రేవంత్ రెడ్డి మరో సంచలనం.. ఆయనకు మూడినట్టేనా?
posted on Jul 20, 2021 @ 4:48PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే షాకులు ఇస్తున్నారు. రోజూ ఏదో ఒక కార్యక్రమంతో హల్ చల్ చేస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇక రేవంత్ ఎప్పుడు ఏం చేస్తారోనని తెలంగాణ పోలీసులు టెన్షన్ పడుతున్నారు. ఇటీవలే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఛలో రాజ్ భవన్ కు పిలుపిచ్చి పోలీసులకు, ప్రభుత్వానికి చుక్కలు చూపించారు రేవంత్ రెడ్డి. సోమవారం కోకాపేట భూముల సందర్శనకు పిలుపివ్వడంతో అర్ధరాత్రి నుంచే పోలీసులు పహారా కాశారు. కేసీఆర్ సర్కార్ పై రోజుకో సంచలన ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. మరోసారి ఆందోళనకు పిలుపిచ్చారు.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై గురువారం ఛలో రాజ్ భవన్ కు పిలుపిచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మోడీ సర్కార్ తో పాటు తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ హ్యాకింగ్ కు పాల్పడ్డాయని ఆరోపించారు. సమాజం మేలు కోసం పనిచేసే వారి ఫోన్లను హ్యాక్ చేసి కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫోన్ హ్యాకింగ్ వ్యవహారాన్ని 2019లో వాట్సాప్ సంస్థ రెండు సార్లు హెచ్చరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ ప్రధాని మోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లు దేశ ద్రోహానికి పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. దేశంలో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రతిపక్ష నేతలతో పాటు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్లు కూడా హ్యాకింగ్ కు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీడియా ప్రతినిధులు కూడా హ్యాకింగ్ భాధితులేనని చెప్పారు. తెలంగాణ లో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉందన్నారు. తెలంగాణ ఇంటలిజెన్స్ ఛీఫ్ ప్రభాకర్ రావు వ్యవహార శైలి, ఆయన నియామకం పై కేంద్ర హోంశాఖ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.తెలంగాణలో పోలీస్ ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను , ఇజ్రాయిల్ నుండి ఫోన్ హ్యాకింగ్ సాఫ్ట్ వేర్ కొనుగోలుకోసం కేటాయించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని ఆయనే గతంలో చెప్పారన్నారు. ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం పై ఆరోపణలు చేసిన సహాయ మంత్రి కి, మోడి కేబినెట్ హోదా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఫోన్ హ్యాకింగ్ పై గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా? అని నిలదీశారు. అవసరం అయినప్పుడు పార్లమెంట్ లో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావన చేస్తానని తెలిపారు రేవంత్ రెడ్డి.