వైఎస్ సునీత ఫిర్యాదుపై యాక్షన్.. రెక్కీ చేసిన మణికంఠారెడ్డి అరెస్ట్..
posted on Aug 14, 2021 @ 2:41PM
ఇంటిచుట్టూ తిరిగాడు. ఇంట్లో ఎవరున్నారా అని అబ్జర్వ్ చేశాడు. గేటు బయట ఆగి ఎవరెవరికో ఫోన్లు చేశాడు. మాకు భయంగా ఉంది. మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. వెంటనే రక్షణ కల్పించమంటూ సీబీఐని, కడప జిల్లా ఎస్పీని కోరారు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత. ఆమె ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగారు. సీసీకెమెరా ఫూటేజీని పరిశీలించారు. సునీత అనుమానం వ్యక్తం చేసినట్టుగానే ఆ అగంతకుడు మణికంఠారెడ్డి అని గుర్తించారు. పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సునీత ఇంటి దగ్గర రెక్కీ ఎందుకు చేశారు? ఎవరి ఆదేశాల మేరకు చేశారు? అక్కడి నుంచి ఎవరెవరికి ఫోన్లు చేశారు? అని మణికంఠారెడ్డిని ప్రశ్నిస్తున్నారు పులివెందుల పోలీసులు.
వైఎస్ సునీత ఫిర్యాదుతో శుక్రవారం నుంచి పులివెందులలో అలజడి మొదలైంది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్ సునీత లేఖ రాయడం కలకలం రేపింది. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటికి సమీపంలో ఆగి ఎవరికో ఫోన్ కాల్స్ చేశాడని లేఖలో సునీత తెలిపారు. ఆ వ్యక్తి మణికంఠరెడ్డి అని.. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, అతని అనుచరుడు మణికంఠరెడ్డి తమ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించడం తమకు భయాందోళనకు గురి చేస్తోందని సునీత వాపోయారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు.. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గు తేల్చాలని సీబీఐని కోరారు సునీత. ఆమె ఫిర్యాదుతో కదిలిన పోలీస్ యంత్రాంగం.. తాజాగా మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకొని రెక్కీపై విచారిస్తోంది. పులివెందులలోని సునీత ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపు, వైఎస్ వివేక హత్య కేసు విచారణ వేగంగా జరుగుతోంది. రెండు నెలలుగా సీబీఐ ఇదే పని మీద ఉంది. వాచ్‌మెన్ వాంగ్మూలం కీలకంగా మారింది. కొందరు పెద్దలు మినహా అనుమానితులందరినీ ప్రశ్నిస్తోంది. వేరు వేరు కోణాల్లో ఎంక్వైరీ చేస్తోంది. నిందితుడు సునీల్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇంకా చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రకటించిన వారినీ విచారించేందుకు సిద్ధమవుతోంది. సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో.. సడెన్‌గా వైఎస్ వివేకా కూతురు సునీత ఇంటి దగ్గర మణికంఠారెడ్డి రెక్కీ నిర్వహించడం సంచలనంగా మారింది. పోలీస్ ఎంక్వైరీలో రెక్కీకి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వరుస పరిణామాలు చూస్తుంటే.. వివేక హత్య వెనుక పెద్ద తలకాయలే ఉన్నట్టు స్పష్టమవుతోంది.