బీజేపీ అధ్యక్షుడిపై మర్డర్ అటెంప్ట్.. దాడి వెనుక వైసీపీ హస్తం?
posted on Aug 14, 2021 @ 1:14PM
ఆయనేమీ చిన్నాచితకా నాయకుడు కాదు. బీజేపీలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే లీడర్. అలాంటి నేతపై అటాక్ జరిగింది. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తుండగా.. కాపు కాసి.. స్కెచ్ వేసి.. పక్కాగా దాడి చేశారు దుండగులు. కర్రలతో దాడి చేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసి కమలనాథులు ఉలిక్కిపడ్డారు. స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది. అసలు ఏం జరిగిందంటే....
వినుగొండ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మేడం రమేష్‌పై హత్యాయత్నం సంచలనం రేపింది. మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న ఆయనపై దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. పట్టణంలోని డైమండ్ టవర్స్‌లో నివాసముండే రమేశ్.. ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వాకింగ్‌కు బయలుదేరారు. రోడ్డు మలుపు తిరుగుతుండగా ముఖానికి మాస్క్‌లు ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఆయన్ను అడ్డగించారు. వెనుక నుంచి మరో ముగ్గురు వచ్చారు. అంతా కలిసి.. రౌండప్ చేసి.. కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలతో.. రక్తస్రావం అవుతూ.. కిందపడిపోయారు రమేశ్.
బీజేపీ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌పై జరిగిన దాడిని చూసిన చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. రమేశ్‌కు చెయ్యి విరిగింది. తలకు, కాలికి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట తరలించారు. స్థానిక వైసీపీ నాయకులు, వినుకొండ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.