మాకు కావాలి.. మాబంధు! గులాబీ లీడర్లకు నిలదీతలు
posted on Aug 14, 2021 @ 6:31PM
ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది, అంటే ఇదే నేమో, హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్’ను ఎలగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్త కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ అండదండలతోనే కావచ్చును, ఈటల హుజూరాబాద్’లో తిరుగులేని నేతగా ఎదిగారు. రాజకీయంగానే కాదు, ఆర్థికంగానూ నియోజక వర్గం పరిధిలో మరే ఇతర నాయకునికి అందనంత ఎత్తుకు చేరుకున్నారు.
అయితే అనూహ్య పరిణామాల నడుమ రాజకీయ ప్రత్యర్ధిగా మారిన ఈటలను, ఎన్నికలలో ఓడించడం ముఖ్యమంత్రి కేసీఆర్’ కు ఒక విధంగా అనివార్యంగా మారింది, మరో వంక అంత తేలిగ్గా అయ్యే పని కాదని అర్థమైంది. సర్వ శక్తులువడ్డి పోరాడక తప్పని పరిస్థతి ఎదురైంది. ఈ నేపధ్యంలోనే, ముఖ్యమంత్రి కేసీఆర్, దళిత బంధు, బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. పథకం మంచి చెడులు ఎలా ఉన్నప్పటికీ, ఇప్పుడు కేసీఆర్ సంధించిన బ్రహ్మాస్త్రం,నాగాస్త్రమై తెరాస ఎమ్మెల్యేలు, మంత్రుల మెడకు చుట్టుకుంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికెళితే అక్కడ ఇతర సామాజిక వర్గాల పేదలు మాకూ కావలి ... మా బంధు అంటూ చుట్టుముడుతున్నారు. చికాకు పరుస్తున్నారు.
మరోవైపు రాజకీయ పార్టీలు దళిత బందుకు స్వాగతం పలుకుతూనే, దళిత బంధు అనుబంధ డిమాండ్లతో మంత్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇందులో భాగంగానే, శనివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేంద్ర ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రిని కాంగ్రెస్ కార్యకర్తలు ఘోరావ్ చేసినంత పని చేశారు. ఓవైపు చైర్మన్ ప్రమాణ స్వీకారం జరుగుతుండగా.. ఇంకోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ, బీసీ బంధు ప్రకటించాలని నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.దీందో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతటితో ఆగకుండా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఇదేదో ఒక్క వికారబాద్’లో ఒక్క సబితా ఇంద్రా రెడ్డికి మాత్రమే ఎదురైన చేదు అనుభవం కాదు. మంత్రులకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు హుజూరాబాద్ వరాలు, గుదిబండగా మారుతున్నాయి.
కొన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, జనం డిమాండ్ చేస్తుంటే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి “ మేమూ రాజీనామా చేస్తాం, మళ్ళీ పోటీ కూడా చేయం, మా నియోజక వర్గాలలో హుజురాబాద్ వరాల వాన కురిపించండి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈటలను ఓడించడం మాట ఎలా ఉన్నా హుజూరాబాద్ వారాలు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జనంలోకి వెళ్ళకుండా చేస్తోంది. ఎంకి పెళ్ళి సుబ్బి చావు వచ్చిందన్న సామెతను గుర్తుచేస్తోంది.