సంజయ్ రాసలీలలు బయట పెడతా! టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలనం
posted on Aug 15, 2021 @ 7:41PM
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య తలెత్తిన వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. అనేక మలుపులు తిరుగుతూ సంచలనాలకు కారణమవుతోంది. మల్కాజ్ గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బండి సంజయ్ తనను రెచ్చగొడుతున్నారని, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మైనంపల్లి అన్నారు. బండి సంజయ్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను యూజ్ సెల్ ఫెలో అన్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన మైనంపల్లి.. తన గురించి బండి సంజయ్ కి ఏం తెలుసని మండిపడ్డారు.
బండి సంజయ్ భరతం పడతానని హెచ్చరించాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. బండి సంజయ్ రాసలీలల వ్యవహారాలన్నీ మీడియా ముందు పెడతానని మైనంపల్లి హెచ్చరించారు. బండి సంజయ్ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని, ఎంపీకి తక్కువ, కార్పొరేటర్ కి ఎక్కువ అని వ్యంగ్యం ప్రదర్శించారు. మరోసారి మల్కాజ్ గిరిలో అడుగుపెడితే బండి గుండు పగలడం ఖాయమన్నారు మైనంపల్లి హన్మంతరావు. మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ దాడి చేయలేదన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా తప్పుడు సంజయ్ ఆరోపణలు చేశాడని ఆరోపించారు. బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ... ఎంపీకి తక్కువ అని మైనంపల్లి హనుమంతరావు ఎద్దేవాచేశారు.
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌ల మధ్య వాగ్వివాదం జరిగింది. జాతీయ జెండాలో భారతమాత ఫోటో అంశంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు బీరు బాటిళ్ళతో దాడి చేశారు. గాయపడిన కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆస్పత్రికి వెళ్లి శ్రవణ్‌ను పరామర్శించారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ మైనంపల్లి గుండాయిజం చేస్తున్నారని, రేపటి నుంచి ఎమ్మెల్యే కబ్జాలన్నీ బయటకు తిస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి అని తెలిసే.. బీజేపీలో చేరతామని వచ్చినా పార్టీలో చేర్చుకోలేదన్నారు. పోలీసు అధికారుల ముందు దాడి చేస్తుంటే పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారని ప్రశ్నించారు. మహిళలపై దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని సంజయ్ నిలదీశారు. బీజేపీ నేతలు చనిపోవడానికైనా.. చంపడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. జాతీయ జెండా, మహాత్మాగాంధీ ఫొటో కింద పడేసారని దీనిపై డీజీపీ, కమిషనర్ వెంటనే స్పందించాలన్నారు. తమ కార్పొరేటర్ శ్రావణ్‌పై దాడి చేసినవారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై పోలీసు కేసు నమోదైంది. ఈ కేసులో 15 మంది టీఆర్ఎస్ కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కార్యకర్తపై టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా బీజేపీ సోమవారం బంద్ కు పిలుపునిచ్చింది.