విశాఖ సీపీ పోస్టు కోసం సీఎంవో అధికారి లాబీయింగ్..

విశాఖపట్నం... ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పట్టణం. జగన్ రెడ్డి సర్కార్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన పట్టణం. ఏపీలో ప్రస్తుతం విశాఖ కార్పొరేషన్ కమిషనర్, సీపీ పోస్టులే కీలకం. పోలీస్ శాఖలో డీజీపీ తర్వాత విశాఖ కమిషనర్ పోస్టే మోస్ట్ పవర్ ఫుల్. అందుకే పోలీసు అధికారులు విశాఖ సీపీ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు.  విశాఖ పోలీస్ కమిషనర్ గా ప్రస్తుతం మనీష్ కుమార్ సిన్హా ఉన్నారు. 2020, ఆగస్టు 11న ఆయన విశాఖ సీపీగా బాధ్యతలు చేపట్టారు.  అయితే మనీష్ కుమార్ సిన్హాను తెలంగాణ కేడర్ కు అలాట్ చేసింది కేంద్రం. డీవోపీటీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం ఆయన్ను రిలీవ్ చేసింది. దీంతో విశాఖ సీపీ పోస్టు  కోసం పలువురు ఐపీఎస్ లు పోటీ పడుతున్నారు.  సీఎంవోలో కీలకంగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. తన సతీమణి కోసం లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.  ప్రవీణ్ ప్రకాశ్ భార్య ఏపీ కేడర్ కు చెందిన ఐపీఎస్ అయినప్పటికీ.. ఆమె ప్రస్తుతం కేంద్ర సర్వీసులో డిప్యూటేషన్ పై పని చేస్తున్నారు. ఏపీలో హాట్ సీటుగా మారిన విశాఖ సీపీ పోస్టు కోసం ప్రవీణ్ ప్రకాష్ చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది. సీఎంవోలో ప్రస్తుతం ప్రవీణ్ ప్రకాష్ దే హవా సాగుతుందన్న ప్రచారం ఎప్పటినుంచో  ఉంది. సీఎం జగన్ కు ప్రవీణ్ ప్రకాష్ ఎంత చెబితే అంత అన్న చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. దీంతో తన భార్యను విశాఖ సీపీగా నియమించేందుకు సీఎం దగ్గర ప్రవీణ్ ప్రకాష్ ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. జగన్ రెడ్డి కూడా ఓకే అనడంతో కేంద్ర సర్వీసుల నుంచి ఆమె రిలీవ్ అయ్యేలా చర్యలు ప్రారంభించారని చెబుతున్నారు. విశాఖను కేపిటల్ గా ప్రకటించిన జగన్ ప్రభుత్వం.. ఏదో ఒక సమయంలో రాజధానిని షిప్ట్ చేయాలని భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీపీగా తమకు నమ్మిన బంటుగా ఉంటే అదికారి ఉండాలనే ఆలోచనలో ఉందంటున్నారు. ఇందులో భాగంగానే సీఎంవోలో చక్రం తిప్పుతారని, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రవీణ్ ప్రకాశ్ సతీమణి అయితే బెటరన్న యోచనలో వైసీపీ నేతలు ఉన్నారని అంటున్నారు. దీంతో విశాఖ సీపీగా ఆమె నియామకం త్వరలో ఖరారు కావడం ఖాయమని అంటున్నారు. 

టీటీడీ ప్ర‌తిష్టను దిగ‌జారుస్తున్నారా? పొర‌పాటా? పొలిటిక‌ల్ స్టంటా?

టీటీడీ బోర్డు మునుపెన్న‌డూ లేనంత విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. వ్యాపారులు, ప్ర‌ముఖుల‌తో బోర్డును ఓవ‌ర్‌లోడ్ చేసేసి.. రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఏకంగా 50 మందికిపైగా ప్ర‌త్యేక ఆహ్వానితుల‌ను నియ‌మించారంటే మాట‌లా? అందుకే, హైకోర్టు సైతం ఆ జీవోను స‌స్పెండ్ చేసింది. జంబో బోర్డుతో వైసీపీ ప్ర‌భుత్వ ప‌రువంతా పోతోంది. అయితే, ఇలా వ‌రుస వివాదాలు అనుకోకుండా వ‌స్తున్నాయా? కావాల‌నే వివాదాలు వ‌చ్చేలా చేస్తున్నారా? అనే అనుమాన‌మూ లేక‌పోలేదు. టీటీడీ ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బార్చ‌డానికే ఇలా చేస్తున్నార‌నే అనుమానాలూ ఉన్నాయి. ఇక‌, ఎంపీ రఘురామలాంటి వారు ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు చేస్తున్నారు.   ‘‘టీటీడీ పాలక మండలిలో నేరచరిత్ర ఉన్నవారిని, వ్యాపారులను.. థార్మిక సంస్థలు, ప్రచారంపై ఎలాంటి అవగాహన లేని వారిని మీ స్వార్ధ ప్రయోజనాల కోసం నియమించుకుంటారా? గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ నియమ, నిబంధనలకు తూట్లు పొడుస్తారా? సభ్యులను ఎంపిక చేసే ముందు వారి చరిత్ర ఏంటో తెలుసుకోవలసిన బాధ్యత లేదా?’’ అంటూ ఏపీ ప్రభుత్వాన్ని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కుమ్మేశారు.  ‘‘కాషాయ వస్త్రాలు ధరించేవారు, బొట్టు పెట్టుకునే వారు అనర్హులా? మీకు వ్యాపారులు, నేరస్థులే కనిపిస్తారా? టీటీడీ చట్టంలో లేని పోస్టులను సృష్టిస్తున్నారు. అధికారపార్టీ నేతలకు పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చేందుకు ప్రయత్నించవద్దు. ఈ బోర్డుకైనా పీఠాధిపతులు, మఠాధిపతులను నియమించి హిందూ థార్మిక ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది’’ అని రఘురామ అన్నారు. ఎంపీ ర‌ఘురామ వ్యాఖ్య‌లు మ‌రింత కాక రేపుతున్నాయి. టీటీడీని రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మారుస్తున్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. పైగా.. భ‌క్తుల ఎంట్రీని క‌ట్ట‌డి చేయ‌డం.. వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్‌, కొవిడ్ టెస్టులు కంప‌ల్స‌రీ అంటూ.. సెకండ్ వేవ్ ముగిశాక నిబంధ‌న‌లు పెట్ట‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌తో పాటు అనుమానాల‌నూ రేకెత్తిస్తోంది. టీటీడీ ముసుగులో కొంద‌రు కావాల‌నే అప్ర‌దిష్ట‌పాలు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారా? కుట్ర‌తోనే టీటీడీ బోర్డు ప్ర‌తిష్ట‌ను దిగ‌జారుస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.   

