సెప్టెంబర్ 17.. తెలంగాణ గడ్డపై రాహుల్ వర్సెస్ అమిత్‌షా..
posted on Sep 8, 2021 @ 12:15PM
తెలంగాణ రాజకీయం కాక మీదుంది. బెంగాల్ తర్వాత మనదగ్గరే పొలిటికల్ హీట్ తారాస్థాయిలో ఉంది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. ట్రయాంగిల్ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఎవరూ తగ్గట్లే. ఎవరూ ఆగట్లే. పోటాపోటీ వ్యూహాలు. ఎత్తుకు పైఎత్తు రాజకీయాలు. అధికార పార్టీ దళితబంధుతో దూకుడు పెంచింది. దళిత, గిరిజన దండోరాలతో కాంగ్రెస్ జోరు పెరిగిందది. బండి పాదయాత్రతో బీజేపీ బాహుబలిలా మారుతానంటోంది. మూడు పార్టీలు సమరోత్సాహంతో తెలంగాణ రాజకీయం సలసల కాగుతోంది.
తాజాగా, తెలంగాణ పొలిటికల్ హీట్ జాతీయ స్థాయికి చేరింది. ప్రగతిభవన్‌పై దండెత్తడానికి.. కాంగ్రెస్, బీజేపీ అధినేతలు సైతం కదనరంగంలోకి దూకుతున్నారు. రాహుల్‌గాంధీ, అమిత్‌షాలు ఒకే రోజు తెలంగాణ గడ్డపై తమ బలం, బలగం చాటేందుకు కదలివస్తుండటం కాక రేపుతోంది. అందులోనూ తెలంగాణ చరిత్రలో కీలకమైన సెప్టెంబర్ 17న కాంగ్రెస్-రాహుల్, బీజేపీ-అమిత్‌షాలు.. బహిరంగ సభలకు సమాయత్తమవుతుండటం ఆసక్తికరంగా మారింది.
దళితబంధుకు కౌంటర్‌గా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దళిత-గిరిజన దండోరా సభలను నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు సభలు భారీగా సక్సెస్ అయ్యాయి. ఇక, ఆఖరి దండోరా సభ వరంగల్‌లో ఈ నెల 17న నిర్వహించనుంది. ఆ బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ రానున్నారు. రేవంత్‌రెడ్డి కోరిక మేరకు రాహుల్‌గాంధీ.. వరంగల్ సభకు వచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏదైనా షెడ్యూల్ మారితే తప్ప తెలంగాణకు రాహుల్ రాక కన్ఫామ్.
సరిగ్గా అదే రోజు.. సెప్టెంబర్ 17న.. తెలంగాణ విమోచన దినాన్ని ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు కమలనాథులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్‌లో భారీ బహిరంగ సభ తలపెట్టారు. ఆ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రానున్నారు. గతంలో రేవంత్‌రెడ్డి మొదటి దళిత-గిరిజన దండోరా సభ పెట్టిన ఉమ్మడి ఆదిలాబాద్ ఇలాఖాలోనే బీజేపీ మీటింగ్ పెడుతుండటం వ్యూహాత్మకం అంటున్నారు. కాంగ్రెస్ కంటే తమ బలమే ఎక్కువని నిరూపించేందుకు.. భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సభకు అమిత్‌షాను రప్పించడం ద్వారా ప్రజల అటెన్షన్‌ను తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.
ఇలా సెప్టెంబర్ 17న.. ఒకే రోజు.. ఇటు రాహుల్, అటు అమిత్‌షాల రాకతో తెలంగాణలో రాజకీయ వేడి అమాంతం పెరిగిపోయింది. కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా దూకుడు ప్రదర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ యమ జోరు మీదుండగా.. బండి సంజయ్ పాదయాత్రతో కమలనాథులు కదనోత్సాహంతో ఉన్నారు. ఇక రాహుల్, అమిత్‌షాల ఎంట్రీతో.. ప్రతిపక్షాల్లో ఫుల్ జోష్ పెరగడం ఖాయం. ఆ రెండు పార్టీలు.. వేరు వేరుగా.. కేసీఆర్‌పై కలబడితే..? ఆ కొట్లాటలో గెలిచేదెవరు? నిలిచేదెవరు?