ఏపీ ప్రభుత్వానిది కోర్టు ధిక్కరణేనా? సీఎస్ జైలుకు వెళతారా?
posted on Aug 14, 2021 @ 9:51PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి చిక్కుల్లో పడబోతోంది. కోర్టు ధిక్కరణ విషయంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తెలుస్తోంది. ఏపీ సీఎస్ జైలుకు వెళ్లాల్సి వచ్చినా రావచ్చని చెబుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబున్యుల్ కోర్టు ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్జీటీ సీరియస్ గా స్పందిస్తే మాత్రం జగన్ రెడ్డి సర్కార్ కు కష్టాలు తప్పవని అంటున్నారు.
అసలు విషయానికి వెళితే.. తెలుగు రాష్ట్రాల మధ్య మంటలు రాజేసిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిశీలన పూర్తైంది. ఎన్జీటీ ఆదేశాలతో రెండు, మూడు వాయిదా తర్వాత ఎట్టకేలకు ప్రాజెక్టును పరిశీలించిన కేఆర్‌ఎంబీ.. రాయలసీమ ఎత్తిపోతలపై నివేదికను రూపొందించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు కేఆర్‌ఎంబీ ధృవీకరించింది. ఈ మేరకు ఎన్జీటీకి కేఆర్‌ఎంబీ నివేదిక సమర్పించింది. డీపీఆర్‌కు అవసరమైన పనులకన్నా అధికంగా పనులు జరిగినట్లు కేఆర్‌ఎంబీ నివేదికలో నిర్ధారించింది. ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు కేఆర్‌ఎంబీ ధృవీకరించింది.
పంప్ హౌస్, అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, డెలివరీ మెయిన్ ఛానల్, డెలివరీ సిస్టమ్, లింక్ కెనాల్ పనులు జరిగినట్లు నిర్ధారించినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది. రెండ్రోజులపాటు ప్రాజెక్ట్ పనులను కేఆర్‌ఎంబీ అధికారులు తనిఖీ చేశారు. ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పనులను పూర్తిచేసినట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది. ఫోటోలతో సహా సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించినట్లు కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. ఎన్జీటీ సోమవారం విచారణ జరపనుంది. కోర్టు తీర్పు ధిక్కరణకు పాల్పడితే సీఎస్‌ను జైలుకు పంపుతామని గతంలో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో కేఆర్‌ఎంబీ నివేదికలో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలడంతో ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. గతంలో హెచ్చరించినట్లు సీఎస్ ను జైలుకు పంపుతుందా, అదే జరిగితే సంచనమే కానుంది.