ఢిల్లీలో విమానాన్ని ఆపేసిన చీమలు.. భూటాన్ యువరాజు షాక్..
posted on Sep 8, 2021 @ 9:25PM
చీమలు. చిన్ని చిన్ని చీమలు. దులిపేస్తే పోతాయ్. ఉఫ్ మని ఊదేస్తే ఎగిరిపోతాయ్. లక్ష్మణరేఖ రాసినా చాలు.. చీమలన్నీ మాయం. కానీ.. అక్కడ మాత్రం సీన్ అలా లేదు. చీమలే కదాని లైట్ తీసుకోలేని పరిస్థితి. వాటిని అలా వదిలేస్తే అసలుకే ఎసరు వచ్చే అవకాశం. అందుకే, చీమల దండు ఓ దేశ యువరాజు ప్రయాణాన్నే ఆపేసింది. ఆయన వెళ్లాల్సిన విమానం రద్దైంది. ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఆ ఫ్లైట్ జస్ట్ చీమల వల్ల రద్దు కావడం ఆసక్తికరంగా మారింది. పక్షులు, గబ్బిలాల వల్ల విమానాలు రద్దు అయిన ఘటనలు చూసాం కానీ చీమల వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ కావడం బహుషా ఇదే మొదటిసారి కావొచ్చని అంటున్నారు.
ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం చీమల కారణంగా కొన్ని గంటలు ఆలస్యం కావడం సంచలనంగా మారింది. బిజినెస్ క్లాసులో చీమల గుంపు కనిపించడంతో టేకాఫ్‌ను ఆపేశారు పైలట్. చీమలను దులిపేస్తే సరిపోదు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడం కూడా ముఖ్యం. సున్నితమైన విమాన భాగాల్లో చీమల గుంపు ఉండిఉంటే ఎంతో ప్రమాదకరం. అందుకే, చీమల రాదారిని కనిపెట్టే వరకూ విమానాన్ని నడిపే పరిస్థితి లేదు. అప్పటికే బాగా ఆలస్యం కావడంతో.. అందులోని ప్రయాణికులను మరో విమానంలోకి తరలించి లండన్ పంపించారు.
విమానం అంటే రిచ్ అండ్ నీట్ మెయిన్టెనెన్స్ ఉంటుంది. అందులోనూ బిజినెస్ క్లాస్ అంటే మరింత క్లీన్‌నెస్ తప్పనిసరి. అలాంటిది రిచ్ క్లాస్ పీపుల్ జర్నీ చేసే బిజినెస్ క్లాస్‌లోనే చీమల గుంపు వచ్చి చేరిందంటే.. మన ఎయిర్ ఇండియా విమానాల పని తీరు ఎలా ఉందో అర్థం అవుతుంది. విదేశీ ప్రయాణీకుల దగ్గర దేశ పరువు పోతోంది. ఇక, చీమలు చేరిన ఆ ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలోనే భూటాన్ యువరాజు జిగ్మే నాంగ్మేల్ వాంగ్ చుక్ కూడా ఉండడం ఆసక్తికరం.