మళ్ళీ కేసీఆర్ ఆకర్ష్ అస్త్రం? ఈసారి కారెక్కేది ఎవరంటే..? 

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మరో మారు ఆకర్షణ అస్త్రాన్ని సంధించేందుకు సిద్దమయ్యారా? ఈ సారి ఆయన పెద్ద చేపకే గాలం వేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక క్రతువు మొదలైన తర్వాత ముఖ్యమంత్రి ఇప్పటికే ఇతర పార్టీలలో ఉన్న మోత్కుపల్లి నరసింహులు వంటి మోతుబరి దళిత నాయకులను తమ వైపుకు తిప్పుకున్నారు. అదే క్రమమలో ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్కను కారేక్కించేందుకు అస్త్రాలను సిద్దం చేసుకున్నారని అంటున్నారు. భట్టిని పార్టీలోకి రప్పించుకోవడం ద్వారా కాంగ్రెస్ ను దెబ్బతీయడంతో పాటుగా పార్టీలోని దళిత దొరలకు చెక్ పెట్టినల్టు అవుతుందని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం. నిజానికి, భట్టి ఎంట్రీకి లైన్ క్లియర్ అయిందని, ఇక ముహూర్తమే మిగిలిందనే వార్తలు కూడా వినవస్తున్నాయి. అలాగే, భట్టిని బుట్టలో వేసుకునే ప్రయత్నం కూడా హుజూరాబాద్ రాజకీయం కంటే ముందే మొదలైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో, సరదాగానే కావచ్చును కానీ, భట్టికి స్వాగతం పలికిన విషయాన్ని పరిశీలకులు  ఈసందర్భంగా గుర్తు చేస్తున్నారు. భట్టి వైపునుంచి కూడా సానుకూల సంకేతాలే వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యమంతి కేసీఆర్ నిర్వహించిన దళిత బందు సమీక్షా సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరు జారాదని ముందుగా  నిర్ణయించినా, ఆ  తర్వాత భట్టి వత్తిడి కారణంగానే నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. అయితే, దళిత బంధు అమలుకు ఎంపిక చేసిన  నియోజక వర్గాల్లో, భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం కూడా ఉన్నందున ఆయన సమావేశానికి హాజరు కావాలని పట్టుపట్టారని అంటున్నారు. అలాగే, అదే సమయంలో దలిత బందును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే కాంగ్రెస్ డిమాండ్’ను ప్రభుత్వం ముందు ఉంచే ఉద్దేశంతోనూ  కాంగ్రెస్ నిర్ణయం మార్చుకుందని కాంగ్రెస్ నాయకులు సమర్ధించుకునే  ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది, నిజం కాదని,అనంతర పరిణామలు స్పష్తం చేస్తున్నాయి. అప్పటి నుంచే భట్టి విషయంలో అనుమానాలు వినిపిస్తున్నా ఇటీవల అయన స్వరంలో కూడా మార్పు స్పష్టమవుతోందని అంటున్నారు.  కొద్ది రోజుల క్రితం  భట్టి విక్రమార్క తమ నియోజక పరిధిలో దలిత బంధు  సన్నాహక , ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈసందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారా అన్నసందేహం వచ్చే విధంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్గాల నుంచే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  అందుకు తగ్గట్టుగానే కొద్ది రోజుల క్రితం, ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ, సీతంపేట, నాగులవంచ తదితర గ్రామాల్లోని దళిత కాలనీలను సందర్శించిన సమయంలో, భట్టి అర్హులైన ప్రతిఒక్కరికీ దళితబంధు పథకం వర్తిస్తుందని అన్నారు. అంతే కాదు, దళిత బంధుతో ఎస్సీల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తాయన్నారు. అలాగే, చింతకాని మండలంలోని దళిత కాలనీల్లో నెలకొ న్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించానని, త్వరలో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు తాము కోరుకున్న యూనిట్లు అందుతాయని తెలిపారు. ప్రభుత్వం త్వరలో పలు విభాగాల్లో గ్రామ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తుందని, ప్రభుత్వం తరపున అధికార పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రుల తరహాలో హమీ ఇచ్చారు. ఓ వంక కాంగ్రెస్ పార్టీ , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  దళిత బంధు ఓ బూటకమని, ముఖ్యమంత్రి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తుంటే, సీఎల్పీ నాయకుడు,అందుకు విరుద్ధంగా, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం దేనికి సంకేతమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కేసీఆర్ ఏదో కీలక పదవిని ఆఫర్ చేయడం వల్లనే భట్టి అటు మొగ్గు చుపుతున్నట్లుగా ఉందని అంటున్నారు. అయితే అది ఉప ముఖ్యమంత్రి పదవా మరొకటా అన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. నిజంగా భట్టి విక్రమార్క కూడా చేయి వదిలి కారేక్కితే  తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 13కు  చేరుతుంది. గత ఎన్నికల్లో 19 మంది కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచారు. అందులో, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికై రాజీనామా చేశారు. మిగిలిన 18లో ఇప్పటికే 12 మంది పార్టీఫిరాయించారు. భట్టి కూడా అదే బాట పడితే... గెలిచినా 19కి గాను పంచ పాండవుల్లా ఐదుగురు మాత్రమే కాంగ్రస్ పార్టీలో మిగులుతారు.

ఒకే కి'లేడి'.. ఐదుగురిని హ‌నీట్రాప్‌.. ర‌క్ష‌ణ‌శాఖ సీక్రెట్స్ లీక్‌..

