లోకేశ్‌కు జగన్ భయపడుతున్నారా? అరెస్ట్ అందుకేనా..?
posted on Aug 16, 2021 @ 3:42PM
నారా లోకేశ్ అరెస్ట్. ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఆ ఘట్టం కూడా ముగిసింది. ఓటమి నారా వారి తనయుడిని రాటుదేల్చినట్టుంది. అనుభవం యువనేతను మరింత పదును పెట్టినట్టుంది. ఇటీవల కాలంలో అన్నింటా ఆయనే. ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతంతా లోకేశే తన భుజాలపై మోస్తున్నారు. తండ్రి డైరెక్షన్‌లో ప్రభుత్వంపై అలుపెరగని దండయాత్ర చేస్తున్నారు. ప్రతినిత్యం ప్రజా సమస్యలపై అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రజల కోసం.. ప్రజల చెంత.. ప్రజాక్షేత్రంలో.. రాకెట్‌లా దూసుకుపోతున్నారు.
తాజాగా, గుంటూరులో రమ్య మృతదేహానికి నివాళులు అర్పించి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు నారా లోకేశ్. అంతే. పోలీసులు పోలోమంటూ దిగిపోయారు. లోకేశ్‌ను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలివచ్చారు. కారణం.. లోకేశ్ రాకవల్ల బాధితురాలి ఇంటికి జనం పోటెత్తారు. ఆ కుటుంబానికి మద్దతుగా క్షణాల్లో వేలాది మంది తరలివచ్చారు. ఆడపిల్లకి భద్రత కల్పించలేని ప్రభుత్వ చేతగానితనంపై ఆగ్రహం వెల్లువెత్తింది. పెద్ద స్థాయి నేత వస్తే.. ఆ ప్రభావం.. ఆ ఫలితం ఇలానే ఉంటుంది. ఇష్యూకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ప్రజల్లో అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ప్రభుత్వంపై ఎక్కడలేని ప్రెజర్ వస్తుంది. నారా లోకేశ్ గుంటూరు రాకతో అదే జరిగింది. పే..ద్ద లీడర్ల వల్లనే ఇలాంటి పరిణామాలు సాధ్యం. అందుకే, సర్కారు ఉలిక్కిపడింది. వెంటనే ఖాకీలను రంగంలోకి దింపి లోకేశ్‌ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయారు. అంటే.. దీని అర్థం.. నారా లోకేశ్‌కు సర్కారు భయపడినట్టేగా..? యువనేతను చూసి పాలకులకు వణుకు పుట్టినట్టేగా..?
నారా లోకేశ్ దూకుడు మామూలుగా లేదు. కరోనా కాలంలో పది, ఇంటర్ పరీక్షలు వద్దే వద్దంటూ ఆయన చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ ఉన్నా.. తన వెనుక జనసమూహం లేకపోయినా.. జూమ్ మీటింగులతోనే సర్కారుపై తీవ్ర ఒత్తిడి పెంచారు. నిత్యం విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. వారికి మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి దిగొచ్చేదాకా పట్టువదలనే లేదు లోకేశ్. మామూలుగా వేరే వారైతే ఏ రెండు-మూడు రోజులో నినాదాలు చేసి వదిలేసేవారే. కానీ, లోకేశ్ అలాకాదు.. దాదాపు రెండు నెలల పాటు విక్రమార్కుడిలా పరీక్షల రద్దు కోసం గొంతెత్తి నినదించారు. నిజమైన లీడర్ అనిపించుకున్నారు. జూమ్‌లాంటి ఆన్‌లైన్ వేదికలను ఇంతలా ఉపయోగించుకొని.. ప్రజల పక్షాన పోరాటం చేసిన ఏకైక నాయకుడు బహుషా లోకేశ్ ఒక్కరేనేమో...!
ఇక నారా లోకేశ్ అసలైన నాయకత్వ లక్షణాలు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ప్రచారం సమయంలోనే బయటపడ్డాయి. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరు ప్రకటించగానే.. ప్రచార బాధ్యతలన్నీ ఆయనే మీదేసుకున్నారు. వారాల తరబడి తిరుపతి నియోజకవర్గంలోనే మకాం వేసి.. ఊరూరా, వాడవాడలా పర్యటించారు. రోడ్‌షోలు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, పబ్లిక్‌తో సెల్ఫీలు, జనాలతో మాటామంతి.. అలుపెరగకుండా, విసుగుచెందకుండా.. ప్రచారాన్ని హోరెత్తించారు. కేడర్‌లో ఉత్సాహం నింపారు. తిరుపతిలో నారా లోకేశ్ నిర్వహించిన ప్రతీ ర్యాలీకి జనం పోటెత్తారు. ఆయన ప్రసంగాలు సైతం ఆలోచింపజేసేవిగా సాగాయి. పంచ్‌లతో ఈలలు వేయించాయి.. కేకలు పెట్టించాయి. గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ ర్యాలీలు అలానే సాగేవని జనం చర్చించుకున్నారు. జగన్‌లానే లోకేశ్ సైతం పదునైన విమర్శలతో ఆయన ప్రసంగాలు వాడి-వేడిగా ఉండేవని మాట్లాడుకున్నారు. ఆనాడు జగన్ నాయకత్వంలో వైసీపీ శ్రేణులు విజయతీరాల వైపు నడిచినట్టు.. ఇప్పుడు మళ్లీ లోకేశ్ లీడర్‌షిప్‌లో టీడీపీ కొత్త ఉత్సాహంతో ముందుకు కదులుతోందని అంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నికలు అనే కాదు.. టీడీపీ నాయకులను అక్రమ కేసులతో అరెస్ట్ చేసినప్పుడు.. టీడీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు జరిగినప్పుడు.. ప్రజలకు సమస్య ఎదురైనప్పుడు.. ఇలా ఏ ఒక్క సందర్భానికీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా.. ప్రాబ్లమ్ ఉన్నచోటల్లా వాలిపోతున్నారు నారా లోకేశ్. మొదటినుంచీ ఇంగ్లీష్‌మీడియం కావడం, ఫారిన్‌లో చదువుకొని రావడంతో.. గతంలో తెలుగు సరిగ్గా మాట్లాడలేక.. పప్పు అనే విమర్శ ఎదుర్కొన్నారు. ఇప్పుడు బాడీతో పాటు బాడీలాంగ్వేజ్‌నూ మార్చేశారు. స్లిమ్ అండ్ షార్ప్‌గా కనిపిస్తున్నారు. ఆయనలానే ఆయన స్పీచుల్లోనూ పస పెరిగింది. పప్పు కాస్తా నిప్పులా మారారు. తూటాల్లాంటి మాటలు, పదునైన విమర్శలు, ఘాటు వ్యాఖ్యలతో ప్రభుత్వ తుప్పు వదలగొడుతున్నారు. ఇక లోకేశ్ చేసే ట్వీట్లు.. జగన్‌ను, విజయసాయిని తూట్లు పొడుస్తుంటాయి. అందుకే, నారా లోకేశ్ అంటే సర్కారు షేక్ అవుతోంది. గుంటూరు రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే.. ఆ ఒత్తిడి తట్టుకోలేక పోలీసులతో అరెస్ట్ చేయించింది. తన పొలిటికల్ కెరీర్‌లో తొలిసారి అరెస్టై.. తాను రాటుదేలిన నాయకుడినని నిరూపించుకున్నారు నారా లోకేశ్. తాజా, అరెస్ట్‌తో లోకేశ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రభుత్వం లోకేశ్‌తో పెట్టుకొని మరోసారి పప్పులో కాలేసింది. నిప్పుతో చెలగాటమాడుతోంది.