రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం.. ఆయన ఏమన్నారంటే..
posted on Aug 14, 2021 @ 10:57PM
‘‘దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మీకు గొప్పగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యేడాది స్వాతంత్య్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైంది. ఈ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవబోతున్నాయి. అమృత మహోత్సవంగా ఈసారి వేడుకల్ని నిర్వహించుకోబోతున్నాం’’ అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘స్వాతంత్య్ర దినోత్సవం మనకు పండగ దినం. మన స్వాతంత్య్ర కాంక్ష ఎంతో మంది త్యాగధనుల ఫలితం. అందులో మనకు తెలిసినవాళ్లు ఉన్నారు, తెలియని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఈ దేశం కోసం చాలా గొప్ప త్యాగం చేశారు. అలాంటి గొప్ప వీరులకు నా తల వంచి నమస్కరిస్తున్నాను. గత 75 ఏళ్లలో పలు రంగాల్లో అందనంత ఎత్తుకు ఎదిగాం. భారత భవిష్యత్‌లో బాలికలు, మహిళలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది’’ అని అన్నారు రాష్ట్రపతి.
టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు ప్రదర్శించిన ప్రతిభను కొనియాడారు. క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా అమ్మాయిల్ని పోత్సహించినట్టు తెలిపారు. కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదని.. కొవిడ్ సెకండ్ వేవ్‌లో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. కరోనా ఉద్ధృతిని తట్టుకొనేందుకు యుద్ధప్రాతిపదికన వైద్య వసతులు కల్పించామని, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషివల్లే కరోనా సెకండ్ వేవ్‌పై పైచేయి సాధించగలుగుతున్నామన్నారు.
‘‘కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించాం. కరోనా వల్ల వ్యాపారులు, వలసదారులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆయా రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ జరిగింది. సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది’’ అని రాష్ట్రపతి తెలిపారు.
‘‘కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలి. ఈ మహమ్మారి నియంత్రణకు మన శాస్త్రవేత్తలు టీకాలను అభివృద్ధి చేయడంలో విజయవంతం కావడంవల్లే భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టగలిగాం. ఈ మహమ్మారి నుంచి రక్షించుకొనేందుకు వ్యాక్సిన్లే రక్షణ కవచంలా ఉపయోగపడుతున్నాయి. ఇంకా మనమంతా మరిన్ని జాగ్రత్తలు పాటించాలనేదే కరోనా మనకు నేర్పిన పాఠం. వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ కరోనా ఇంకా పోలేదు. కరోనా కట్టడి కోసం పనిచేసిన వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, కరోనా వారియర్లకు అభినందనలు. వారి సేవలే కరోనా సెంకడ్ వేవ్‌ను అదుపుచేయడంలో దోహదపడ్డాయి. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్య కార్యకర్తల పాత్ర శ్లాఘనీయం. కరోనా సవాళ్లను అధిగమించాలన్న మనందరి సమష్టి సంకల్పమే సెకండ్ వేవ్ బలహీనపడేలా చేసింది’’ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో అన్నారు.