ఆమె మ‌హా ఖ‌త‌ర్నాక్ కిలేడి. హ‌స్కీగా మాట్లాడుతుంది. మాట‌ల‌తో టెంప్ట్ చేస్తుంది. చూపుల‌తో క‌వ్విస్తుంది. ఎదురుగా లేకున్నా.. నేరుగా క‌ల‌వ‌కున్నా.. వీడియో కాల్స్‌, వాట్సాప్ చాట్స్‌తో స‌ర్వం దోచేస్తుంది. శ‌త్రు దేశ‌పు ముష్క‌రులు ప‌న్నిన హ‌నీట్రాప్ ఆయుధం ఆమె. ఇలా ఓ లేడీ.. ఏకంగా ఐదురుగు డీఆర్‌డీవో సిబ్బందిని ఏక కాలంలో ట్రాప్ చేసింది. వారి నుంచి డీఆర్‌డీవో ర‌హ‌స్య స‌మాచారాన్ని చాక‌చ‌క్యంగా కాజేసింది. ఆమె ట్రాప్‌లో ప‌డి సొల్లు కార్చిన సిబ్బంది.. దేశ ర‌హ‌స్యాల‌ను ఆ వ‌గ‌లాడికి చేర‌వేశారు. ఇలా ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌లో డీఆర్‌డీవో రహస్యాల లీకు ఘటనలో అనేక సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయి.  ఓ మహిళ ఫోన్, చాటింగ్‌ ద్వారా ఐదుగురు డీఆర్‌డీవో సిబ్బందికి దగ్గరైంది. ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో పరిచయం చేసుకొని వీడియోకాల్, ఫేస్‌బుక్, వాట్సప్‌లో మాట్లాడింది. వీరిలో కొంతమందిని పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించింది. బ్రిటన్‌లో ఉంటున్నానని ఒకరితో, రాజస్థాన్‌లో అని మరొకరితో చెప్పింది. తాను కూడా రక్షణశాఖలో ప‌ని చేస్తున్నాన‌ని ఒక‌రితో, నర్సుగా చేస్తున్నాన‌ని ఇంకొక‌రితో.. ఇలా ర‌క‌ర‌కాల డ్రామాలు ఆడి.. ఆ ఐదుగురిని హనీట్రాప్ చేసిన‌ట్టు విచార‌ణ‌లో తేలింది.    ఆ ఐదుగురిలో ఒకరికి దుబాయ్‌ నుంచి రూ.35 వేలు పంపినట్లు దర్యాప్తులో తెలిసింది. యూకేకు చెందిన ఫోన్ నెంబర్‌తో ఆ మహిళ మాట్లాడింది. ఆ ఫోన్ నెంబ‌ర్ ఆధారంతో ఆమె వివరాలు తెలుసుకునేందుకు ఎన్‌ఐఏ సాయం కోరారు. యూకేకు చెందిన అధికారులతో మాట్లాడి మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అరెస్టు చేసిన ఐదుగురిని వేర్వేరుగా విచారిస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు సీజ్‌ చేశారు. 18 నెలలుగా ఆమె డీఆర్‌డీవో నుంచి సమాచారం సేకరించినట్టు ద‌ర్యాప్తులో తేలింది.  పోలీస్‌ కస్టడీలో ఉన్న ఆ ఐదుగురు డీఆర్‌డీవో సిబ్బందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్, కటక్‌ క్రైం బ్రాంచ్‌ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఐదుగురికి ఏడు రోజుల కస్టడీ ముగిశాక‌.. వీరిని కోర్టులో హాజరుపరిచి మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని ఏడీజీ తెలిపారు.   

అమెరికాలో మోడీకి గ్రాండ్ వెల్ కం..

భారత ప్రధాని నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అమెరికాలో ఘన స్వాగతం లభించింది. వాషింగ్టన్‌లో ల్యాండన ప్రధాని మోడీని ఇండియన్-అమెరికన్లు ఘనంగా స్వాగతించారు. అమెరికాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఐదు రోజుల పాటు సాగనుంది. ఈనెల 26న అమెరికా నుంచి తిరిగి రానున్నారు నరేంద్ర మోడీ.  గరువారం వాషింగ్టన్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ఆమెతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అమెరికాతో భారత ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు, అఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాలపై చర్చించనున్నారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు బయలు దేరే ముందు చెప్పారు.  

జ‌గ‌న్‌కు పాల‌న‌పై ప‌ట్టు లేదా? వ‌రుస స్కాంలతో ప‌రువంతా పోతోందా?

పిల్లి గుడ్డిదైతే ఎలుక తోక చూపించిందంటారు. పాల‌కుడు అస‌మ‌ర్థుడైతే అధికారులు దోచుకుతింటారు. అలానే, ముఖ్య‌మంత్రికి పాల‌న‌లో ప‌ట్టు లేక‌పోతే.. కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఏపీలో అలానే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. సీఎం జ‌గ‌న్‌కు ప‌రిపాల‌న‌పై క‌మాండ్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌.. రాష్ట్రంలో వ‌రుస కుంభ‌కోణాలు వెలుగు చూస్తున్నాయ‌ని చెబుతున్నారు. నిన్న‌గాక మొన్న రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో న‌కిలీ ఛ‌లాన్ల పేరిట కోట్ల రూపాయ‌ల దందా ఏపీకి షేక్ చేసింది. తాజాగా ఏపీ స‌చివాల‌యం కేంద్రంగా మ‌రో భారీ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది. సీఎం చేత‌గాని త‌న‌మే వ‌రుస స్కాంల‌కు కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచే నిధులు కొట్టేశారంటే ఇంకేమ‌నాలి? పథ‌కం పేరులోనే ముఖ్య‌మంత్రి ఉన్నా.. ఏమాత్రం భ‌యం, బెదురు లేకుండా నిధులు దారి మ‌ళ్లించారంటే సీఎం జ‌గ‌న్ అంటే ఏమాత్రం లెక్క‌లేద‌ని తేలిపోలా. సీఎం రిలీఫ్ ఫండ్‌ నిధుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతల నుంచి పెద్ద సంఖ్యలో సిఫారసులు వస్తుంటాయి. వాటిని కూడా పరిశీలించిన తర్వాత సీఎంఓ నిధులను మంజూరు చేస్తుంటుంది. ఈ మొత్తం వ్యవహారం అంతా సీఎంఓ పరిధిలోని అధికారులే పర్యవేక్షిస్తుంటారు. ఇందులో ఆర్థిక శాఖ ప్రమేయం కూడా పెద్దగా ఉండదు. ఇలా నేరుగా సీఎంఓ పర్యవేక్షణలో కొనసాగే ఆసరాలోనే అవకతవకలు జరగ‌డం.. ఎవ‌రి వైఫ‌ల్యం అనుకోవాలి? సీఎం జ‌గ‌న్‌కు పాల‌న‌లో ప‌ట్టులేక‌పోవ‌డం కాక ఇంకేం అనుకోవాలి? అంటున్నారు.  నేరుగా సీఎంఓ పర్యవేక్షణలోనే కొనసాగే సీఎంఆర్ఎఫ్ నిధులను భారీ ఎత్తున పక్కదారి పట్టించారు. ఈ స్కాంలో సచివాలయంలోని అధికారులు, ప్రజా ప్రతినిధుల పీఏలు, నేత‌ల అనుచరుల హ‌స్తం ఉంద‌నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే, అధికారులు, వైసీపీ బ్యాచ్‌.. కుమ్మ‌క్కై ఆస‌ద‌లో ఉన్న‌వాళ్ల‌కు ఆస‌రా ఇవ్వాల్సిన‌ కోట్ల‌కు కోట్లు సొమ్మును కొల్ల‌గొట్టేశారు కేటుగాళ్లు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.   అయితే సీఎం కార్యాలయం ఆధ్వర్యంలోని సీఎంఆర్ఎఫ్ నిధుల్లో గోల్ మాల్ జ‌రిగిన విష‌యాన్ని బయటకు చెప్పకుండా ఏసీబీ అధికారులు సీక్రెట్‌గా విచారణ సాగిస్తున్నారని స‌మాచారం. మరి ఇన్నేళ్లుగా ఇంత భారీ కుంభకోణం జ‌రుగుతుంటే? అన్ని కోట్లు దారి మ‌ళ్లాయంటే? ఇది ఎవ‌రి వైఫ‌ల్యం? ఇంకెవ‌రి చేత‌గాని త‌నం? మొన్న రిజిస్ట్రేష‌న్ల శాఖ‌లో న‌కిలీ ఛాల‌న్లు.. తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు.. ఇలా పందికొక్కులు కోట్ల‌కు కోట్లు మెక్కుతుంటే.. నెల‌ల త‌ర‌బ‌డి గుర్తించ‌లేని ఈ ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని, పాల‌కుల‌ను ఏమ‌నాలి? ఏం చేయాలి?

ఆర్టీసీని అమ్మేందుకు ముహుర్తం ఫిక్స్? కేసీఆర్ భారీ స్కెచ్?

ఆర్టీసీ ఎండీగా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ స‌జ్జ‌నార్‌ను నియ‌మించారు సీఎం కేసీఆర్‌. అబ్బా.. సూప‌ర్ సెలెక్ష‌న్‌. ఆర్టీసీ ఇక గాడిన ప‌డిన‌ట్టే అంటూ టాక్ వ‌చ్చింది. ఆర్టీసీ బాగు కోస‌మే కేసీఆర్ స‌జ్జ‌నార్‌ను సెలెక్ట్ చేసుకున్నార‌ని అనుకున్నారంతా. ఆ త‌ర్వాత ఆర్టీసీ ఛైర్మ‌న్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్‌రెడ్డిని నియ‌మించారు. ఇక ఆర్టీసీని పూర్తి స్థాయిలో కేసీఆర్‌ సెట్ చేస్తున్నార‌ని భావించారు. క‌ట్ చేస్తే.. కొద్ది రోజుల‌కే సీఎం కేసీఆర్ నోటి నుంచి సంచ‌ల‌న కామెంట్లు వ‌చ్చాయి. బెదిరించ‌డానికో, భ‌య‌పెట్ట‌డానికో లేక నిజమో కానీ.. ఆర్టీసీని అమ్మేస్తాం.. ప్రైవేటుప‌రం చేస్తామంటూ.. ముఖ్య‌మంత్రి మాట్లాడ‌టం అనుమానాస్ప‌దంగా మారుతోంది. నిజ‌మేనా? ఆర్టీసీని ప్రైవేటుప‌రం చేసేస్తారా? అంటూ చ‌ర్చ‌, ర‌చ్చ జ‌రుగుతోంది.  నాలుగు నెల‌ల్లో ఆర్టీసీ గాడిన ప‌డ‌కుంటే ప్రైవేటుప‌రం చేస్తామ‌ని సీఎం కేసీఆర్ హెచ్చ‌రించారు. ఆర్టీసీ స‌మీక్ష‌లో.. ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్‌, ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌. ఎండీ స‌జ్జ‌నార్‌ల‌కు ఈ మేర‌కు కేసీఆర్ సుస్ప‌ష్టంగా చెప్పారు. ఈ విష‌యం మ‌రెవ‌రో చెప్ప‌డం కాదు.. స్వ‌యంగా ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డినే వెల్ల‌డించారు. ఆర్టీసీని ర‌క్షించడానికి ప్ర‌భుత్వం అనేక‌సార్లు ఆదుకుంద‌ని, ఈ ఏడాది సైతం 3వేల కోట్లు కోటాయించినా ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రావ‌డం లేద‌ని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారని తెలుస్తోంది. అదేంటి.. ఇటీవ‌లే క‌దా ఆర్టీసీ కార్గో లాభాల్లో న‌డుస్తోంద‌ని వేడుక‌లు చేసుకున్నారు. అంత‌లోనే న‌ష్టాలు, క‌ష్టాలు ఏంట‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆర్టీసీ విష‌యంలో కేసీఆర్ బాగా సీరియ‌స్‌గా ఉన్నారు. వేల మంది కార్మికులు నెల‌ల త‌ర‌బ‌డి ఉద్య‌మం చేసినా.. క‌ర‌గ‌కుండా, త‌గ్గ‌కుండా.. బెట్టు చేసి.. కార్మికుల‌ను త‌న దారికి తీసుకొచ్చారు. తానేదో అద్భుతం చేసి చూపిస్తాన‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లికి.. ఆర్టీసీని స‌వాల్‌గా తీసుకున్నారు. ఆర్టీసీ త‌ర‌ఫున కార్గో బిజినెస్ స్టార్ట్ చేసి.. సంచ‌ల‌నం సృష్టించారు. నిజంగా ఆర్టీసీ కార్గో ఫుల్ స‌క్సెస్‌. ప్ర‌స్తుతం ఆర్టీసీకి వ‌స్తున్న రాబ‌డి అంతా కార్గో నుంచే. అయితే, కార్గో ఒక్క‌టి న‌డిస్తే చాలా? ప్ర‌యాణీకుల ర‌వాణా తీవ్ర న‌ష్టాల్లో ఉంది. క‌రోనా కాటు ఆర్టీసీకి గుదిబండ‌గా మారింది. అందుకే, ఆర్టీసీని గాడిని పెట్టేందుకు చివ‌రి ప్ర‌య‌త్నంగా స‌జ్జ‌నార్‌ను ఎండీగా తీసుకొచ్చారు కేసీఆర్. ఛైర్మ‌న్ ప‌ద‌వినీ భ‌ర్తీ చేసి.. చిత్త‌శుద్ధి చాటుకున్నారు. అయితే, వారిద్ద‌రికీ డెడ్‌లైన్ పెట్టారు ముఖ్య‌మంత్రి. నాలుగంటే నాలుగే నెల‌లు.. ఈ లోగా ఆర్టీసీ లాభాల బాట ప‌డితే ఓకే.. లేదంటే.. అమ్ముడే... అంటున్నారు కేసీఆర్‌.  వ‌చ్చిరాగానే ఎండీ స‌జ్జ‌నార్ టికెట్ల రేట్లు పెంచే ఫైల్ రెడీ చేశారు. త్వ‌ర‌లోనే బ‌స్ టికెట్ ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం. ప్రయాణికుల‌కు ధ‌రాఘాతం త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఎంత పెంచినా, ఎంత చేసినా.. ఆర్టీసీ లాభాల బాట ప‌ట్ట‌డం అంత ఈజీ కాక‌పోవ‌చ్చు. ఆ విష‌యం కేసీఆర్‌కు కూడా తెలుసు. అయినా, జ‌స్ట్ నాలుగంటే నాలుగు నెల‌లు మాత్ర‌మే టైమ్ ఇచ్చి.. ఆ త‌ర్వాత ఆర్టీసీ ఇక బాగు ప‌డ‌ద‌నే ముద్ర వేసేసి.. అడ్డంగా అమ్ముకోవ‌డం ఖాయ‌మంటూ మండిప‌డుతున్నాయి ప్ర‌తిప‌క్షాలు. ఆర్టీసీకి జిల్లాలు, మండ‌లాల వారీగా విలువైన ప్ర‌దేశాల్లో, అత్యంత ఖ‌రీదైన భూములు ఉన్నాయి. గ‌తంలోనే ఆ స్థ‌లాల‌ను కొట్టేసే కుట్ర జ‌రగ్గా.. విప‌క్షాలు గ‌ట్టిగా పోరాడ‌టంతో అది కుద‌ర‌లేదు. ఆర్టీసీ స్థ‌లాలు లీజుకివ్వ‌డం, షాపింగ్ కాంప్లెక్స్‌లు క‌ట్ట‌డం ఇలా.. ర‌క‌ర‌కాల పేర్ల‌తో ఆ భూములు కాజేసే ప్ర‌య‌త్నం చేశారంటారు. అప్పుడు విఫ‌ల‌మైనా.. ఇప్పుడు ఎలాగైనా ఆర్టీసీని ప్రైవేటుప‌రం చేసే ఎత్తుగ‌డ‌లో భాగంగానే.. ముందుగా స‌మ‌ర్థులైన అధికారిని రంగంలోకి దింపి.. అయినా ఉప‌యోగం లేద‌ని తేల్చేసి.. ఆ త‌ర్వాత త‌మ‌కు న‌చ్చిన‌ట్టు చేసే మాస్ట‌ర్‌ప్లానే ఇదంతా అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి, నిజ‌మేంటో కాల‌మే నిర్ణ‌యిస్తుంది.

చీర కట్టుకుందని నో ఎంట్రీ.. ఢిల్లీ రెస్టారెంట్ పై నెటిజన్ల ఫైర్ 

భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. మన అచారాలు, సంప్రాదాయాలను చూసే ప్రపంచ దేశాలన్ని మన దేశాన్ని గౌరవిస్తాయి. మన సంప్రదాయానికి ప్రతీక చీర. మహిళలు చీర కట్టులో మరింతగా మెరిసిపోతారు. శారీ ధరించిన మన మహిళలకు విదేశాల్లో సైతం మంచి గౌరవం లభిస్తుంది. అమెరికా దేశస్తులు సైతం మన చీర కట్టును చూసి ముగ్దులవుతారు. అలాంటిది దేశ రాజధానిలో మాత్రం చీర కట్టుకున్నందుకు ఓ మహిళను రెస్టారెంట్ లోకి అనుమతించలేదు. రెస్టారెంట్ లోకి అనుమతించబడని ఆ మహిళ సాధారణ వ్యక్తి కూడా కాదు.. ఆమె జర్నలిస్ట్. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది.  ఖేల్ గావ్‌లో ఉన్న ఆక్విలా అనే రెస్టారెంట్ వద్ద ఈ ఘటన జరిగింది.  ఢిల్లీ రెస్టారెంట్ నిర్వాహకులపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు.వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన  జర్నలిస్ట్ అనితా ఛౌదరి తన కుమార్తె పుట్టినరోజును ఘనంగా జరపాలని భావించింది. ఇంటికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసింది. ఏర్పాట్లన్నీ చేసుకుని రెస్టారెంట్‌కు వెళ్లింది. తీరా అక్కడకు వెళ్లాక కుమార్తెను లోపలకు అనుమతించిన సిబ్బంది ఆమెను మాత్రం ఆపేశారు. అదేంటని ప్రశ్నిస్తే ఆమె చీర కట్టుకొని ఉందని, రెస్టారెంట్లోకి కేవలం స్మార్ట్ క్యాజువల్స్ వేసుకున్న వారికే అనుమతి ఉందని చెప్పారు.  తన చీర కూడా క్యాజువల్ డ్రస్సే కదా అని జర్నలిస్ట్ వాదించినా రెస్టారెంట్ సిబ్బంది అంగీకరించలేదు. రెస్టారెంట్ మేనేజర్ కూడా  తన సిబ్బందినే సమర్థించాడు. ఆమెను లోపలకు అనుమతించడానికి ససేమిరా అన్నారు. దీంతో బుక్ చేసిన టేబుల్ వదిలేసుకొని ఇంటికి తిరిగెళ్లిపోవాల్సి వచ్చింది అనిత. ఈ మొత్తం వివాదాన్ని వీడియో తీసిన ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. చీర స్మార్ట్ క్యాజువల్ కాదని తనను రెస్టారెంట్లోకి అనుమతించలేదని, దీని వల్ల తన కుమార్తె పుట్టినరోజు ప్రోగ్రాం చెడిపోయిందని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు తను వచ్చిన విధానాన్ని చెప్పేందుకు ఒక సెల్ఫీ కూడా షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆక్విలా రెస్టారెంటుపై మండిపడుతున్నారు. ఒకరైతే ఈ రెస్టారెంట్‌కు ప్రతిచోటా చెత్త రేటింగే ఉందని చెప్పారు. గూగుల్‌లో 1.1/5 రేటింగ్ ఉండగా, జొమాటోలో 2/5 రేటింగ్ ఉందని చెప్పిన సదరు యూజర్.. ఈ రెస్టారెంట్ ఇలా తప్పు చేయడం ఇదేమీ మొదటిసారి కాదని వెల్లడించారు. పాత రివ్యూలు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని తెలిపారు. అనిత షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 

