రమాలు అంటూ మరోటి మొదలెట్టారు. దీనిని అప్పటి ఐటీ మంత్రి లోకేష్ మెడకు చుట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆత్రంగా విచారణలకు ఆదేశాలిచ్చినా..ఆధారాలు లేక అవి చతికిలపడుతున్నాయి. ఇది కూడా అంతే. అప్పటి అధికారి అయితే నేరుగా సవాల్ చేశారు.. అక్రమం,అవినీతి అనేది ప్రూవ్ చేసి చూపించండి అంటూ గట్టిగానే ఛాలెంజ్ చేశాడు. ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ ఆ కేసులో లేదు. చట్టాన్ని ప్రయోగించి ఎలా ఇరికించాలని చూస్తున్నారే తప్ప..తర్వాత కోర్టు చేతిలో మొట్టికాయలు తప్పవని ఇప్పటికే అనుభవం వచ్చినా తెలుసుకోలేకపోతున్నారు. మరి జగనన్న ఎప్పటికి సాటిస్ ఫై అవుతారో? ఈ కేసుల కథలు ఎప్పటికి ముగుస్తాయో?