నా చావుకు సీఎం జగనే కారణం.. వాలంటీర్ సూసైడ్ నోట్...
posted on Aug 14, 2021 @ 10:01PM
గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ మేడిపండు లాంటిదని మరోసారి రుజువైంది. వాలంటీర్లపై వైసీపీ నాయకుల పెత్తనం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాలంటీర్లను కూలీలకంటే హీనంగా చూస్తున్నారు. వారితో గొడ్డులా చాకిరీ చేయించుకుంటున్నారు. ఓవైపు అధికారులు, మరోవైపు అధికారపార్టీ నాయకులు.. పెద్దల ఒత్తిళ్ల వళ్ల వాలంటీర్లు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు ఆత్మహత్య కూడా చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
తాజాగా, అనంతపురం జిల్లా రాయదుర్గంలో వాలంటీర్ మహేశ్ ఇంట్లో ఉరి వేసుకొని.. సూసైడ్ చేసుకోవడం మరింత కలకలానికి కారణమైంది. తన చావుకు కారణం ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగమే కారణమని సూసైడ్ లేఖ రాసి మరీ మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్నారని సూసైడ్ నోట్‌లో రాశాడు మహేశ్. తన లాంటి పరిస్థితి మరో వాలంటీర్‌కు రాకుండా చూడాలని సూసైడ్ నోట్‌లో ప్రదేయపడటం సంచలనంగా మారింది.
మొదటినుంచీ వాలంటీర్ వ్యవస్థ వివాదాస్పదంగానే ఉంది. వాలంటీర్లతో బండ చాకిరీ చేయిస్తున్నారనీ, అన్ని రకాలుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ల కంటే.. అధికార పార్టీ నాయకుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉన్నాయని.. వైసీపీ నేతల ఓవరాక్షన్‌ను, టార్చర్‌ను తట్టుకోలేకపోతున్నామని అనేకమంది ఆరోపిస్తున్నారు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ.. ఏకంగా తన చావుకు సీఎం జగనే కారణమనేలా సూసైడ్ నోట్ రాసి మహేష్ అనే వాలంటీర్ ఆత్మహత్య చేసుకోవడంతో.. వాలంటీర్ వ్యవస్థపై మరోసారి చర్చ జరుగుతోంది.