నిండా మునిగిన చైనా.. 1000ఏళ్ల రికార్డు వాన...
posted on Jul 21, 2021 @ 12:01PM
కరోనా పాపం.. శాపంగా మారి ముంచెత్తిందో లేక, ప్రకృతి పగబట్టిందో తెలీదు కానీ, చైనాలోని హెనన్ ప్రావిన్స్‌ను భారీ వర్షాలు కుదిపేశాయి. గడిచిన వెయ్యి ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురిసింది. భారీ వర్షంతో భీకర వరద ముంచెత్తింది. ఇటు వాన, అటు వరద.. రెండూ కలిసి హెనన్ ప్రావిన్స్‌ను హెల్‌గా మార్చేశాయి.
భారీ వర్షాలతో ఎల్లో నది ఉప్పొంగడంతో వరదలు వచ్చాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. కార్లన్నీ నీటిలోనే. మెట్రో స్టేషన్లు వరద నీటిలో కలిసిపోయాయి.
వీధుల్లో నడుంలోతు నీళ్లు వచ్చాయి. బస్సు, రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. 250కి పైగా విమానాల రాకపోకలను నిలిపివేశారు.
జెంగ్జౌలోని ఓ సబ్‌వే టన్నెల్‌లోకి వరద నీరు భారీగా చేరడంతో అందులో నుంచి వెళ్తోన్న రైల్లోకి నీరు వచ్చింది. అనేక మంది రైల్లో చిక్కుకుపోయారు. ఛాతీ వరకు నీటిలో నిల్చున్న ప్రయాణికుల వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హెనన్ ప్రావిన్స్.. అనేక వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక. చైనా అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది. శనివారం నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ‘ఐఫోన్ సిటీ’గా పిలిచే ప్రావిన్స్ రాజధాని జెంగ్జౌలో మంగళవారం ఒక్కరోజే 457.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం నుంచి సగటున 640.8 మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత 1000ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. వాన, వరద ధాటికి అనేక మంది చనిపోయారు. లక్ష మంది వరకూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.