పీడీలతో ఖజానాకు పిడి.. జగన్ సర్కారు కిరికిరి!..
posted on Aug 16, 2021 @ 11:53AM
నెలనెలా జీతం రాగానే అంతా ఖర్చైపోతుంది. వచ్చే శాలరీ కూడా చాలక అప్పులు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులు కూడా ముట్టకపోతే.. అప్పుడు ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడు? గల్లా గురుగు పగలగొడతాడు. దాచుకున్న చిల్లర మొత్తం ఊడ్చేస్తాడు. ఆ చిన్న మొత్తమైనా ఏదైనా అవసరానికి పనికొస్తుందని తీసేసుకుంటాడు. అయినా, అతని ఖర్చులు తీరకపోతే? ఈసారి దేవుడికి కట్టిన ముడుపు విప్పుతాడు. ఓ దేవుడా మళ్లీ పరిస్థితి బాగుపడితే నీ ముడుపు నీకు ఇచ్చేస్తా.. ఇప్పటికైతే నీ సొమ్ము నేను వాడేసుకుంటానంటూ అది కూడా స్వాహా చేస్తాడు. అలా ఇలా ఏదో ఒకటి చేసేసి.. ఇళ్లంతా ఊడ్చేసి.. సంసారం నెట్టుకొస్తాడు. ప్రస్తుతం ఏపీ సర్కారు దుస్థితి కూడా ఇలానే తయారైందని అంటున్నారు.
ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. ఖర్చులు మోపెడు. సంక్షేమం బోలెడు. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు కూడా ఇవ్వలేని దయనీయ పరిస్థితి. అందినకాడికి అప్పులు చేసేస్తున్నారు. వాటిని పప్పుబెల్లాల్లా పంచేస్తున్నారు. కొత్త అప్పులు ముట్టడం లేదు. కేంద్రం సైతం కొర్రీలు పెడుతోంది. మరి, ఇక దారేది? ప్రభుత్వ మనుగడకు మార్గమేది? ఇందుకు సర్కారు ఓ దొంగదారి కనుగొంది. పీడీ అకౌంట్ల పేరుతో.. వివిధ శాఖల దగ్గర తాత్కాలికంగా ఉన్న నిధులన్నిటినీ దోచేస్తోంది. అదీ ఇదీ అని లేదు.. విద్యార్థుల పరీక్ష ఫీజుల నుంచి.. కోర్టులో డిపాజిట్ల వరకూ దేన్నీ వదలకుండా ఊడ్చేస్తోంది. పైసా వాసన వస్తే చాలు.. పసిగట్టేసి.. పీడీ అకౌంట్లతో పిప్పి పీల్చేస్తోంది. ప్రభుత్వ దోపిడీకి.. ప్రభుత్వ శాఖలన్నీ లబోదిబోమనడం మినహా ఏమీ చేయలేకపోతున్నాయి. తేలుకుట్టిన దొంగల్లా.. అన్ని విభాగాలు అన్నీ మూసుకొని భరిస్తున్నాయి.
ప్రభుత్వ ఖజానా మాత్రమే కాదు.. ఇతర శాఖల గల్లాపెట్టెలూ ఖాళీ అయ్యాయి. చలానాలు, పరీక్ష ఫీజులు, పంచాయతీలు, మున్సిపాల్టీలకు వచ్చే ఆదాయం.. ఎక్కడా పైసా మిగలకుండా మొత్తం స్వాహా చేసేశారు. పీడీ ఖాతాల దెబ్బకు ఇప్పుడు ఏ శాఖ వద్దా కనీసం కార్యాలయాల నిర్వహణకు కూడా చిల్లిగవ్వ మిగల్లేదని అధికారులే వాపోతున్నారు.
ఏ శాఖకు, ఎక్కడి నుంచైనా ఒక్క పైసా ఆదాయం వస్తున్నట్లు తెలిస్తే చాలు.. దానికో పీడీ ఖాతా తెరిచేసి ఆ మొత్తాన్ని లాగేసుకోవడమే ఆర్థికశాఖ పనిగా పెట్టుకుంది. ప్రభుత్వ పెద్దల నుంచి అలా అదేశాలు ఉన్నాయి మరి. పరీక్షల కోసం ఏపీపీఎస్సీకి అభ్యర్థులు కట్టిన ఫీజులనూ ప్రభుత్వం వదల్లేదు. పరీక్షల నిర్వహణ కోసం ఏపీపీఎస్సీ కూడబెట్టుకున్న దాదాపు రూ.100కోట్లకు పైగా పీడీ ఖాతాలతో లాగేశారని తెలుస్తోంది. దీంతో, పరీక్షలు నిర్వహించాలంటే కమిషన్ దగ్గర డబ్బుల్లేని పరిస్థితి. తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం కాలయాపన చేస్తూ ఆ బిల్లులన్నీ పెండింగ్‌లోనే ఉంచుతోందట
బడ్జెట్‌లో నిధులు కేటాయించినా, అభివృద్ధి పనులకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు వచ్చినా రాష్ట్రంలో ఎక్కడా ఏ పని జరక్కపోవడానికి ఇదే కారణం అంటున్నారు. బడ్జెట్‌లో ఇచ్చిన నిధులను పీడీ ఖాతాల రూపంలో తిరిగి ఖజానాలకే మళ్లించుకోవడంతో ఏ శాఖలోనూ డబ్బులలేక పనులు సాగడంలేదంటున్నారు. ఇలా ఏపీలో దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఏ మూలన, ఏ రూపంలో దాగున్న నిధులనైనా.. పీడీ ఖాతాలతో సర్కారు శఠగోపం పెడుతోందని ప్రభుత్వ వర్గాలే మండిపడుతున్నాయి. విచ్చలవిడిగా నిధులను కొల్లగొడుతున్న పీడీ అకౌంట్ల విధానాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు శాఖాధిపతులు.