నీళ్లు పోయినంక వచ్చి ఏం చేస్తవ్.. కేటీఆర్ ను నిలదీసిన సిరిసిల్ల మహిళలు..
posted on Sep 8, 2021 @ 7:48PM
తెలంగాణలో ఆది, సోమవారాల్లో కుండపోతగా వర్షం కురిసింది. ఉరిమి ఉరిమినట్లుగా పడిన వర్షానికి ఉత్తర తెలంగాణ అతలాకుతలం అయింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో వరద పోటుతో తల్లడిల్లిపోయాయి. పట్నం, పల్లె తేడా లేకుండా అంతా వరద మయమైంది. వరంగల్ నగరం చిన్నపాటి సముద్రంగా మారిపోయింది. దాదాపు 100 కాలనీలను వరద ముంచెత్తింది. ఇక మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల పూర్తిగా జల దిగ్భందంలో చిక్కుపోయింది. రెండు రోజులైనా ఇంకా కొన్ని కాలనీలు వరదలోనే ఉన్నాయంటే సిరిసిల్లలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ఊహించవచ్చు.
సిరిసిల్ల పట్ణణంలోని మెజార్టీ కాలనీలన్ని వరదలో మునిగిపోయాయి. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ పూర్తిగా నీట మునిగింది. కొన్ని కాలనీల్లో భవంతుల్లోని రెండో ఫ్లోర్ వరకు నీళ్లు చేరాయి. దీంతో జనాలు పై అంతస్తులకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. డ్రైనేజీలో పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ నుంచి డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. సిరిసిల్ల జలమయం కావడంతో స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి కేటీఆర్.. బుధవారం పట్టణంలో పర్యటించారు. ముందుగా కలెక్టరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు గంటన్నర సేపు వరద పరిస్థితిపై చర్చించారు. తర్వాత వరద ప్రభావం ఎక్కువగా ఉన్న పలు కాలనీలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు.
అయితే సిరిసిల్లలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. తమ సమస్యలపై స్థానికులు మంత్రిని నిలదీశారు. శాంతినగర్ లో కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు మహిళలు. నీళ్లంతా వెళ్ళిపోయాక వస్తే ఏం లాభం ఉన్నప్పుడు ఎందుకు రాలేదని పద్మ అనే మహిళ కేటీఆర్ ను కడిగి పారేసింది. వరద ఉన్నప్పుడు వస్తే మా బాధలు తెలిసేవని మరో మహిళ ప్రశ్నించింది. స్థానిక నాయకులు, అధికారులు వారిస్తున్నా మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు బాధిత మహిళలు. నీళ్లలో ఉన్న తమ దగ్గరకు ఎవరూ రాలేదని చెప్పారు. మున్సిపల్ అధికారుల తీరుపైనా కేటీఆర్ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు సిరిసిల్ల శాంతినగర్ మహిళలు.
మహిళల ప్రశ్నలతో షాకైన కేటీఆర్.. వాళ్లను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కష్టం అనుభవిస్తేనే తెలుస్తుందా? చూస్తే తెలియదా అంటూ సముదాయించారు. గంటన్నరసేపు అధికారులతో మీటింగ్ పెట్టాను.. మళ్లీ ఈ సమస్య రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడూ లేనంతగా వానలు పడటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు కేటీఆర్. మున్సిపాలిటీ అధికారులు సరిగా పనిచేయడం లేదని, పన్నులు మాత్రం వసూలు చేస్తున్నారని కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. సమస్య శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి హైదరాబాద్ వెళ్లిపోయారు కేటీఆర్.