మెగాస్టార్స్ మళ్ళీ మెరిశారు.. జగన్ ఆహ్వానం అందుకేనా?
posted on Aug 15, 2021 @ 2:24PM
మెగా బ్రదర్స్ ఇద్దరు ఒకే సారి వార్తల్లో తళుక్కుమన్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. చిరంజీవిని జగన్ రెడ్డి పిలిచింది సినిమా ఇండస్ట్రీ సమస్యలు చర్చించేందుకే అయినా.. ఇద్దరి మద్య గత కొంతకాలంగా ఇంకేవో సంబంధాలు ఎదుగుతూ వస్తున్న సంకేతాలు స్పష్టమవుతున్న నేపధ్యంలో, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నుంచి చిరంజీవికి పిలులు రావడం, సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ సీరియస్ చర్చకు దారి తీసింది.
చిరంజీవి కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు, కాంగ్రెస్ నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి, అంతేకాకుండా,ఆయన చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయలకు దూరంగా ఉంటూ వస్తున్నా.. ఈ మధ్య కాలంలో అయన మళ్ళీ రాజకీయ వార్తల్లోనూ కనిపిస్తున్నారు. ఈ మధ్యనే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా అనే అనుమానం కాంగ్రెస్ నాయకులకే వచ్చింది. అయినప్పటికీ ఆయనేమీ స్పందించలేదు కానీ, కాంగ్రెస్ నాయకులే చర్చించుకుని, చివరకు ఉన్నారనే నిర్ణయానికి వచ్చారు. అలాగే, చిరంజీవిని ఏపీసీసీ ప్రెసిడెంట్ చేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి. అదలా ఉంటే, చిరంజీవికి జగన్ రెడ్డి రాజ్య సభ టికెట్ ప్రామిస్ చేసినట్లు మరోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో .. ఏపీ సీఎం మెగాస్టార్’ను ఎందుకు పిలిచినా, మీడియాలో మాత్రం ఇంకేందుకో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
‘అన్నయ్య’ కథ అలా ఉంటే జనసేన అదినేత ‘తమ్ముడు’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చాలా కాలం తర్వాత ఏపీలోలో ఎంట్రీ ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకే ఆయన శనివారమే విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు (ఆదివారం) మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. స్వాతంత్ర స్పూర్తితో రాజకీయాలలో మార్పు రావాలని, అందుకు ఈతరం ముందుండాలని పిలుపునిచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే, అలాంటి స్పూర్తిని రగిల్చేందుకు ప్రభుత్వ పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెడతామని, అన్నారు.
ఈసారి ఏపీ పర్యటనలో పవన్ కళ్యాణ్ లో మార్పు కనిపిస్తోంది. గతంలో చాలా కాలంగా ఆయన ఏపీకి వచ్చినా మిత్ర పక్షం బీజేపీకి సమాచారమే ఉండేది కాదు. జనసేన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని, అటు నుంచి అటే వెళ్ళిపోవడం జరుగుతోంది. అయితే, ఇటీవల బీజేపీ నాయకులు, ఇదేమి మిత్ర ధర్మం, ఉమ్మడి పోరాటాలు చేయాలని చెప్పుకున్న సంకల్పం ఏమైందని, కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ, జనసేన పొత్తు పుటుక్కుమన్నట్లే, అన్న ప్రచారం జరిగింది. బీజేపీ నాయకుల హెచ్చరికలే పనిచేశాయో, ఏమో కానీ, ఈసారి విజయవాడలో కాలు పెడుతూనే, నాయకుల టచ్’లోకి వెళ్ళిపోయారు. పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్’తో కలిసి జనసేన- బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ దియోధర్, దగ్గుబాటి పురందేశ్వరితో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
మాములుగా అయితే పవన్ కళ్యాణ్ ఏపీ టూర్ కు పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవును కానీ, విడిపోయాయి అనుకున్న పార్టీలు మళ్ళీ కలవడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది.