ముద్దు..హద్దు..వద్దు.. యోగి బాటలో బండి.. సక్సెస్ అవుతారా?
posted on Sep 8, 2021 @ 8:06PM
బండి జోరు మామూలుగా లేదు. ప్రజా సంగ్రామ యాత్రతో దూకుడు మీదున్నారు. ప్రగతి భవన్‌పై దండెత్తడానికి కాలినడకన కదలివస్తున్నారు. పాదయాత్రతో కాషాయ దండును ఉరకలెత్తిస్తున్నారు. అనూహ్య స్పందన చూసి కమలదళంలో మరింత ఉత్సాహం నెలకొనడంతో.. మాటలకు మరింత పదును పెట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. తాజాగా, ఆయన చేసిన పలు కామెంట్స్ తెలంగాణలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. అధికారంలోకి వస్తామనే ధీమా వారిలో స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.
యూపీలో యోగి పాలసీని తెలంగాణలోనూ అమలు చేస్తామని ప్రజా సంగ్రామ యాత్రలో ప్రకటించారు బండి సంజయ్. ఆ పాలసీనే ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. "ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు".. అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు బండి సంజయ్. వచ్చే ఎన్నికలో తాము అధికారంలో వస్తే మొదటగా యూపీలో మాదిరిగా తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకువస్తామని సంచలనం రేపారు. ఓ వర్గం జనాభా విపరీతంగా పెరిగిపోవడం.. రాజ్యాంగ విరుద్దమైన ముస్లిం రేజర్వేషన్ల వల్ల.. బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపించారు.
యూపీ సీఎం యోగి ఇలానే చేశారు. ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే.. ప్రభుత్వ పథకాలకు అనర్హులంటూ చట్టం చేశారు. ముస్లింలను టార్గెట్‌గా చేసుకొనే ఈ చట్టం చేశారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి వివాదాస్పద ఎజెండాను బండి సంజయ్ సైతం ఎత్తుకోవడం సంచలనంగా మారింది. హిందువుల కంటే ముస్లింలే ఎక్కువ సంతానం కలిగి ఉంటారు. వారి టార్గెట్‌గానే "ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు".. నినాదాన్ని బీజేపీ తెరపైకి తీసుకొస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, అలాంటి చట్టంతో యూపీలో యోగి సక్సెస్ అయ్యారు. అందుకే, తెలంగాణలోనూ వర్కవుట్ చేసేలా బండి సంజయ్ అనూహ్యంగా జనాభా నియంత్రణ చట్టాన్ని తన పాదయాత్ర సమయంలో చర్చకు ఉంచారని అంటున్నారు. మరి, ఈ పాలసీ తెలంగాణలో కమలనాథులకు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి..