జగన్ ను పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యే.. అదే బాటలో మరికొందరు?
posted on Sep 8, 2021 @ 12:15PM
సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీ నేతలకు నచ్చడం లేదా? ఆయన నిర్ణయాలను పట్టించుకోవడం లేదా? అంటే అవుననే తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్ని వివాదాస్పమవుతున్నాయి. జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కోర్టుకు కూడా తప్పు పడుతున్నాయి. కొన్నింటిని రద్దు చేశాయి. వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నా జగన్ సర్కార్ తీరు మాత్రం మారడం లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి తప్పుడు సలహాలతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోందని సమాచారం. అంతేకాదు కొందరు లీడర్లు ప్రభుత్వ నిర్ణయాలను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నందునే అలా చేస్తున్నారని సమాచారం.
తాజాగా వినాయక చవితి బహిరంగ వేడుకలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుమారం రేపుతోంది. దీనిపై ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గణేష్ పందిళ్లు.. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులను నిరాకరించడంతో జనాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో పక్క రాష్ట్రాల్లో లేని విధంగా వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు పెట్టడంతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని సమర్థించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. జనాల్లో వ్యతిరేకత ఉండటంతో కొందరు గ్రామాలకు వెళ్లడానికి జంకుతున్నారు.
ఒక వైసీపీ ఎమ్మెల్యే సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. వినాయక మండపాలకు అనుమతి కోరుతూ ఆయన లేఖ రాయడంతో వైసీపీలో అలజడి రేగింది.వైసిపికి చెందిన విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర గణేష్ ఉత్సవానికి అనుమతి కోరుతూ స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్కు లేఖ సమర్పించారు. ప్రభుత్వం విగ్రహాలను పెట్టవద్దని చెబుతుంటే.. అధికార వైసిపి ఎమ్మెల్యే రాజన్న దొర రాసిన ఈ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాజన్న దొర లేఖతో వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వైసీపీ నేతలకు నచ్చడం లేదని స్పష్టమవుతోంది.
గణేష్ పండుగపై వివాదాస్పద నిర్ణయంపై జగన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్న ప్రతిపక్ష నాయకులకు ఇది ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే గణేష్ మండపాలకు అనుమతి నిరాకరించడంపై టిడిపి బిజెపి పార్టీలు వైయస్ఆర్సిపిని లక్ష్యంగా చేసుకున్నాయి. వారితో కలిసి పవన్ కళ్యాణ్ కోవిడ్ ఆంక్షలు వినాయక చవితికి మాత్రమే వర్తిస్తాయా? అని నిన్న తీవ్రవిమర్శలు చేశారు. వైఎస్ఆర్సిపి నాయకుల పుట్టినరోజు వర్థంతి జయంతి వేడుకలకు వర్తించదా అని కడిగేశాడు. ఈ నేపథ్యంలో గణేష్ మండపానికి అనుమతి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే లేఖ రాయడం ఏపీలో ఆసక్తిగా మారింది. రాజన్న దొరే కాదు మరికొందరు వైసీపీ నేతలు కూడా వినాయక చవితి వేడుకల విషయంలో ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు.