దళితులందరికి ఇస్తా.. లక్షా 70 వేల కోట్లు ఓ లెక్కా! కిరికిరిగాళ్ల ఆటలు సాగవన్న కేసీఆర్..
posted on Aug 16, 2021 @ 4:21PM
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకుంటున్న దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు. 15 మంది లబ్దిదారులకు దళిత బంధు స్మార్ట్ కార్డులు అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభకు భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్.. దళిత బంధు పథకం గురించి వివరిస్తూనే విపక్షాలపై విరుచుకుపడ్డారు. దళిత బంధుతో కొత్త చరిత్రను సృష్టిస్తామని చెప్పారు. ఈ పథకంతో ఎస్సీలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు సీఎం. దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు మహా ఉద్యమమని చెప్పారు. ఈ ఉద్యమం విజయం సాధిస్తుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాది కిందటే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నామని, అయితే కరోనా వల్ల ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని దళితులందరికి ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.
దళిత సోదరసోదరీమణులందరికీ "జై భీమ్" అంటూ ప్రసంగం ప్రారంభించారు కేసీఆర్. తాము ఇప్పటికే అమలు చేస్తున్న రైతు బంధు విజయవంతంగా నడుస్తోందని, రైతాంగంలో ఎంతో సంతోషం కనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు దళిత బంధు అదే రీతిన విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దళిత బంధు దేశానికే కాదు, ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు.ఇతర పార్టీలకు రాజకీయాలు అంటే ఓ క్రీడ అని, టీఆర్ఎస్ పార్టీకి మాత్రం సామాజిక అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. సామాజిక లక్ష్యాలను అందుకోవడం టీఆర్ఎస్ పార్టీకి పవిత్ర కర్తవ్యం అని, దళిత బంధును విజయవంతం చేయడంలోనూ అదే రీతిన కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎప్పుడైనా, ఎక్కడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కనీసం ఈ ఆలోచన వాళ్ల మదిలోకైనా వచ్చిందా? అని నిలదీశారు.
పిల్లి తన సంసారాన్ని చక్కదిద్దుకున్నట్టు నేను ఒక్కొక్క అంశాన్ని పరిష్కరించుకుంటూ వస్తున్నానని కేసీఆర్ వివరించారు. తాను దళిత బంధు ప్రకటించానో లేదో కిరికిరిగాళ్లు, కొండెగాళ్లు ఒకరు కీ అంటే ఒకరు కా అంటే... ఒకడు ఇంత ఇవ్వాలంటే, ఇంకొకడు అంత ఇవ్వాలంటే అందరూ దుకాణం మొదలుపెట్టారు అని విమర్శించారు. ఏనాడూ ఐదు రూపాయలు ఇవ్వాలని మాట్లాడనివాడు కూడా ఇవాళ మాట్లాడుతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు."ఇంకొకడు మాట్లాడుతున్నాడు... ఎలా ఇస్తారో చెప్పాలె, ఎవరెవరికి ఇస్తారో చెప్పాలె అంటుండు. ఎందుకు చెప్పం... కుండబద్దలు కొట్టినట్టు చెబుతాం. ఎట్లా చెప్పాలో అట్లా చెబుతాం. నాకొకటి అర్థం కావడం లేదు... ఇచ్చేవాడు ఇస్తాడు, తీసుకునేవాడు తీసుకుంటాడు... మధ్యలో వాళ్లకు ఏంటి కడుపుమంట?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘రైతుబంధు పథకం అద్భత ఫలితాలు సాధిస్తోంది. కరీంనగర్‌లోనే రైతుబీమా ప్రారంభించాను. తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన సభ కరీంనగర్‌లోనే జరిగింది. అద్భుతమైన మరో ఉద్యమానికి కరీంనగర్‌లోనే శ్రీకారం చుట్టాము. తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలి. దళితబంధు కచ్చితంగా విజయవంతం అవుతుంది. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి పట్టుదల ఉండాలి. 25 ఏళ్లక్రితం నుంచే దళితుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అవకాశాలు, ఆస్తుల లేక దళితులు అణగారిపోయి ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న పని 75 ఏళ్ల కిందే మొదలు పెట్టి ఉంటే ఈ దుస్థితి ఉండేదా? హుజురాబాద్‌లో దళితబంధు అమలు ఒక ప్రయోగశాల లాంటిది. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా దళితబంధు వర్తింపు. ఎస్పీలలో నిరుపేదలకు ముందుగానే దళితబంధు నిధులు. దళితబంధును విజయవంతం చేసే బాధ్యత విద్యార్థులపై ఉంది. తెలంగాణలో 17 లక్షలకుపైగా దళిత కుటుంబాలున్నాయి’’ అని కేసీఆర్ తెలిపారు.