పార్లమెంట్‌లో వైసీపీ రచ్చ.. యాక్షనా? ఓవరాక్షనా?
posted on Jul 20, 2021 @ 5:10PM
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది. ఈ రెండేళ్లలో పలుమార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. అన్నిసార్లు వైసీపీ ఎంపీలు సభకు హాజరయ్యారు. పార్లమెంట్ క్యాంటీన్లలో కాఫీలు, టిఫినీలు చేశారు. సభలో చప్పట్లు కొట్టారు. బిల్లుల విషయంలో కేంద్రానికి ఫుల్లుగా సహకరించారు. అప్పుడెప్పుడూ వారికి ప్రత్యేక హోదా గురించి రాజ్యసభలో గట్టిగా గళమెత్తాలని అనిపించలేదు. అప్పుడెప్పుడూ వారికి పోలవరం నిధులపై లోక్‌సభలో నిలదీయాలని తోచలేదు. సడెన్‌గా.. వైసీపీకి రెండేళ్ల తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు గుర్తొచ్చినట్టున్నాయి. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయంపై కొత్తగా ఇప్పుడే వారికి జ్ఞానోదయం అయినట్టుంది. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండగా హోదా అడగటం మినహా మనమేమీ చేయలేమన్న జగన్‌రెడ్డి.. అకస్మాత్తుగా కేంద్రం విషయంలో తన స్టాండ్ మార్చేసుకున్నారు. బహుషా, గతరాత్రి ఏ జీససో, వైఎస్సారో ఆయనకు హితబోధ చేసుంటారని అంటున్నారు. ఆ వెంటనే.. పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు యాక్షన్‌లోకి దిగిపోయారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ లాబీలోకి దూసుకొచ్చేశారు. వరుసగా రెండురోజులుగా ప్రత్యేక హోదా కోసం సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.
ఇక పెద్దల సభలో తమ పార్టీ పెద్దాయన యాక్షన్ చూసి.. లోక్‌సభలోనూ వైసీపీ ఎంపీలు నిరసన స్వరం పెంచేశారు. అక్కడ ప్రత్యేక హోదా డిమాండ్ అయితే, ఇక్కడ పోలవరం నిధుల కోసం ఫైటింగ్. ఇలా ఉభయ సభలో వైసీపీ ఎంపీలు చేస్తున్న హంగామా చూసి.. యావత్ దేశమే ఆశ్చర్యపోతోంది. అదేంటి? మోదీకి నమ్మిన బంటుల్లా ఉండే వైసీపీ ఎంపీలు ఇలా ఒక్కసారిగా ఎదురుతిరగడమేంటని తెగ చర్చించుకుంటున్నారు. అయితే, ఎవరికీ వైసీపీ ఎంపీల చిత్తశుద్ధి మీద నమ్మకం మాత్రం కలగడం లేదు. వీరి హడావుడి వెనుక ఏదో మతలబు ఉండే ఉంటుందని చర్చించుకుంటున్నారు. అదేంటబ్బా.. అని చెవులు కొరుక్కుంటున్నారు.
సీబీఐ కోర్టులో జగన్‌రెడ్డి బెయిల్ రద్దు విచారణ వేగంగా జరుగుతోంది. ఇన్నాళ్లూ జగన్‌కు సీబీఐ బాగా సహకరించిందని అంటారు. ఇప్పుడిక ఆ దర్యాప్తు సంస్థ నుంచి సహాయ నిరాకరణ వస్తోందని చెబుతున్నారు. జగన్ బెయిల్ రద్దుపై జోక్యం చేసుకోబోమని, కోర్టు ఇష్ట ప్రకారమే నిర్ణయం తీసుకోవచ్చని సీబీఐ చెప్పడంతో జగన్‌రెడ్డి షాక్ తిన్నారు. ఆ తర్వాత ఢిల్లీ పర్యటనలతో ఏదో ప్రయత్నించారు. దీంతో బెయిల్ రద్దుపై తాము కూడా కౌంటర్ వేస్తామంటూ ఇటీవల సీబీఐ స్టాండ్ మార్చుకుంది. ఇప్పుడు సీబీఐ వేయబోయే ఆ కౌంటర్ ఏంటనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. జగన్ బెయిల్ రద్దు చేయాలనే సీబీఐ సైతం కౌంటర్ దాఖలు చేస్తుందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి వైసీపీలో కలవరపాటు మొదలైందని అంటున్నారు. కేంద్రం నుంచి సీబీఐ రూపంలో సహాయ నిరాకరణ ఎదురవుతోందని.. అదే జరిగితే.. జగన్ బెయిల్ రద్దైతే.. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయం జగన్‌ను అసహనానికి గురి చేస్తోందని అంటున్నారు.
అటు, తనకు పంటికింద రాయిలా మారిన ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ కొంతకాలంగా గట్టిగా ప్రయత్నిస్తోంది. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. ఆయన నుంచి ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. రఘురామపై వేటు వేయడం కేంద్రానికి ఇష్టం లేదని.. అందుకే స్పీకర్ విషయాన్ని నానుస్తున్నారని రగిలిపోతోంది వైసీపీ. కేవలం ఒక ఎంపీపై వేటు వేయించుకోలేకపోతే.. ఇక తాము కేంద్రానికి ఊడిగం చేసేది ఎందుకని జగన్ ఫ్రస్టేషన్‌కి గురవుతున్నారట. అందుకే, పార్లమెంట్ వేదికగా కేంద్రానికి ఓ ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.
తమకు సహకరించకపోతే కేంద్రానికి కూడా సహకరించమని.. రాజ్యసభలో పూర్తిస్థాయి సంఖ్యాబలం లేని బీజేపీకి వైసీపీ సహాయం తప్పనిసరి అని గుర్తు చేయడానికే.. వైసీపీ ఎంపీలు ఇలా పార్లమెంట్ సమావేశాలను అడ్డుకొని.. పరోక్షంగా కేంద్రానికి వార్నింగ్ ఇస్తున్నారని అంటున్నారు. ఇందులో స్వప్రయోజనాలే దాగున్నాయి కానీ, వైసీపీ ఎంపీల ఆందోళన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదంటున్నారు. ఇదంతా కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేసే ఎత్తుగడేనని.. వన్స్, సీబీఐ కోర్టులో తనకు రూట్ క్లియర్ అయితే.. మరో మూడేళ్ల వరకూ పార్లమెంట్‌లో వైసీపీ తరఫున ఇక ఇలాంటి సీన్లు చూసే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. అప్పటి వరకూ పార్లమెంట్‌లో ఈ హైడ్రామా కంటిన్యూ కావొచ్చని చెబుతున్నారు. చూడాలి వైసీపీ ఎంపీల చిత్తశుద్ది ఎంతవరకూ ఉంటుందో...