CMOలోకి రాహుల్ బొజ్జా.. ఈటల విమర్శలతో కేసీఆర్ కీలక నిర్ణయం..
posted on Aug 16, 2021 @ 4:21PM
సీఎం కేసీఆర్‌ను నమ్మొచ్చా? దళిత బంధు అందరికీ ఇస్తారా? కేసీఆర్ మాట మీద నిలబడతారా? గతంలో దళిత ముఖ్యమంత్రి.. దళితులకు 3 ఎకరాల భూమిలానే ఇది కూడా అవసరం తీరాక అటకెక్కిస్తారా? ఇలా అనేక అనుమానాలు, విమర్శల మధ్య వాసాలమర్రి, హుజురాబాద్‌లో దళితబంధు కార్యక్రమం ప్రారంభించేశారు సీఎం కేసీఆర్. తెలంగాణలో మొత్తం దళిత కుటుంబాలకు తలా 10 లక్షలు ఇవ్వాలంటే.. మొత్తం లక్షా 70 వేల కోట్లు అవసరం అవుతాయని ఆయనే లెక్కేసి చెప్పారు. ఇందుకోసం ఏటా 40వేల కోట్లు కేటాయిస్తామని.. ఆ లెక్కన 4 ఏళ్లలో దళిత కుటుంబాలందరికీ దళిత బంధు అమలవుతుందని ప్రకటించేశారు. హుజురాబాద్ సభతో దళితబంధును ఘనంగా మొదలుపెట్టిన సీఎం కేసీఆర్.. అదే వేదికగా దళితులపై తనకున్న కమిట్‌మెంట్‌ను నిరూపించుకునేందుకు మరో ప్రకటన కూడా చేసేశారు. ఆ అంశం దళితబంధుకంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అదే.. ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా ఎంపిక చేసుకోవడం.
సీఎం కేసీఆర్ బాగా అప్‌డేట్ అవుతున్నారు. మునపటిలా తనపై వస్తున్న విమర్శలను లైట్ తీసుకోవడం లేదు. ఆ.. వాళ్లు అట్లనే వాగుతారులే.. మనల్ని ఎవరేం చేస్తారులే.. అని ఏమాత్రం ఉదాసీనంగా ఉండటం లేదు. ఎవరెవరు ఏమేం విమర్శలు చేస్తున్నారనేది ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటున్నట్టున్నారు. అందులో భాగంగానే, హఠాత్తుగా నాగార్జునసాగర్‌లో పర్యటించి.. ఎన్నికల తర్వాత కేసీఆర్ నియోజకవర్గాన్ని పట్టించుకోరనే విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టారు.
కేసీఆర్‌లో ఇంతటి మార్పు ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీల రూపంలో రెండు బలమైన పార్టీలు తనను గద్దె దింపేయడానికి రెడీగా కాచుకు కూర్చున్నాయి కాబట్టి. ఓవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూకుడు మామూలుగా లేదు. కేసీఆర్‌ను ప్రగతిభవన్ నుంచి బయటకు గుంజడమే టార్గెట్‌గా దూసుకువస్తున్నారు. అటు, ఇన్నేళ్లూ తన పక్కనే ఉన్న ఈటల రాజేందర్ తన మైనస్‌లన్నీ పట్టేసి.. ఒక్కోటి పూసగుచ్చినట్టి విడమరిచి చెప్పేసి.. ప్రజల్లో అనుమానాలు రెట్టింపు చేసేశారు. రెండేళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చారా? కొత్త పింఛన్లు ఇచ్చారా? అంటూ ఈటెల్లాంటి ప్రశ్నలు సంధించారు. వెంటనే తేరుకున్న కేసీఆర్ కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లను ఆగమేఘాల మీద జారీ చేసేస్తూ.. తప్పు సరిచేసుకుంటున్నారు. ఈటలలాంటోళ్ల విమర్శలకు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు.
ఇక పార్టీ వీడే క్రమంలో ఈటల రాజేందర్ లేవనెత్తిన మరో కీలకాంశాన్ని.. హుజురాబాద్ వేదికగా సరి చేసేశారు సీఎం కేసీఆర్. దొర పాలనలో బీసీలకు, ఎస్సీలకు ప్రాధాన్యం దక్కడం లేదని.. CMOలో ఒక్కరైనా ఎస్సీ అధికారి ఉన్నారా? అంటూ సర్కారును షేక్ చేసే క్వశ్చన్ సంధించారు ఈటల రాజేందర్. దళిత బంధుతో దాదాపు లక్షన్నర కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైన కేసీఆర్.. ఈటల నిలదీసిన ఆ ప్రశ్నను ఆన్సర్ సరి చేసుకోకపోతే.. ఇంతా చేసి వృధా ప్రయాసేనని భావించినట్టున్నారు. దళితులపై తన చిత్తశుద్ధిని శంకించే అవకాశం ఉందని భయపడినట్టున్నారు. అందుకే, ఈటల నిలదీసిన అంశంపై.. ఈటల ఇలాఖా నుంచే ఆన్సర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. దళితుడైన సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను.. CMOలోకి తీసుకుంటున్నానంటూ వేదికపై ప్రకటించేసి.. ఇన్నేళ్లూ సీఎం కార్యాలయంలో దళిత అధికారి ఒక్కరు కూడా లేరనే అపవాదును అప్పటికప్పుడు తుడిపేసుకునే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. పనిలో పనిగా రాహుల్ బొజ్జాతో పాటు ఆయన తండ్రి బొజ్జా తారకంనూ బాగా పొగిడేసి.. దళితులను ఆకాశానికెత్తేశారు సీఎం కేసీఆర్.