ఏపీలో ఆడపిల్లలకు రక్షణేది? దిశ ఏమైంది? జగనన్న వల్ల కాదా?
posted on Aug 16, 2021 @ 2:35PM
'అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా సంచరించిన నాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు. కానీ, ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో స్వాతంత్య్ర దినోత్సవం నాడే నడిరోడ్డుపై ఒక ఉన్మాది ఒక దళిత ఆడ కూతురు రమ్యశ్రీని కత్తితో పొడిచి చంపడం అత్యంత దారుణం. ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి. నిజంగా దిశ చట్టాలు, యాప్‌లు సక్రమంగా పనిచేస్తుంటే ఇలాంటి ఘటనలు రోజూ ఎందుకు జరుగుతాయి? మీకు ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ చట్టాన్ని అమలు చేయడంలో ఎందుకు ఉండడం లేదు?' అంటూ యువనాయకుడు పరిటాల శ్రీరామ్ వ్యక్తం చేసిన ఆగ్రహం నిజంగా చర్చణీయాంశం.
అవును, ఏపీకి ఏమైంది? దిశ చట్టం ఆడపిల్లలపై నేరాలు-ఘోరాలను ఆపగలిగిందా? దిశ యాప్ ఆపత్కాలంలో ఆదుకుందా? ప్రభుత్వ ప్రచార ప్రటోపాలే కానీ.. అమలులో దిశ విఫలమైందా? జగనన్న పాలనలో అమ్మాయిలకు రక్షణ కరువైందా? ఇలా అనేక ప్రశ్నలు.. వాటిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలు.
ఒకటి రెండు కాదు.. వరుస ఘటనలు.. గడిచిన రెండేళ్లలో అనేక దారుణాలు. ఆడపిల్లలనే కాదు చిన్నారులపైనా ఘోరాలు. మొన్నటికి మొన్న తాడేపల్లిలోని సీఎం జగన్ ప్యాలెస్ ఉన్న ఏరియాలోనే కృష్ణానది తీరంలో యువతిపై అత్యా-చారం జరగడం కలకలం రేపింది. ఇద్దరే నిందితులు. వారిని పట్టుకోవడానికి పోలీసులకు చుక్కలు కనిపించాయి. నెలలు గడిచాక ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే ఇటీవల పట్టుకున్నారు. మరొకడు ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. ముఖ్యమంత్రి జగన్ నివాస చుట్టుప్రక్కల ప్రాంతంలోనే ఆడపిల్లకు రక్షణ ఇవ్వలేకపోయిన ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏం చేయాలి?
సర్కారు వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకే అన్నట్టు హడావుడిగా దిశ యాప్ తీసుకొచ్చారు. పే..ద్ద సభ పెట్టి హంగామాగా దిశ యాప్ ప్రారంభించేశారు. ప్రచారంతో ఊదరగొట్టారు. అయినా ఏం లాభం? మహిళలకు ఏం ప్రయోజనం? దిశ యాప్ అమల్లోకి వచ్చి నెల గడవగానే.. గుంటూరులో ఉన్మాది శివకృష్ణ చేతిలో బీటెక్ స్టూడెంట్ రమ్యశ్రీ దారుణ హత్యకు గురికావడం.. ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు. నేరగాళ్లలో భయం క్రియేట్ చేసేలా సర్కారు సరైనన చర్యలు తీసుకోలేకపోవడం వల్లే క్రిమినల్స్ ఇలా చెలరేగిపోతున్నారని ఆరోపిస్తున్నారు. రమ్యశ్రీని ఆ ఉన్మాది వెంటాడాడు. చేయిపట్టుకొని బలవంతంగా లాగాడు. కొంతదూరం పాటు ఆమెవెంటే పడ్డాడు. వాడి నుంచి తప్పించుకునేందుకు పాపం ఆ అమ్మాయి పెనుగులాడుతూనే ఉంది. ఆ సమయంలో ఎవరైనా అదే చేస్తారేమో. అయినా వాడు వదలకుండా ఆమెను కత్తితో ఆరు పోట్లు పొడిచాడు. ఆ దుర్ఘటనను అడ్డుకోడానికి దిశ యాప్ ఎలా పనికొస్తుంది? దాని వల్ల ఉపయోగమేంటి? తనను అలా కత్తితో పొడుస్తాడని ఆమె ముందే ఊహించకపోవచ్చు. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోవాలనే చూస్తారు కానీ.. దిశ యాప్ అనేది ఒకటుంది. ఫోన్ తెరచి.. దిశ యాప్ ఓపెన్ చేసి.. బటన్ నొక్కాలనే ఐడియా వెంటనే తట్టకపోవచ్చు. ఒకవేళ ఆ పని చేసినా.. దిశ పోలీసులు వచ్చే సరికి.. జరగాల్సిన దారుణం జరిగిపోయి ఉండేది. అంటే, దిశ యాప్ అన్నివేళలా, అందరికీ, అన్ని ఘటనల్లో ఉపయోగపడకపోవచ్చు. అంటే, కేవలం దిశ తీసుకొచ్చి.. ఇక తాము మహిళల రక్షణకు అన్ని ఏర్పాట్లు చేశామంటూ జగన్ సర్కారు జెబ్బలు చరుచుకోవడం సిగ్గుచేటు..అంటున్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ఆడపిల్లల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూ జగన్ చెబుతున్నారు. మహిళల రక్షణ కోసమంటూ.. దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇవేవీ అమ్మాయిలకు రక్షణ కల్పించలేకపోతున్న తీరు చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఓ మహిళను నియమించామని జగన్ గొప్పలు చెబుతున్నారు. ఆ మహిళా హోం మినిస్టర్ సొంత జిల్లాలోనే ఉన్మాది చేతిలో రమ్యశ్రీ దారుణ హత్యకు గురికావడం సర్కారు వైఫల్యమే అంటున్నారు. నిందితుడిని పట్టుకొని కఠిన శిక్ష విధించినా.. బాధిత కుటుంబానికి 10 లక్షలు పరిహారం అందించినా.. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఆ కుటుంబ శోకం తీరుతుందా? ప్రాణం పోకుండా కదా ప్రభుత్వం చూడాల్సింది? అంటున్నారు.
గుంటూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదని మండిపడ్డారు. సీఎం నివాసానికి దగ్గర్లో ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. జగన్ పాలనలో ఇప్పటిదాకా 500కి పైగా మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరిగాయని ఆరోపించారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నాగానీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని విమర్శించారు. సీఎం జగన్ సోదరి.. వైఎస్ సునీతారెడ్డికి ప్రాణహాని ఉందంటే, సామాన్యులకు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేమి భద్రత దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు, రమ్యశ్రీ మృతదేహానికి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మహిళలపై నేరాలు-దారుణాలు ఆగడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు నారా లోకేశ్.
రమ్యశ్రీ ఘటనతో జగన్ సర్కారు వైఫల్యం మరోసారి బయటపడినట్టైంది. ఏపీలో మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది. నేరం చేయాలంటేనే భయం కలిగేలా, దారుణం జరగకుండా అడ్డుకునేలా ప్రభుత్వ చర్యలు, విధానాలు ఉండాలి కానీ.. ఏదో ప్రచారం కోసం పైపై చర్యలు చేపడితే.. సరైన ఫలితం ఉండదని ప్రజలు మండిపడుతున్నారు.