గ్లామర్ కోసం టీఆర్ఎస్ లీడర్లు డ్రగ్స్ వాడుతున్నారా?
posted on Sep 8, 2021 @ 9:25PM
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు ప్రస్తుతం కలకలం రేపుతోంది. 2017లో వెలుగులోనికి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతోంది. రోజుకు ఒకరిని ప్రశ్నిస్తోంది. పూరి జగన్నాథ్, చార్మి, నందు, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాను ప్రశ్నించింది. రవితేజను కూడా ప్రశ్నించబోతోంది. ఈడీ విచారణలో టాలీవుడ్ డ్రగ్స్ లింకులన్ని బయటపడతాయనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో కొందరు రాజకీయ నేతలకు డ్రగ్స్ కేసుతో లింకులున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు వారి గ్లామర్ కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. డ్రగ్స్ ఎవరెవరు వాడుతున్నారో తనకు తెలుసు కాని పేరు ఇప్పుడు చెప్పనన్నారు సంజయ్. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్లడ్ టెస్టులు చేయించి వాళ్ల బండారం బయటపెడుతానని బండి స్పష్టం చేశారు, తన భాషను అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారని... భాష విషయంలో కేసీఆరే తన గురువని అన్నారు. బీజేపీతో తప్ప అన్ని పార్టీలతో కలిసి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కెప్టెన్ అయితే, ఒవైసీ వైస్ కెప్టెన్ అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్స్ ట్రా ప్లేయర్లు అని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం కేసీఆర్ కు వచ్చిందని... అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టేనని ప్రజలు అనుకుంటున్నారని సంజయ్ అన్నారు