శ్రీవారి భక్తులకు టీటీడీ షాక్.. 

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారా? త్వరలో వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. ఇకపై శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే కొన్ని షరతులు విధించింది టీటీడీ. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. కొండకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేశారు ఇక పై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తారు.  మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు తీసుకుంటున్నప్పటి నుంచి దర్శనం టోకెన్లను క్రమంగా పెంచుతున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు నియంత్రణలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. రెండు వారాల చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీ చేయగా.. ఇటీవలే ఇతర ప్రాంతాల వారిని కూడా ఉచిత దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు.  సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున ఎస్డీ టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈనెల 26 నుంచి తిరుపతిలో ఆఫ్లైన్లో జారీ చేసే ఎస్డీ టోకెన్లను నిలిపివేయబోతున్నారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుంపులుగా నిలబడటం వల్ల కరోనా వేగంగా సంక్రమించే ప్రమాదం ఉందని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అక్టోబరు మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో  విడుదల చేస్తామని చెప్పారు.

నెల్లూరు జిల్లాలో ఆనం ఒంటరేనా? కేబినెట్ బెర్త్ మళ్ళీ అందని ద్రాక్షేనా? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు మొదలు పెట్టారు. అధికారంలోకి వచ్చి  రెండున్నర సంవత్సరాలు దగ్గరవుతున్న నేపధ్యంలో, ముందుగా అనుకున్న విధంగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ గడువు సమీపిస్తోంది. ముఖ్యమంత్రి తోలి మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే , రెండున్నర ఎల్లా తర్వాత ఉద్వాసన ఉంటుందని, అప్పాయింట్ ఆర్డర్స్ తో పాటుగానే ఊస్టింగ్  ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. సో.. ఆ గడవు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి  కసరత్తు ప్రారంభించారని  పార్టీలో చర్చ జరుగుతోంది.  కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లేందుకు  సిద్దంగా ఉండమని మంత్రులకు హింట్ ఇచ్చారని వార్తలొచ్చాయి. మరో వంక ఫస్ట్ కాబినెట్ లో బెర్త్ మిస్సయిన సీనియర్ నాయకులు ఈ సారైనా ఛాన్స్ దక్కుతుందా లేదా అని ఆశగా ఎదురుస్తున్నారు. అలాంటి వారిలో కొదరు తమ వంతు ప్రయత్నాలు  ప్రారంభించారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది.  ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడు ఆనం రామ నారాయణ రెడ్డి, అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. జగన్ రెడ్డి ఫస్ట్ కాబినెట్’లోనే మంత్రి పదవి వస్తుందని ఆనం ఆశించారని అంటారు. నిజానికి అయన రెండు సార్లు పార్టీ మారింది, మంత్రి పదవి కోసమే అని అయన సన్నిహితులు అంటారు. మంత్రి పదవిని ఆశించే అనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినా  కారణాలు ఏవైనా చంద్రబాబు నాయుడు ఆనంకు అవకాశం ఇవ్వలేదు.  ఈ నేపధ్యంలోనే ముందుగానే  జగన్ దగ్గర మాట పుచ్చుకుని మరీ ఆనం సోదరులు 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి రాజీనామా  చేసి వైసీపీలో చేరారు. అయితే అక్కడ కూడా మళ్ళీ అదే కథ.  అదృష్టం మళ్ళీ అడ్డం తిరిగింది. మంత్రి పదవి రాలేదు. అనం ఆశించిన సీనియర్ కోటాను జంగన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు. కారణాలు ఏవైనా ఆయన సీనియర్లు వద్దనే అనుకున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన బెర్తులన్నీ జూనియర్లకే కేటాయించారు. నెల్లూరు జిల్లా నుంచి రెడ్డి కోటాలో మేకపాటికి, బీసీ కోటాలో అనిల్ కుమార్ కు  అవకాశం ఇచ్చారు. ఈనేపధ్యంలో ఇప్పుదైనా ఆనంకు మంత్రి పదవి దక్కుతుందా అనే చర్చ  జరుగుతోంది.  అయితే ఈసారీ.. ఆనంకు సారీనే అనటున్నారు. అనంతో పాటుగా జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వారు కనీసం మరో ఐదుగురు వరకు ఉన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి, కోటం రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి, సంజీవయ్య ..మంత్రి పదవుల రేసులో ఉన్నారు. మరో వంక పార్టీలో చేరి, ఎమ్మెల్యేగా  గే;లిచింది మొదలు ఆనం రామ నారాయణ రెడ్డి,  జగన్ ఆశించింది ఇవ్వలేక పోయారు. విధేయత చూపడంలో విఫలమయ్యారు. అసమ్మతి గళం కూడా వినిపించారు. అంతే కాదు, కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, జగన్ రెడ్డిని చాలా దుర్మార్గంగా దూషించారు. కాబట్టి ఆనంకు మంత్రివ పదవి ఈసారి కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని అంటున్నారు.

