అమరావతికే జగన్ జై కొడతారా? పంద్రాగస్టు ప్రసంగంలో సంకేతమిచ్చారా?
posted on Aug 15, 2021 @ 2:11PM
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీఎం జగన్ మనసు మారిందా? మూడు రాజధానుల సిద్ధాంతాన్ని పక్కన పెడుతున్నారా? అంటే అవుననే సమాధానమే ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. అమరావతి పేరు వింటేనే విసుక్కునే వైసీపీ అధినేత.. ఇప్పుడు అమరావతి అభివృద్ధిపై ఫోకస్ చేయడంతో ఇప్పుడు ఈ ప్రశ్నలే అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. కొన్ని రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇందులు బలాన్నిస్తున్నాయి. మూడు రాజధానుల సిద్ధాంతాన్ని సీఎం జగన్ పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కిలిక విరామామా లేక నిజంగానే ఆయన మనుస మారిందా అన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.
చాలా కాలంగా సీఎం జగన్ సచివాలయానికి వెళ్లడం లేదు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే పాలన సాగిస్తున్నారు. అయితే సడెన్ గా ఆయన మానసు మార్చుకున్నారు. ఇక నుంచి సచివాలయానికి వెళ్లాలని నిర్ణయించారు. ప్రతి పది రోజులకోసారి సచివాలయానికి వెళ్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇటీవలకాలంలో సచిలవాలయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో సీఎం జగన్ సచివాలయానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ నిర్ణయంతో సచివాలయంతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇక నుంచి సచివాలయానికి వెళ్ళాలని జగన్ ఎందుకు అనుకుంటున్నారు?. ఆకస్మిక నిర్ణయానికి దారితీసిన పరిణామాలు ఏమైఉంటాయి?. సచివాలయ విషయంలో ఐఏఎస్‌లపై చీఫ్ సెక్రెటరీ ఎందుకు సీరియస్‌గా ఉన్నారు ?. అమరావతి నుంచి విధులు నిర్వర్తించడం ఇన్నాళ్లూ ఎందుకు జరగలేదు?. మూడు రాజధానుల సిద్ధాంతానికి జగన్ తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నారా?.’’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగానే స్వాత్రంత్య దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ముఖ్యమంత్రి.. మూడు రాజధానుల ప్రస్తావనే తన ప్రసంగంలో తేలేదు. దీంతో అమరావతి విషయంలో సీఎం జగన్ వెనక్కి తగ్గినట్లే కనిపిస్తుందనే చర్చ జోరందుకుంది.
స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఏమేం చేసింది..? అనేదానితో పాటు పలు విషయాలపై నిశితంగా మాట్లాడారు సీఎం జగన్. అయితే.. గతంలో పలు సభల్లో, సమావేశాల్లో, పంద్రాగస్టులో కూడా మూడు రాజధానుల గురించి జగన్ చాలా సార్లే ప్రస్తావించారు. ఈసారి ప్రసంగంలో మాత్రం మూడు రాజధానుల ప్రస్తావనే అస్సలు కనిపించలేదు. ఆయన ఎందుకు ఈ ప్రస్తావన తీసుకురాలేదన్నది ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన రాకపోవడంతో వేడుకలకు వచ్చిన పెద్దలు, వైసీపీ నేతలు, వీక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. పాలనలోని ముఖ్య అంశాలను ప్రస్తావించిన జగన్.. అత్యంత కీలకమైన మూడు రాజధానుల గురించి మాట్లాడకపోవడంతో... ఏదో జరుగుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది.
అమరావతి రైతుల ఉద్యమం 600 రోజులకు పైగా కొనసాగుతోంది. రైతులు, రైతు కూలీలు పోరాచం చేస్తున్నారు. మరోవైపు ఏపీలోని తీరప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉందని నాసా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే మూడు రాజధానుల ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడటం, గతంలో పట్టించుకోని సచివాలయానికి రెగ్యులర్ గా వెళ్లాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ తీరుతో అమరావతి విషయంలో ఆయన కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుందనే చర్చ వైసీపీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది.