తమ్ముళ్లకు ఖాకీల వేధింపులు.. చంద్రబాబు ఆగ్రహం.. డీజీపీకి లేఖాస్త్రం..
posted on Sep 8, 2021 @ 12:53PM
ఏపీ పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారనే విమర్శలు. కేసులు, కుట్రలతో టీడీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు. అందుకు తగ్గట్టే ఖాకీల ఓవరాక్షన్ మామూలుగా ఉండట్లేదు. తాజాగా, ఓ కేసులో పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు టార్చర్ చేశారని అంటున్నారు. పదేళ్ల లోపు చిన్నారులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం మరింత వివాదాస్పదమవుతోంది. ఖాకీల తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది.
ప్రకాశం జిల్లా లింగసముద్రం పోలీసులు మొగిలిచర్లకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. పి.రత్తయ్య, ఎం.శ్రీకాంత్ అనే కార్యకర్తలను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారన్న చంద్రబాబు.. టీడీపీని వీడాలని వారిపై ఒత్తిడి చేశారన్నారు. అర్ధరాత్రి 2 గంటలకు వదలిపెట్టారని.. ఉదయాన్నే మళ్లీ 6.30 గంటలకు లింగసముద్రం ఎస్ఐ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించారని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు చంద్రబాబు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 6 నుంచి 10 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు.
పోలీసుల బెదిరింపులు తట్టుకోలేక రత్తయ్య, శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత మిగిలిన వారిని హడావుడిగా స్టేషన్ నుంచి పంపించారని, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. ఈ సంఘటనతో ఏపీలో పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండేళ్లుగా పోలీసుల బెదిరింపులు తారస్థాయిలో ఉన్నాయంటు చంద్రబాబు మండిపడ్డారు. పోలీస్ ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారుతోందన్నారు. చట్టానికి లోబడి పోలీసులు విధులు నిర్వహించాలన్నారు. లింగసముద్రం ఘటనపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు చంద్రబాబు.