మాటలతో కవ్వించి.. నగ్నంగా కనిపించి...
posted on Aug 14, 2021 @ 7:31PM
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు సొగసరి, గడసరి సుందరాంగులు.. కుర్రకారుకు వలపు వలలు వేస్తూ జేబులకు గాలం వేస్తున్నారు. "ఒంటరిగా ఉన్నామని ఫీలవుతున్నారా.. మీ భావాలు పంచుకోవడానికి ఒక మంచి స్నేహితుడో/స్నేహితురాలా కావాలా?" అంటూ వచ్చే ఒక్క ఎస్‌ఎంఎస్ ఎందరో యువకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కాసేపు మనసు విప్పి మాట్లాడుదాంలే అనుకుని ఫోన్ కలిపితే ఇక అంతే సంగతులు. ఆ విష వలయం నుంచి బయటకు రాలేకపోతున్నారు. వలపు వలలకు చిక్కి.. గిలగిలా కొట్టుకుంటున్నారు. ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకుంటే పోయే పరువు తిరిగిరాలేదన్న బెంగతో సతమతమవుతున్నారు. తమకు జరిగిన నష్టాన్ని కూడా కక్కలేక, మింగలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
ఈ తరహాలోనే విశాఖ యువకుడి నుంచి జీడిమెట్లకు చెందిన గుండా జ్యోతి అనే 24 ఏళ్ల యువతి అక్షరాలా రూ.24 లక్షలు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దర్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. కుత్బుల్లాపూర్‌లోని ఓ కాల్‌సెంటర్‌లో సుమారు 25 మంది అమ్మాయిలు పనిచేశారు. అది మూతపడటంతో వీరందర్నీ అక్కడే పనిచేసే 30 ఏళ్ల షాహిక్ అబ్దుల్ రెహమాన్ అనే టీం లీడర్ చేరదీశాడు. ఈయనది కృష్ణాజిల్లా. రెహమాన్ ఈ యువతులకు ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చి వీరితో ఈ మోసాలు చేయిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. వీరే కాకుండా ఇంకా నగరంలో చాలామంది కిలాడీలు ఇలాగే తర్ఫీదు పొంది ఉన్నారని, వారి వివరాలు బయటపడితే.. ఇంకా ఎంతమంది కుర్రకారు బాధితులుగా మారారో బయటకొస్తుందంటున్నారు పోలీసులు. రెహమాన్ నుంచి మరిన్ని వివరాలు అందుకున్న పోలీసులు.. ఆ యువతుల కోసం అన్వేషిస్తున్నారు.
నెరజాణల వలకు ఎలా చిక్కుతున్నారంటే...
మార్కెటింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లు, కాల్‌సెంటర్ల నుంచి బల్క్ ఎస్‌ఎంఎస్ పంపిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు ఎస్‌ఎంఎస్‌లో ఉన్న నంబర్లకు ఫోన్ చేయగానే కి‘లేడీ’లు రంగంలోకి దిగుతున్నారు. వర్చువల్ నంబర్లతో కాల్ చేస్తున్నారు. పది పదిహేను రోజులు తరచూ ఫోన్లు చేసి ఎంటర్‌టైన్ చేస్తున్నారు. బాధితులు వారి నంబర్ అడిగితే ఈ కిలాడీలు నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్న నంబర్లను ఇస్తున్నారు. ఇక ఇక్కడే కథలోని అసలు ట్విస్టు మొదలవుతుంది. ఆ నెరజాణలు వాట్సాప్‌లో ఛాటింగ్ చేస్తూ కుర్రకారును ముగ్గులోకి దింపుతున్నారు. వీడియో కాల్స్ చేసి రెచ్చగొడుతున్నారు. నగ్నంగా చూడాలని ఉందా? అంటూ కవ్విస్తున్నారు. మత్తెక్కించే మాటలతో యూత్ ను టెంప్ట్ చేస్తున్నారు. పైదుస్తులు మాత్రమే తీసేస్తే రూ.500, ఇంకొంచెం కిందివి తీసేస్తే రూ.వెయ్యి, పూర్తిగా నగ్నంగా చూడాలనుకుంటే రూ.2 వేలు చెల్లించాలంటూ.... ఒక్కో ఆఫర్ కు ఒక్కో రేటుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
వీరి డ్రామాలో ఫైనల్ ట్విస్ట్ తెలుసుకున్న పోలీసులకు మతి పోతోంది. ఈ దశలో వారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. వారు ఒకటి, రెండు దశల్లో సెమీ న్యూడ్ సీన్స్ చూపించడం పూర్తయ్యాక బాధితులను కూడా న్యూడ్ గా కనిపించాలంటూ షరతులు పెడుతున్నారు. నేను న్యూడ్ గా చూపించాను కదా... మరి నీ సంగతేంటి... అంటూ రెచ్చగొడుతున్నారు. వారి మాటలకు కుర్రకారు మంత్రముగ్ధులయ్యాక.. అప్పుడు ‘స్క్రీన్ రికార్డింగ్’ ఆప్షన్ తో వీడియో చిత్రీకరిస్తున్నారు. తర్వాత ఆ వీడియోను సంబంధిత యువకుల వాట్సాప్ నెంబర్స్ కు పంపిస్తున్నారు. ఆ తరువాత అవే వీడియోలను ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలా.. అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో బాధిత యువకులు చేసేదేం లేక అడిగినంతా డబ్బు చెల్లించి అవమానకరమైన రీతిలో సీన్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇదే వారి పాలిట వరదాయినిలా మారిందని పోలీసులంటున్నారు.