డెకాయిట్ల అడ్డా  టీఆర్ఎస్! రేవంత్ రెడ్డికి అఖిలపక్షం సపోర్ట్.. 

తెలంగాణ ప్రదేశ్ కమిటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడంపై విపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలే ఆందోళనలు చేయడంపై విపక్ష నేతలు మండిపడ్డారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు.  రేవంత్ రెడ్డి ఇంటిపై దాడిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. అసలైన డెకాయిట్లు అందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకుల ఇళ్లపై దాడులు చేయడం నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. రేవంత్ ఇంటిపై దాడిని అఖిలపక్షం ఖండిస్తోందని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి దాడులకు తెగబడితే సంగతి చూస్తామని హెచ్చరించారు. దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని సవాల్ విసిరారు. ఇలాంటి దాడులు చేసే వారిని రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలను.. రేవంత్ అనుచరులు తరిమేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజీ ఉన్నప్పటికీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని పోలీసు అధికారులను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.   

నీళ్లడిగిన గ్రామస్తుడి తల పగలగొట్టిన సర్పంచ్.. వీడియో వైరల్

ఆయన ఊరికి సర్పంచ్. గ్రామ ప్రజల సమస్యలు తీర్చే  పదవిలో ఉన్నారు. అలాంటి సర్పంచ్ విచక్షణ కోల్పోయాడు. దిగజారి ప్రవర్తించాడు. గ్రామ సమస్యపై ప్రశ్నించిన ఓ వ్యక్తిపై దాడి చేశాడు. కొట్టడమే కాదు ఎగిరెగిరి తన్నాడు. బండ రాయితో తల పగులగొట్టాడు. గ్రామస్తుడిపై సర్పంచ్ దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నీళ్ల సమస్యను ఎప్పుడు తీరుస్తారంటూ ప్రశ్నించినందుకు ఓ గ్రామస్థుడిపై సర్పంచ్ దాడి చేశారు. ఆ వ్యక్తిని ఎగిరెగిరి తన్నారు. అంతటితో ఆగకుండా రాయితో అతడిని చితకబాదారు. దీంతో ఆ వ్యక్తి తలకు తీవ్రగాయమైంది. కన్ను వాచిపోయింది. తలకు నాలుగు కుట్లు పడ్డాయి. బాధితుడు శ్రీనివాస్ ను సర్పంచ్ జైపాల్ రెడ్డి తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  గ్రామంలో కొన్ని రోజులుగా నీళ్ల సమస్య ఉందని, కిరాణా షాపుకు వెళ్లగా అక్కడ సర్పంచ్ తో పాటు మరికొందరు నీళ్ల గురించి మాట్లాడుకుంటుండగా తానూ సమస్యపై ప్రశ్నించానని బాధితుడు శ్రీనివాస్ చెప్పారు. అయితే, నువ్వేందిరా అడిగేదంటూ సర్పంచ్ తన్నాడని, కిందపడేసి రాయితో బాదాడని తెలిపారు. ఇష్టమొచ్చినట్టు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఆ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సర్పంచ్  జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.  అయితే తనపై కొందరు కావాలనే కుట్ర చేశారని సర్పంచ్ జైపాల్ రెడ్డి  వివరణ ఇచ్చారు. తాను ఊరికే శ్రీనివాస్ ను కొట్టలేదని, తనను బూతులు తిట్టాడని, అమ్మను కలిపి తిట్టాడని ఓపిక నశించే కొట్టానని చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కూడా తన వద్ద ఉందన్నారు జైపాల్ రెడ్డి. వేరే వాళ్లతో తన గల్లా కూడా పట్టించి దాడి చేయించబోయాడన్నారు.బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కలిసి తనపై కుట్ర చేశారని ఆరోపించారు. శ్రీనివాస్ తో తనకెలాంటి గొడవలు లేవని, అతడు మంచివాడని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల చెప్పుడు మాటలు విని తనపై దాడికి ప్రయత్నించాడని, తాగి వచ్చి గొడవ పెట్టుకున్నాడని తెలిపారు. పోలీసుల చెకింగ్ లో కూడా ఆ విషయం తేలిందని చెప్పారు సర్పంచ్ జైపాల్ రెడ్డి. 

భవానీపూర్ మరో నందిగ్రామ్ అవుతుందా? 

