తెలంగాణలో వరదలకు కేసీఆరే కారణం.. మంత్రి సంచలనం..
posted on Sep 8, 2021 @ 2:18PM
తెలంగాణలో ఫుల్ వర్షాలు. వానతో పాటు వరద. చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. నగరాలు, పట్టణాలు, ఊరూ-వాడ.. వరద నీటిలో మునిగిపోయాయి. ఇక, లోతట్టు ప్రాంతాల్లో జలవిలయమే. ముందు హైదరాబాద్ నిండా మునిగింది. ఆ తర్వాత వరంగల్‌ను ముంచెత్తి. అట్నుంచి కరీంనగర్, సిరిసిల్లలలో జల ప్రళయం సంభవించింది. మునుపెన్నడూ లేనంత వానలు. అంతకుమించి వరదలు. అంతా ఆగమాగం. వరద ముంపుతో అరాచకం.
ప్రకృతి ప్రకోపమే ఇందుకు కారణమని ప్రభుత్వం అంటోంది. సర్కారు వైఫల్యం వల్లే వరదకు కారణమనేది ప్రతిపక్షాల విమర్శలు. ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తుంటే.. మధ్యలో మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో వరద ముంపునకు కారణం.. సీఎం కేసీఆరే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల. అందుకు ఆయన చేసిన సూత్రీకరణ బహు చిత్రంగా ఉందంటున్నారు జనాలు.
ఎడతెరపి లేని వర్షాలకు కరీంనగర్ టౌన్‌తో పాటు పరిసర గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గంగుల కమలాకర్.. ఆ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో వరదనీరు చేరడానికి తమ ప్రభుత్వ పాలనే కారణమంటూ గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ సీఎం కాక ముందు గ్రౌండ్ వాటర్ ఎక్కువగా లేదని.. అందుకే వర్షాలు పడ్డప్పుడల్లా ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలుగా మారేవని.. ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండటంతో గ్రౌండ్ వాటర్ పెరిగి.. వాన నీరు భూమిలో ఇంకేందుకు ప్లేస్ లేక.. ఇలా వరదలా వెల్లువెత్తుతోందని.. వరద పురాణాన్ని చక్కగా వల్లెవేశారు మంత్రి గంగుల కమలాకర్.
మానేరు జలాశయం నిండి గేట్లు తెరిచామని.. కాబట్టి నీరు భూమిలోకి పోలేక ఇలా నగరాలు, పల్లెల్లోకి చేరుతోందని చెప్పారు. ఇక ప్రకృతి విపత్తులు చెప్పి రావని.. అవి వచ్చినపుడు ప్రభుత్వం కూడా వాటిని ఆపలేదని సర్కారును వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు.
అయితే తెలంగాణలో అనేక నగరాలలో చెరువులు, నాలాలు విచ్చలవిడిగా కబ్జాలకు గురయ్యాయని.. అందుకే వరదనీటికి దారి లేక, ఇళ్ల మధ్యలోకి నీరు చేరుతుందనేది అందరి మాట. ఆక్రమణలను తొలగించే ధైర్యం సర్కారుకు లేదు. ఎందుకంటే చెరువులు, నాలాల కబ్జాలో ఎక్కువ భాగం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరిగినవే కాబట్టి. మరోవైపు, వరద నీరు వెళ్లేందుకు సరైన ప్రణాళికలు రూపొందించకుండా ప్రభుత్వం చేతులెత్తేయడం వల్లే.. ఇలా భారీ వానలు కురిసినప్పుడు నగరాలు నిండా మునుగుతున్నాయనేది నిపుణుల ఆరోపణ. ఇవన్నీ పక్కన పెట్టేసి.. సీఎం కేసీఆర్ చేసిన గొప్ప పని వల్లే వరదలు వస్తున్నాయంటూ.. అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేసి.. ఇటు సర్కారును, అటు జనాలను కన్ఫ్యూజన్‌లో పడేసిన మంత్రి గంగుల కమలాకర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మంత్రి గారి వరద పురాణంపై ట్రోలింగ్ సైతం బీభత్సంగా జరుగుతోంది.