గణేశ్ ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. కండిషన్స్ అప్లై!
posted on Sep 8, 2021 @ 5:32PM
ఏపీలో గణేశ్ ఉత్సవాల రచ్చ మామూలుగా లేదు. కొవిడ్ కారణంగా ప్రజలంతా వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉండాలని సీఎం జగన్ పిలుపిచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనపై ప్రతిపక్షం, ప్రజలు భగ్గుమంటున్నారు. ఇటీవలే జరిగిన వైఎస్సార్ జయంతి, వర్థంతి వేడుకలకు లేని కరోనా ఆంక్షలు గణపతి పండుగకే ఎందుకంటూ అంతా విరుచుకుపడుతున్నారు. యేసుకు లేని ఆంక్షలు గణేషుడికి ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా హిందుత్వంపై జగన్ సర్కారు చేస్తున్న కుట్రలంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరిస్తూ ఈసారి ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వినాయక మండపాలు ఏర్పాటు చేయాలని విపక్షాలు, హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో, ఏపీలో గణేష్ నవరాత్రుల నిర్వహణపై ఉత్కంఠ పెరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో విషయం ఏపీ హైకోర్టుకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో గణేశ్ ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రైవేటు స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఒకేసారి ఐదుగురికి మించకుండా, కొవిడ్ నిబంధనలు తప్పనిసరి పాటిస్తూ పూజలు నిర్వహించుకోవాలని ధర్మాసనం సూచించింది.
ఇక, పబ్లిక్ స్థలాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడంపై మాత్రం హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రైవేటు స్థలాల్లో ఓకే కానీ, పబ్లిక్ ప్లేసెస్‌లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వద్దని స్పష్టం చేసింది. ఆర్టికల్ 26తో ప్రజలకు మత కార్యక్రమాలు నిర్వహణకు అధికారం ఉందని తెలిపింది. దీంతో హైకోర్టు తీర్పును ఎవరికి తగ్గట్టు వారు అన్వయించుకుంటున్నారు.