రేవంత్ సభకు సీనియర్లు బ్రేకులు! కాంగ్రెస్ కథ ఇక మారదా?
posted on Aug 14, 2021 @ 9:27PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి పార్టీని ఏకతాటి మీద ముందుకు తీసుకు పోయేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి, పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే పార్టీ సీనియర్ నాయకుల ఇళ్ళకు వెళ్లి వారి వ్యక్తిగత యోగక్షేమాలతో పాటుగా, పార్టీ మంచి చెడులు కూడా చర్చించారు. ఆశీస్సులు అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్లతో పాటుగా దేవేందర్ గౌడ్ వంటి ఇతర పార్టీల సీనియర్ నాయకుల ఇళ్ళకు వెళ్లి పలకరించి వచ్చారు. కాంగ్రెస్ కలిసినప్పుడు, అందరి సహాయ సహకారాలు కోరడమే కాకుండా, అందరం కలిసి పనిచేద్దామని,కాంగ్రెస్ పార్టీని బతికించుకుందామని చెప్పుకొచ్చారు. ఆ ప్రయత్నాలు కొంత ఫలించినట్లే కనిపించాయి.
అయినా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, ఎప్పటినుంచే పార్టీలో ఉన్న సీనియర్లను కాదని , నిన్నగాక మొన్న, (నాలుగేళ్ళ క్రితం) పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడం సీనియర్లలో చాలా మందికి అప్పట్లో మింగుడు పడ లేదు. ఇప్పటికీ కొందరు ఆ బాధను జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే, అందరూ కాకపోయినా కొందరు నాయకులు పార్టీ కార్యకలాపాలకు సాధ్యమైనంత దూరంగానే ఉంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి అధ్వర్యంలో కనీవినీ ఎరగని రీతిలో జరిగిన ఇంద్రవెల్లి గర్జన సభకు కూడా కొందరు సీనియర్లు దూరంగానే ఉన్నారు. అయినా లక్ష మందితో జరిగిన ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్ కార్యకర్తల్లో బూతన ఉత్సాహాన్ని నింపింది. రేవంత్ నాయకత్వం పట్ల విశ్వాసాన్ని మరింతగా పెంచింది.
ఇంద్రవెల్లి సభ అందించిన విజయోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభల విషయంలో ఆదిలోనే వివాదం తలెత్తింది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా’ సభలలో తొలి ప్రారంభ సభను, ఆగష్టు 18న కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్’సభ నియోజక వర్గం పరిధిలోని ఇబ్రహీం పట్నంలో నిర్వహించాలని పీసీసీ ఆధ్వర్యంలోని దండోరా కమిటి నిర్ణయించింది. అయితే తమ నియోజక వర్గంలో జరపతలపెట్టిన సభకు సంబంధించి తనకు ముందస్తు సమాచారం లేదని కోమటి రెడ్డి కస్సు మన్నారు. ఇదే విషయాన్ని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ దృష్టికి, ఫిర్యాదు రూపంలో తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే వివాదం ఇంకా ముదరక ముందే అనూహ్యంగా పోలీసులు వివాదానికి పరిష్కారం చూపించరు. ట్రాఫిక్ సమస్యలు కారణంగా చూపింది, ఇబ్రహీం పట్నంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసుల సూచనా మేరకు, ఔటర్ రింగ్ రోడ్డు పక్కన బొంగుళూరు సమీపమలో ముందుగ అనుకున్న విధంగా ఆగష్టు 18 సాయంత్రం నలుగు గంటలకు ‘దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా’ సభని నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది.
అయితే ఇక్కడితో కథ ముగిసినట్లు కాదని, రేవంత్ రెడ్డికి సీనియర్లు సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంటుందని,అధిష్టానం అండదండలు ఉనంతవరకు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఎదురుండదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్య నారాయణ తెరాసలో చేరేందుకు సిద్దమవుతున్న సంకేతాలు ఇచ్చారు. దళిత బంధు రూట్ లో కారెక్కేందుకు, ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దళిత బంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ కొచ్చిన గొప్ప అలోచన అంటూ మెచ్చుకున్నారు. రాష్ట్ర జనభాలో ఒక వంతున్న దళితులకు మేలు చేసే పథకాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని రాజకీయాలకు అతీతంగా అందరూ అభినందించాలని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం పై కూడా సర్వే ఆచి తూచి స్పందించారు... ముందుంది ముసళ్ళ పండగ అన్నట్లుగా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఏమైనా రేవంత్ నాయకత్వం విషయంలో కాంగ్రెస్ సీనియర్ల కొందరు ఇంకా కినుగ్గానే ఉన్నారు. అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.. అది మాత్రం నిజం..