కాంగ్రెస్ పార్టీకి మరో యువ నేత షాక్.. రాహుల్ మౌనంపై సీనియర్ల ఫైర్..
posted on Aug 16, 2021 @ 4:45PM
కాంగెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో క్రియాశీల నాయకురాలు, సుస్మితా దేవ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సుమారు మూడు దశాబ్దాలకు పైగా, పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన మాజీ ఎంపీ, మహిళా కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఆ వెంటనే తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించింది.
సుస్మితా దేవ్ రాజీనామా ప్రకటన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అధిష్టానంపై కత్తులు దూస్తున్న జీ 23 నాయకులు, ఇదే అదనుగా మరో మారు అధిష్టానంపై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జీ 23 కీలక నేత కపిల్ సిబల్, మరో సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ, ట్విటర్ వేదికగా కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శనాస్త్రాలు సంధించారు.‘‘పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సుస్మితా దేవ్ రాజీనామా చేశారు.యువనేతలు పార్టీని ఒకపక్క వీడుతుంటే.. పార్టీ బలోపేతానికి చేసే కృషిపై మా ‘ముసలాళ్ల’ను నిందిస్తారు. అదే సమయంలో పార్టీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకొని సాగిపోతోంది’’ అంటూ కపిల్ సిబల్ తమదైన శైలిలో అధిష్టానానికి చురకలు అంటించారు. సుస్మితా దేవ్ రాజీనామా పై మనీష్ తివారీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె రాజీనామా చేయడమే నిజం అయితే, అది అత్యంత దురదృష్టకరం అంటూ ట్వీట్ చేశారు.అంతటితో ఊరుకోకుండా, ఇంత చిన్న ఉత్తరం ముక్క రాసి వెళ్లి పొతే ఎలా, పార్టీ వదిలి పోవడానికి కారణాలు ఏమిటో, పార్టీ చేస్తున్న తప్పులు ఏమిటో చెప్పి వెళ్ళాలని అన్నారు. అంటే పార్టీని మరింతగా ఇరుకున పెట్టమని, ఆయన చెప్పకనే చెప్పారు.
రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా, పార్టీలో భవిష్యత్ తరం నాయకురాలిగా గుర్తింపు పొందిన సుస్మితా దేవ్ రాజీనామా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాకుండా, పార్లమెంట్ వెలుపల లోపలా కూడా కాంగ్రెస్ వాణిని గట్టిగా వినిపించే, దేవ్ పార్టీని వదిలి పోవడం,పార్టీకి ముఖ్యంగా రాహుల్ గాంధీకి గట్టి దెబ్బగానే బావిస్తున్నారు. జ్యోతి రాజాదిత్య సిందియా మొదలు ఇలా వరసగా ఒకరొకరుగా, రాహుల్ గాంధీ సన్నిహిత నాయకులు పార్టీని వదిలిపోవడంతో, జీ 23 వృద్ద నేతలు తమకు అనుకూలంగా మలుచు కుంటున్నారు. కేవలం రెండు నెలలో క్రితమే ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువ నేత జితిన్ ప్రసాద, పార్టీని వదిలి బేజీపే చేరారు. మరో వంక, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, కూడా త్వరలోనే పార్టీని వదలడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల గాంధీ మాత్రం ఎంత మంది పార్టీ వదిలిపోయినా, భయపడేది లేదని అంటున్నారు. అంతేకాదు, పొడలచుకున్న వారంతా పోవచ్చని అంటున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భయంతోనే, యువ నాయకులు పార్టీని వదిలి పోతున్నారని భావిస్తున్నారో ఏమో కానీ, రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు భయపడే వాళ్ళు ఇంకా ఎవరైన ఉంటే అలాంటి వారందరూ నిరభ్యంతరంగా వెళ్లి బీజేపీలో చేరచ్చని నెల రోజుల క్రితమే తలుపులు తెరిచారు.
అయితే పార్టీని వదిలి పోతున్న వారందరూ, బీజేపీలో మాతమ్రే చేరడం లేదు, ఇతర పార్టీలలోకి వెళుతున్నారు. సుస్మితా దేవ్ విషయమే తీసుకుంటే ఆమె బీజేపీలో చేరలేదు, ఆమె తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. అలాగే కొద్ది రోజుల క్రితం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా, బీజేపీలో చేరలేదు తృణమూల్ కాంగ్రెస్’లో చేరారు. అలాగే, ఉత్తర పదేశ్’లో కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరితే, ఇంకొందరు సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ, అన్నిటికీ బీజేపీ, మోడీనే కారణమని అనుకుంటే, ఆత్మ వంచన, పర నింద ఇలాగే కొనసాగిస్తే, అందుకు వందేళ్ళు పైబడిన కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా పెద్ద మూల్యం చెల్లించ వలసి వస్తుందని, జీ 23 నేతలు హెచ్చరిస్తున్నారు.