వీలైతే అమ్మేద్దాం.. లేదంటే కూల్చేద్దాం! జగనన్న పాలసీ ఇదేనా?
posted on Sep 8, 2021 @ 5:07PM
ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదమే. అధికారులతో చర్చిస్తున్నారో లేక సొంతగానే నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదు కాని.. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్ని జనాల నుంచి వ్యతిరేకత ఎదుర్కుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. జగన్ ఏకపక్ష నిర్ణయాల్లే వల్లే సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు అంటన్నాయి. అడ్డగోలు అప్పులతో అసలే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం.. అందిన కాడికి ఆస్తులు అమ్మే ప్రయత్నాలు చేస్తోంది. కోర్టులు అడ్డుకోవడంతో కొన్నింటికి బ్రేకులు పడింది. అయినా తమ ప్రయత్నాలు ఆపడం లేదు జగన్ రెడ్డి సర్కార్.
తాజాగా విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్‌ను ప్రైవేట్ కార్యకలాపాలకు అనుమతించేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విశాఖలో సకల సౌకర్యాలతో ఉన్న రిషికొండ బీచ్ ను కూల్చేసి అక్కడ కొత్త రిసార్ట్ కడుతోంది. ఏపీలో జగన్ సర్కారు అవలంభిస్తున్న విధానాలు పెను వివాదాలనే సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులపై జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. వీలైతే అమ్మేద్దాం.. లేదంటే కూల్చేద్దాం అన్నట్లుగా జగనన్న పాలసీ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించుకున్న భూములను అమ్మేందుకు గతంలో ప్రయత్నించింది జగన్ సర్కార్. భక్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. ఆ తర్వాత ఆలయ భూములను వదిలేసిన జగన్ సర్కారు.. ఏకంగా సర్కారీ భూములనే విక్రయించేందుకు సిద్ధమైంది. దీనిపై ఫిర్యాదులు రావడంతో భూముల అమ్మకాలకుహైకోర్టు బ్రేకులేసింది. అమ్మకం కుదరకపోవడంతో జగన్ సర్కారు సర్కారు భూములు, ఆస్తులను కేంద్రంగా చేసుకుని నయా దందాకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విశాఖలోని రిషికొండలో ఉన్న ఏపీటీడీసీ రిస్టార్ట్ ను కూలగొట్టి.. దాని స్థానంలో కొత్త రిసార్ట్ కట్టేందుకు సిద్ధమైన జగన్ ప్రభుత్వం.. తాజాగా విజయవాడ నడిబొడ్డులోని స్టేట్ గెస్ట్ హౌస్ ను ఏకంగా వాణిజ్య కార్యకాలపాలకు అనుమతిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై విపక్షాలతో పాటుగా రాష్ట్ర ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న 3.26 ఎకరాల్లో ఉన్న ఈ గెస్ట్ హౌస్ విలువ రూ.1,500 వందల కోట్లకుపైగానే ఉంటుంది.స్టేట్ గెస్ట్ హౌస్ ను వాణిజ్య భవనంగా మార్చాలని ప్రతిపాదన చేశారు. ఈ బాధ్యతలు కూడా భూములు అమ్మకాలు చూస్తున్న నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ సంస్థకే ఇచ్చారు. 3.26 ఎకరాల్లో వాణిజ్య భవనంగా అభివృద్ధి చేసి .. లీజుకివ్వడమో.. అమ్మడమో చేయబోతున్నారు. ఇందుకోసం డిజైన్లు అందించేందుకు రుద్రాభిషేక్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ దిశగా జగన్ సర్కారు చర్యలు చూస్తుంటే.. మరికొన్ని రోజుల్లో స్టేట్ గెస్ట్ హౌస్ అదృశ్యం కానుందని, అక్కడ కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ కనిపించనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి
స్టేట్ గెస్ట్ హౌస్ స్థలంలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడమంటే.. అక్కడ ఇక స్టేట్ గెస్ట్ హౌస్ కనుమరుగైనట్లే. స్టేట్ గెస్ట్ హౌస్ అయినా ఉండాలి.. లేదంటే భారీ కమర్షియల్ కాంప్లెక్స్ అయినా ఉండాలి. రెండూ అక్కడ ఉండటం అసాధ్యం. మరి గెస్ట్ హౌస్ స్థలంలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం అంటే.. స్టేట్ గెస్ట్ హౌస్ ను తొలగిస్తున్నట్లే. అక్కడి స్టేట్ గెస్ట్ హౌస్ ను తొలగించి కమర్షియల్ కాంప్లెక్స్ కడితే.. అందులో అంతా ప్రైవేట్ వ్యాపారం జరుగుతుంది కదా.. మరి అక్కడ ప్రభుత్వ పెత్తనం గానీ, పర్యవేక్షణ గానీ ఉండవు కదా. అదే జరిగితే.. స్టేట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని జగన్ సర్కారు అమ్మేసినట్టే కదా..నేరుగా అమ్ముతున్నాం అని చెప్పకుండా దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టడమే కదా అన్న చర్చ జనాల్లో సాగుతోంది.