పరామర్శకు వెళ్లిన నారా లోకేష్ అరెస్ట్.. ఇదేం రాజ్యమని చంద్రబాబు ఫైర్
posted on Aug 16, 2021 @ 2:24PM
ఆంధ్రప్రదేశ్ లో ఎంతటి అరాచక పాలన సాగుతుందో మరోసారి రుజువైంది. దారుణ హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య నివాసం దగ్గర పోలీసులు జులుం ప్రదర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేశారు. నారా లోకేశ్ తో పాటు దూళిపాళ నరేంద్ర, ఆనంద్ బాబు, ఆలపాటి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. నరేంద్ర, నక్కా ఆనంద్ బాబులను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. లోకేశ్ ని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ వాహనంలోకి ఎక్కే సమయంలో నారా లోకేశ్ పిడికిలి బిగించి, చేయెత్తి టీడీపీ శ్రేణులను ఉత్తేజపరిచారు. మిగిలిన నేతలను నల్లపాడు పీఎస్ కు తరలించారు.
మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థిని రమ్యను ఓ యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. గుంటూరులోని కాకాని రోడ్డులో ఆదివారం ఈ దారుణం సంభవించింది. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది. గుంటూరులో ఉన్నాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని టీడీపీ నేతలు నారా లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా తదితర నేతలు పరామర్శించారు. రమ్య మృతదేహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు.
నారా లోకేష్ రావడంతో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. రాజకీయ లబ్ధి కోసమే నారా లోకేశ్ వచ్చారంటూ వైసీపీ శ్రేణలు ఆరోపించాయి. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి.దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలోనే పోలీసులు జులుం ప్రదర్శించారు. రమ్య ఇంటి వద్ద చిత్రీకరణకు వెళ్లిన టీవీ5 టీవీ5 కెమెరాను లాగి పడేశారు. పోలీసుల దాడితో టీవీ5 కెమెరా నుజ్జునుజ్జైంది. కెమెరాను లాక్కొని నేలకేసి కొట్టారు పోలీసులు. మీడియా ప్రతినిధులపై దాడికి ప్రయత్నించారు. పోలీసుల తీరుపై మీడియా సంఘాలు మండిపడుతున్నాయి.
నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ హత్యకు గురైన రమ్య కుటుంబసభ్యులను పరామర్శించానని, వాళ్లతో మాట్లాడానన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. 10 లక్షలు అవసరం లేదని, తమ కుమార్తెను తీసుకురావాలని వాళ్లు చెప్పారన్నారు. ఈ సందర్భంగా తాను ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే వైసీపీ రౌడీలు వచ్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేయడం చాలా బాధాకరమన్నారు. పోలీసులు కూడా టీడీపీ నేతలపై దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. గతంలో వైసీపీ నాయకులు ఏమన్నారంటే.. గన్ కంటే ముందు జగన్ వస్తారని చెప్పారని.. జగన్ ఎక్కడ? గన్ ఏదీ అని లోకేష్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో ఉన్న మహిళలకే సీఎం న్యాయం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను దారుణంగా చంపేస్తే.. వాళ్లకు న్యాయం చేయలేని పరిస్థితిలో జగన్ ఉన్నారన్నారు. ప్రభుత్వం చేతగాని తనంవల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నారా లోకేష్ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై పోలీసుల దౌర్జన్యం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. రమ్య కుటుంబసభ్యులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలపై కాదు సీతానగరం గ్యాంగ్ రేప్ నేరస్తుడు వెంకటరెడ్డిని పట్టుకోవడంలో జగన్ ప్రతాపం చూపించాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడే గుంటూరులో పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్య జరగిందంటే.. మహిళల రక్షణపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందని విమర్శించారు. గుంటూరులోనే సీసీ కెమెరాలు పనిచేయలేదంటే ప్రభుత్వం పాలన ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. . టీడీపీ నేతలపై దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పరామర్శకు వెళ్లిన లోకేష్, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దూళిపాళ నరేంద్ర లపై అమానుషంగా వ్యవహరించడం సరికాదన్నారు చంద్రబాబు. పోలీస్ స్టేషన్ సమీపంలో రమ్య హత్యగావించబడుతుంటే దిశ యాప్ ఏం చేస్తుంది? సిసి కెమెరాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు.