కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ లేనట్టేనా? కేసీఆర్ నట్టేట ముంచేశారా?
posted on Sep 8, 2021 @ 3:22PM
కాంగ్రెస్ నేతల అనుమానాలే నిజమయ్యాయా.. విపక్షాలు చెబుతున్నటే జరిగిందా.. అంటే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అదే జరిగిందని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కొన్ని రోజులకే గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆగస్ట్ 1న జరిగిన కేబినెట్ సమావేశంలో కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ తీర్మానం చేశారు. వెనువెంటనే దీనికి సంబంధించిన ఫైల్ ను రాజ్ భవన్ కు పంపించారు. సీఎంవో నుంచి వచ్చిన ప్రకటనతో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయారనే అంతా అనుకున్నారు. ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర పడిందని కూడా ప్రచారం జరిగింది. కాని తర్వాత అసలు సంగతి తెలిసింది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రతిపాదన గవర్నర్ కార్యాలయానికి వెళ్లలేదనే సమాచారం వచ్చింది.
ఇక కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి నెల రోజులు గడిచినా ఆమోదముద్ర పడకపోవడంతో.. అతనికి ఎమ్మెల్సీ వస్తుందా రాదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కౌశిక్ రెడ్డిని కేసీఆర్ మోసం చేశారనే ఆరోపణలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. తాజాగా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమాజ సేవ, ఇతర రంగాల్లో విశేష కృషి చేసిన వారినే గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని అన్నారు. ప్రభుత్వం తమకు పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాల్సి ఉందని... ఆలోచించిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. గతంలో ప్రజాకవి గోరటి వెంకన్నను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపిన ఫైల్ ను... తమిళిసై ఒక్క రోజు వ్యవధిలోనే ఆమోదించారు. కౌశిక్ విషయంలో మాత్రం ఆమె సమయం తీసుకుంటున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీకి ఆమోదముద్ర పడే అవకాశాలు లేవని భావిస్తున్నారు.
తమకు పరీక్షగా మారిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచేందుకు ఎత్తులు వేస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేలా అనూహ్యా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డిని కారెక్కించారు. అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో శాసనమండలికి ఎంపిక చేశారు. అయితే నామినేటెడ్ కోటాలో కౌశిక్ రెడ్డి పేరు ప్రతిపాదించగానే.. ఆయనకు సంబంధించిన కొత్త అంశాలు వెలుగులోనికి వచ్చాయి. ఆయన గతంలో చాలా కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని ఇప్పటికి విచారణలో ఉన్నాయి. ప్రత్యర్థులు ఆయనపై ఉన్న కేసులను బయటికి తీశారు. పాడి కౌశిక్ రెడ్డిపై తొమ్మిది కేసులు ఇంకా ఉన్నాయని తేలింది.
1. డిసెంబర్ 28 ,2012న ఐపీసీ 506 కింద జమ్మికుంట పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తనను చంపేస్తానని బెదిరించాడని అరుకల వీరశలింగం అనే వ్యక్తి కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు రికార్డుల ప్రకారం ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
2. డిసెంబర్ 28 ,2012న ఐపీసీ 506 కింద కరీంనగర్ రూరల్ పీఎస్ లో బెదిరింపుల కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు లోక్ అదాలత్ పరిధిలో ఉంది.
3. సెప్టెంబర్ 28, 2017న ఇల్లంతకుండ పోలీస్ స్టేషన్ లో 506, 507 సెక్షన్ల కింద పాడి కౌశిక్ రెడ్డిపై బెదిరింపుల కేసు నమోదైంది.
4. డిసెంబర్ 6, 2017న వరంగల్ సుబేదారి పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. భూ వివాదానికి సంబంధించి ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు.
5. నవంబర్ 28, 2018న అనుమతి లేకుండా సమావేశం నిర్వహించినందుకు కౌశిక్ రెడ్డిపై 188, 171 F, 171-H, 127 (A) RP Act కింద వీణవంక పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.
6. నవంబర్ 28, 2018న హుజురాబాద్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రూల్స్ కు విరుద్దంగా హనుమాన్ టెంపుల్ లో పబ్లిక్ మీటింగ్ నిర్వహించారనే అభియోగాలతో 505, 171-C, 171-G r/w 171-F IPC కింద కేసులు పెట్టారు.
7. మే 8, 2020న మార్కెట్ యార్డులో ఎలాంటి అనుమతి లేకుండా సమావేశం, నిరసన తెలిపినందుకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఇల్లంతకుండ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డిపై 188 IPC కింద కేసు నమోదైంది.
8. కొవిడ్ మార్గదర్శకాలు ఉల్లంఘిస్తూ 59 మందితో సమావేశం నిర్వహించారనే కారణంతో సిరిసిల్ల పీఎస్ లో జూన్ 13, 2020న పాడి కౌశిక్ రెడ్డిపై 143, 147, 353, 341, 269, 270 r/w 149 IPC, Sec 3 of Epidemic Diseases Act కింద కేసులు నమోదయ్యాయి.
9. సెప్టెంబర్ 1, 2020న హుజురాబాద్ పీఎస్ లో కౌశిక్ రెడ్డిపై 186, 188, 506 IPC, Sec 3 The Epidemic Diseases Amendment కింద కేసులు కట్టారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి హుజురాబాద్ ప్రభుత్వాస్పత్రిని విజిట్ చేశారు. ఆ సయమంలో డ్యుటీలో ఉన్న వైద్యులు, మెడికల్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారనే ఫిర్యాదుతో కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి
కౌశిక్ రెడ్డిపై తొమ్మిది కేసులు ఉన్నాయన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గవర్నర్ ఆయన విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. సామాజిక సేవా రంగంలో ప్రతిపాదన వచ్చినందున.. కేసులు ఉన్న వ్యక్తిని ఎంపిక చేయడం సరికాదనే భావనలో గవర్నర్ ఉన్నారంటున్నారు. తమిళి సై తాజా ప్రకటనతో కౌశిక్ రెడ్డికి నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ దక్కడం కష్టమేనన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
---
పాదయాత్రకు ప్రజల నుంచి ఊహించనంత స్పందన వస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం 11 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర తీరుతెన్నులపై సంగారెడ్డిలో పాదయాత్ర కమిటిలతో బండి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ 2023లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు వస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎంకు సమాచారం ఇచ్చాయన్నారు. అందుకే కేసీఆర్ భయంతో ఢిల్లీకే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. పాదయాత్రపై కేంద్రం నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. యాత్రను ప్రోత్సహిస్తూ అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, జేపీ నడ్డా, అమిత్ షా స్పూర్తితో మరింత కష్టపడి పనిచేసి పాదయాత్రను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని కోరుతున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.