ఆంధ్రా ప్రజల కొంప ముంచటానికే జగన్ లో ఇంత మార్పా?
posted on Aug 14, 2021 @ 12:54PM
జగన్ లో అకస్మాత్తుగా ఇంత మార్పు ఎందుకొచ్చినట్టు? ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అయ్యగారు అమిత్ షా దగ్గర హాజరుపడే వైఎస్ జగన్.. తాజాగా అయ్యగారే ఏపీకి వస్తే ఆ రాచమర్యాదల జాడలేవీ కనిపించలేదే. ఏమైంది వీరికి... ఎక్కడ బెడిసికొట్టింది వీరి మధ్య. ఈ గ్యాప్ రావడానికి కారణమేంటి? ఎవరూ గుర్తించనంత గ్యాప్ అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ... మీడియా సాక్షిగా అందరికీ తెలిసిపోయిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. దక్షిణకాశీగా పేరున్న శ్రీశైలానికి భార్యాసమేతంగా వస్తే... జగన్ అధికార లాంఛనాలతో కనీస స్వాగతాలు పలుకలేదెందుకని అటు ఆంధ్రాలోనే కాదు.. తెలంగాణలో సైతం ప్రజలంతా చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఈ విషయం మీద పెద్ద చర్చే నడుస్తోంది.
అమిత్ షా భార్యాసమేతంగా వ్యక్తిగత పూజాదికాల కోసమే వచ్చారనుకుందాం. అయితే జగన్ భార్య భారతిని వెంటబెట్టుకొని రాకపోయినా.. కనీసం సింగిల్ గా నైనా వచ్చి, ఓ శాలువా కప్పి.. శ్రీశైల మల్లన్న విగ్రహమో, తిరుపతి వెంకన్న ప్రసాదమో చేతిలో పెడితే కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ జెనరేట్ అయ్యి జగన్ మీద కేంద్రానికి కాస్త ప్రేమ పెరుగుతుంది కదా. రాష్ట్రంలో ఇప్పుడు రగులుతున్న జల రాజకీయాలు కాస్తయినా చల్లబడే ఆస్కారం ఉండేది కదా.. ఈ మాత్రం లాజిక్కయినా బ్రదర్ జగన్ కు తెలియకపోతే ఎలా అంటున్నారు ఏపీ రాజకీయ మేధావులు.
కృష్ణా, గోదావరి నదుల మేనేజ్ మెంట్ బోర్డు విషయంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యాక జగన్ కోరుకున్నట్టే కేంద్రం పని పూర్తి చేసిందన్న ఫీలర్స్ వెలువడ్డాయి. కానీ ఆ తరువాత జరిగిన బోర్డు అధికారుల సమావేశాల్లో... దాని జాబితాలో ఉన్న పలు ప్రాజెక్టులను తప్పించాలని, అప్పటిదాకా కేంద్రం అడిగిన సమాచారం ఇవ్వబోమని ఏపీ అధికారులు మొండికేశారు. దీంతో కేంద్రం వైఖరికి భిన్నంగా జగన్ వ్యవహార శైలి ఉందన్న విషయం కేంద్రంలోని పెద్దలకు అర్థమైందని, అదే వారి మధ్య పొరపొచ్చాలకు దారి తీసిందంటున్నారు. ఉమ్మడి బోర్డు ఏర్పాటును తొలుత స్వాగతించిన జగన్.. ఆ వెంటనే ఇలా తొండాట ఎందుకు ఆడుతున్నారో ఢిల్లీ బాసులకు అర్థం కాలేదంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కుమ్మక్కయ్యే జగన్ కేంద్రంతో దొంగాట డ్రామాలాడుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్ తాజా నిర్వాకం ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అమిత్ షా పర్యటనను రాష్ట్రంలోని జల సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకొని ఉండాల్సిందని, వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి అనవసరంగా ఓ గోల్డెన్ అపార్చునిటీ మిస్సయ్యారంటున్నారు. అక్కడ ఢిల్లీలో అధికారికంగా కలిసి విజ్ఞాపనా పత్రం ఇచ్చినదానికీ.. అలాగే ఇక్కడికి దైవ దర్శనార్థం వచ్చినప్పుడు కలిసి విన్నవించుకునే సందర్భానికి చాలా వ్యత్యాసం ఉంటుందని... అధికారిక హోదాలో కాలేని ఎన్నో పనులు.. దైవసన్నిధిలో సాఫీగా పూర్తవుతాయంటున్నారు. అందుకే ఈ చాన్స్ ఉపయోగించుకొని.. కేజీఆర్ఎంబీ ఎలాంటి సవరణలు చేపట్టాలో సూచించి ఉన్నట్టయితే అది తప్పకుండా మేలు చేసి ఉండేదంటున్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని సవాల్ చేస్తున్న కేసీఆర్ అడుగుజాడల్లోనే జగన్ కూడా ప్రయాణిస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సి వస్తోందంటున్నారు. అదే గనక నిజమైతే... జగన్ వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి రాష్ట్ర జల ప్రయోజనాలు గాలికొదిలేసినట్లేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.