ఢిల్లీపై డ్రోన్ అటాక్స్?.. ఆగస్ట్ 5 టార్గెట్! ఆ రోజే ఎందుకంటే?
posted on Jul 20, 2021 @ 4:07PM
ముష్కరులు బరి తెగిస్తున్నారు. దేశ రాజధానిపై దాడులకు మరోసారి కుట్ర చేస్తున్నారు. మోదీ సర్కారు వచ్చాక ఉగ్రవాదుల కుతంత్రాలకు చెక్ పడుతుండటంతో అసహనంతో రగిలిపోతున్నారు. సరిహద్దులు కట్టుదిట్టం చేయడంతో.. ఇక స్లీపర్ సెల్స్‌ను దాడులకు ఉసిగొల్పుతున్నారు. దుర్బంగా రైలు బాంబు ఘటనలు అందులో భాగమేనంటున్నారు. మరోవైపు, కశ్మీర్‌లో డ్రోన్ అటాక్స్‌తో టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల ఓ సైనిక వైమానిక కేంద్రం టార్గెట్‌గా ఉగ్రవాదులు డ్రోన్లతో బాంబు దాడి చేయడం కలకలం రేపింది. ఆ తర్వాత వరుసగా పలుమార్లు టెర్రర్ డ్రోన్లు కశ్మీర్‌లో చక్కర్లు కొట్టడంతో సైన్యం అప్రమత్తమైంది. అదే డ్రోన్ అటాక్స్‌ను స్పూర్తిగా తీసుకొని.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం బాంబు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికతో భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఇండిపెండెన్స్ డే కి ముందు ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించాయి.
జమ్మూకశ్మీర్‌లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరంపై ఇటీవల డ్రోన్ దాడి జరిగింది. అదే తరహాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో ఈ సారి ఢిల్లీపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. ఆగస్టు 5న దాడి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే, భారత ప్రభుత్వం 2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తున్న అధికరణం 370ని రద్దు చేసింది. అందుకు ప్రతీకారంగా ఆ రోజున ఉగ్రవాదులు డ్రోన్ల సహాయంతో ఢిల్లీలో బాంబు దాడులు చేయొచ్చని నిఘావర్గాలు పసిగట్టాయి.
ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు నగరంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్ ఉగ్రమూకలు దాడులకు పాల్పడొచ్చని భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో నగరంలో అశాంతిని సృష్టించడానికి ఉగ్రమూకలు పెద్ద కుట్రనే పన్నుతున్నాయని భద్రతా సంస్థలు అలర్ట్ చేశాయి.
ఇంటెలిజెన్స్ విభాగం సహా ఢిల్లీలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. డ్రోన్ దాడులకు అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. చారిత్రక ఎర్రకోట వద్ద నాలుగు యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. విద్రోహ డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. ఏవైనా అనుమానాస్పద విషయాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.