సోమరులను చేయకండి.. ముఖ్యమంత్రికి వాలంటీర్ వాత
ముఖ్యమంత్రి గారు దయచేసి, పనికిరాని, ప్రయోజనం లేని పథకాలు తీసుకొచ్చి,ప్రజలను సోమరిపోతులను చేయకండి, అది మంచిది కాదు.. ఇది ఏ ప్రతిపక్ష నాయకుడో చేసిన విజ్ఞప్తో, విమర్శో కాదు. ముఖ్యమంత్రి మానస పుత్రిక, గ్రామ వాలంటీర్ వ్యవస్థలో పనిచేసిన అనుభవంతో, ఒక గ్రామ వాలంటీర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేసిన విజ్ఞప్తి. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్ పేట మండలం రావిచెంద్రి గ్రామ సచివాలయానికి చెందిన గ్రామ వాలంటీరు చిట్టివలస కృష్ణ ఆవేదన తమ వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పెట్టిన లేఖ వైరల్ అయింది.
నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల విజయాలు లక్యంె గా. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భగంగా అమలు చేస్తున్న నవరత్నాలు సహా వివిధ సంక్షేమ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారం కావడం మాత్రమే కాకుండా, ప్రజలలో సోమరితనాన్ని పెంచుతున్నాయని ఎప్పటినుంచో ఇటు ప్రతిపక్ష పార్టీలు అటు రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే,ఒంటెద్దు పోకడలకు అలవాటుపడిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోలేదు. అప్పులు చేసి మరీ ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు బదిలీ చేస్తూ వస్తోంది. దానితో, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పాట్లు తప్పి, రాష్ట్రం అప్పుల ఊబిలో కురుకు పోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజల నెత్తిన ఉన్న తలసరి అప్పు లక్ష రూపాయలను దాటి పోయింది. అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని, త్వరలోనే రాష్ట్ర దివాలా తీయడం ఖాయమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
అలాగని సంక్షేమ పథకాలు వద్దని కాదు, ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత, అందులో మరో అభిప్రాయం లేదు. అయితే, ఎట్లో పారేసినా ఎంచి పారేయాలని, అంటారు. గీత దాటి, సంక్షేమమే సర్వస్వం అన్నట్లుగా పేదప్రజలు శాశ్వతంగా చేయిచాపే విధంగా చేయడం మాత్రం సమర్ధనీయం కాదు. సంక్షేమ ఫలాలు అందుకునే వారు,ఎంతోకొంత కాలానికి తమ కాళ్ళ మీద తాము నిలబడేలా పథకాలు ఉండాలే కానీ, ఎప్పటికీ పేదలు పేదలుగానే ఉండేలా, ఉంచేలా పథకాలు ఉండకూడదు. నిజానికి, సంక్షేమ పథకాల లక్ష్యం కూడా అదే. అందుకే రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ల విషయంలో కూడా పదేళ్ళ కాలపరిమితిని విధించారు. అయినా ఇప్పటికీ, రిజర్వేషన్లు, రిజర్వేషన్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల లక్ష్యం, నిర్వచనం పూర్తిగా మార్చివేసింది. సంక్షేమ పథకాల అసలు లక్ష్యం పేదరిక నిర్మూలన,కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం పేదరికాన్ని పెంచి, ఓటు బ్యాంక్’ను సుస్థిరం చేసుకునేందుకు, సక్షేమ పథకాలను ఉపయోగించుకుంటున్నారు. ఆలోచన రహితంగా అమలు చేస్తున్న సంక్షేమా పథకాల వలన,అర్హులైనా పేదల కంటే, అర్హతలు లేని అస్మదీయులు, అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు.ఇదే విషయాన్ని, వాలేంటీర్ కృష్ణ తమ లేఖలో పేర్కొన్నారు.పదెకరాల భూములు ఉన్నవారికి పింఛను అందుతోంది,కానీ నిరుపేదలు కొందరు పింఛనుకు దూరమయ్యారు. అలాగే, ఆయన తమ లేఖలో, సమస్యల మీద దృష్టిసారించి, యువతకు మంచి ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలి. నిత్యావసర సరకుల ధరలు తగ్గించాలని చక్కని సూచన కూడా చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక పుత్రిక గ్రామ వలెంటీర్ వ్యవస్థ అవినీతి మయం అయిందని సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారు. సో .. ముఖ్యమంత్రి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసి వాలంటీర్ వ్యవస్థ మీద పునరాలోచాన చేయవలసిన అవసరం ఉందని అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.