కత్తితో పొడుస్తున్నా సినిమా చూసిన జనం.. సిగ్గుపడేలా మానవత్వం
posted on Aug 16, 2021 @ 9:51AM
ఉదయం 10 గంటలు.. గుంటూరు నగరంలోని ప్రధాన కూడలి పరమయ్యకుంట ప్రాంతం.. పాతగుంటూరు పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరమే. రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువే. వాడవాడలా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న సమయం.. ఈ సమయంలోనే ప్రేమోన్మాది కిరాతకానికి ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని బలైపోయింది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెపై ప్రేమోన్మాది కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు.
పంద్రాగస్టు వేళ.. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న వేళ.. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు కేవలం కిలోమీటరు దూరంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. నడి రోడ్డు మీద రమ్య అనే యువతిని రెండు దెబ్బలు కొట్టి రోడ్డు మీద పడేసి.. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను ఆరు పోట్లు పొడి చేసి.. పారిపోయాడు. ఇంత జరుగుతున్నా.. ఎవరు ముందుకు రాకుండా.. జరుగుతున్నదంతా చూశారే తప్పించి..ఆదుకునేందుకు ఒక్కరు అడుగు ముందుకు వేయలేదు.కొన్ని నిమిషాల పాటు సాగిన ఈ హత్యాకాండకు సీసీ కెమేరాలో చిక్కింది. వీడియోలు సాక్ష్యంగా నిలిచాయి. మానవత్వం సిగ్గుపడేలా.. అక్కడే ఉండి సినిమా చూస్తున్న జనం తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన రమ్య (19) గుంటూరు సమీపంలోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. పరీక్షలు రాసేందుకు నెల క్రితం గుంటూరులోని పెదకాకాని రోడ్డు దగ్గర ఉండే నానామ్మ ఇంటికి వచ్చి ఉంటోంది. ఆమెకు ముట్లూరు గ్రామానికి చెందిన శశికృష్ణతో ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ వెంట పడేవాడు. ఆదివారం ఉదయం నానమ్మకు టిఫిన్ తెచ్చింది రమ్య. ఇది జరిగిన కాసేపటికి శశికృష్ణ నుంచి ఫోన్ రావటంతో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లింది.
రోడ్డు మీదకు వచ్చిన రమ్య.. శశికృష్ణ బైక్ మీద ఎక్కగా వారు కొంతదూరం ప్రయాణించారు. మధ్యలో వచ్చిన మాట తేడాతో ఆమె బండి దిగి రోడ్డు దాటి అవతలవైపునకు వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహంగా బండిని తిప్పి వచ్చిన అతడు.. రమ్యను కొట్టాడు. దీంతో.. ఆమె కింద పడిపోయింది. వెంటనే.. తనతో తెచ్చుకున్న కత్తితో ఆరు పోట్లు విచక్షణారహితంగా పొడిచేశాడు. రోడ్డు మీద ఇంత దారుణం జరుగుతున్నా.. ఏ ఒక్కరు దీన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.ఆమెను చంపేసి.. అనంతరం పరారయ్యాడు. అతని ఫోన్ స్విచాప్ చేసుకున్నాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించే సమయానికే ఆమె చనిపోయింది.
రమ్య చుట్టూ ఎంతో మంది ఉన్నారు. మనిషిలోని మానవత్వం మేలుకుంటే రమ్య గాయాలతో బతికేది. ఆమె ప్రాణాలు నిలబడేవి. కానీ వ్యక్తి చేతిలో కత్తి ఉందని ఆమె దగ్గరకూ ఎవరూ పోలేదు. చుట్టుపక్కల జనం అందరూ వస్తే ఓ నలుగురు కలిస్తే కత్తి పట్టుకున్న యువకుడు భయపడేవాడు. రాళ్లతో కొట్టినా ఆ యువతి బతికేది. కానీ ఏ ఒక్కరూ ఆమెను కాపాడిన పాపాన పోలేదు. సభ్యసమాజం తలదించుకునేలా ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. సమాజంలో నిర్లిప్తతత నిర్లక్ష్యం పెరిగిపోయిందని తెలుస్తోంది, రమ్య హత్య ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
రమ్యను పొడిచేసిన తర్వాత పరారైన శశికృష్ణ అతడి తల్లి ఉండే గోళ్లపాడు గ్రామానికి వెళ్లిపోయాడు. శశికృష్ణ తల్లిదండ్రులు విడిగా ఉంటున్నారు. దీంతో.. తల్లి ఉండే గ్రామానికి వెళ్లి శశికృష్ణను గుర్తించారు. అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రమ్యను పొడిచిన కత్తితో తన మెడను గాయపర్చుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు నిలువరించారు. మెడ దగ్గర స్వల్ప గాయం కావటంతో అతడికి చికిత్స చేయించి.. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.