గత మార్చి, ఏప్రిల్ మాసాలలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని  గద్దె దించేందుకు బీజీపీ చేయని ప్రయత్నం లేదు. సర్వ శక్తులు వడ్డింది. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, సారధ్యంలో కేంద్ర మంత్రులు బెంగాల్ ను కమల దళం ఖాతాలో కలుపుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోలేదు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్నా లెక్క చేయలేదు. ఆ లెక్క చేయక పోవడం వలన దేశం కరోనా కోరల్లో చిక్కి విలవిల లాడింది. విపక్షాలు మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండా గట్టాయి. కరోనా సెకండ్ వేవ్ వైఫల్యం కేంద్ర ప్రభుత్వం,మరీ ముఖ్యంగా మోడీ ఇమేజ్’ని బాగా డ్యామేజి చేసింది. మోడీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది.  అయినా ఇంత చేసినా మమతా బెనర్జీని గద్దె దిచాలనే మోడీ, షా జోడీ కల మాత్రం నెరవేర లేదు. మమతా బెనర్జీ  సారధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టింది. అయితే, గుడ్డిలో మెల్ల అన్నట్లుగా, ఆ ఎన్నికల్లో తృణమూల్ ముందుకంటే, మంచి మెజారిటీతో విజయం సాధించినా, నందిగ్రామ్ లో మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడి పోయారు. అయినా  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపధ్యంలోనే, తిరిగి శాసన సభ సభ్యత్వం పోనేందుకు,తమ సొంత నియోజక వర్గం భవానీపూర్’లో గెలిచిన పార్టీ అభ్యర్హ్ది .... చేత రాజీనామా చేయించారు. ఆ స్థానానికి ఈ నెల (సెప్టెంబర్) 30 న ఉప ఎన్నిక జరుగుతోంది.  నిజానికి, ఇక్కడి నుంచి మమత గెలుపు గురించి అంతగా కష్ట పడవలసిన అవసరం లేదు. అయినా మమత కష్ట పడుతున్నారు. కష్ట పడడమే కాదు భయపడుతున్నారు. మమత భయానికి కారణమా ఉంది. ఆమెను వరసగా రెండు సార్లు ఇదే నియోజక వర్గం నుంచి గెలిచినా, మూడవసారి పార్టీ అభ్యర్ధి .... విజయం సాధించినా, విక్టరీ మార్జిన్ మొదరి సారికంటే రెండవ సారికి, 50 వేల నుంచి 25 వేలకు  సగానికి సగం పడిపోయింది. అయితే, మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో ఆమె పోటీలో లేక పోయినా పార్టీ అభ్యర్ధి శోబన్ దేవ్ ఉపాధ్యాయ 28 వేల పై చిలుకు ఆధిక్యతతో విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికలకు మధ్యన 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో తృణమూల్ అధిక్యత ఏకంగా మూడు వేలకు పడిపోయింది. ఇలా, అటూ ఇట్తో అవుతున్న ఎన్నికలోలో  భవానీ పూర్ ఓటర్లు ఈసారి ఎటు మొగ్గుచూపుతారో ఎలాంటి తేర్పు ఇస్తారో అని తృణమూల్ నేతల్లో అంతో ఇంతో భయం అయితే ఉందని అంటున్నారు.  భవానీపుర్  నియోజక వర్గంలో 40  శాతం ఉన్న బెంగాలీ ఇతరులలో చాలా వరకు హిందువులు, సిక్కులు, మార్వాడీలు, గుజారాతీలు ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో  బెంగాలీ ఇతరులు తృణమూల్ వైపే మొగ్గుచూపారు. కానీ  అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఈ వర్గాలకు చెందిన వారే హింసకు గురయ్యారు. మరో వంక బీజేపీ  ఎన్నికల అనంతర హింసనే ప్రధాన అస్త్రంగా ప్రచారం సాగిస్తోంది. అంతేకాదు, ఎన్నికల అనంతర హింసకు సంబందించిన కేసుల్లో బాధితుల తరపున న్యాయ పోరాటం సాగిస్తున్న యువ న్యాయవడి ప్రియాంకా తబ్రీవాల్’ ను బీజేపీ అభ్యర్ధిగా నిలిపింది. అలాగే, బెంగాల్ బీజేపీ నూతన అధ్యక్షుడు సుకాంత మజుందార్, మమతా బెనర్జీని తాలిబన్లతో పోలుస్తూ, ఆమె పై యుద్దాన్ని ప్రకటించారు. ఎన్నికల అనంతర హింసకు ఆమె మూల్యం చెల్లించ తప్పదని ఆన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా  ఓడిపోయారు. ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రిగ ఓడి పోతారు అని అంటున్నారు.  ఈ నేపధ్యంలో బెంగాలేతర ఓటర్లు ఎటు మొగుచూపుతారో అనే ఆందోళన కూడా తృణమూల్ శ్రేణుల్లో వ్యక్త మావుతోందని అంటున్నారు. ఇక మిగిలిన 60 శాతం ఓటర్లలో  20 శాతం ఉన్న ముస్లిం ఓటు, గంప గుత్తగా మమత పడుతుందని, మిగిలిన 40 శాతం బెంగాలీ ఓటు కూడా అటూ ఇటూ అయితే, మమత గెలుపు అనుకున్నంత ఈజీ కాకపోవచ్చని అంటున్నారు. అంతే  కాకుండా మమత, జాతీయ రాజకీయలపై మక్కువ చూపుతున్న నేపధ్యంలో ఈ ఎన్నికల్లో మాములుగా గెలిస్తే సరిపోదని, లక్ష పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధిస్తేనే ఆమెకు  ఆబోరు దక్కుతుందని అంటున్నారు. మరో వంక మమతను గద్దెదించేందుకు చేసిన తొలి ప్రయత్నంలో ఓడి పోయిన  బీజేపీ మాత్రం, సెకండ్ ఎఫర్ట్ లో అయినా, ఆమె మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కకుండా చేయాలని  శత విధాలా ప్రయత్నిస్తోంది.  అయితే  చివరకు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో ... ఎవరికి  జై కొడతారో అక్టోబర్ 4 న తేలిపోతుంది.

ఇప్ప‌టిదాకా ఓ లెక్క‌.. రేవంత్‌రెడ్డితో మ‌రో లెక్క‌.. ఇక కాస్కో కేసీఆర్.. 

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆడిస్తున్నారు. గులాబీ నేత‌లంతా ఆడుతున్నారు. రేవంత్‌రెడ్డి ఉచ్చు ప‌న్నుతున్నారు. అందులోకి వ‌చ్చి టీఆర్ఎస్ నేతలు చిక్కుతున్నారు. రేవంత్‌రెడ్డి క‌వ్విస్తున్నారు.. ఏకంగా మంత్రి కేటీఆరే కంగారు ప‌డుతున్నారు. రేవంత్‌రెడ్డి టాపిక్ డిసైడ్ చేస్తున్నారు.. మంత్రులు, ఎమ్మెల్యేలంతా దానిపై స్పందిస్తున్నారు. అందుకే, కొన్ని వారాలుగా రేవంత్‌రెడ్డి పేరు తెలంగాణ‌లో మారిమోగిపోతోంది. రేవంత్‌రెడ్డి చుట్టూనే రాజ‌కీయం న‌డుస్తోంది. అధికార పార్టీని తోలుబొమ్మ‌లాట‌లా ఆటాడుకుంటున్నారు పీసీసీ చీఫ్‌. ఈ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీలో పువ్వు గుర్తు పార్టీ సోదిలో కూడా లేకుండా పోతోంది. ఈ మ‌ధ్య ఈట‌ల రాజేంద‌ర్ న్యూసేమీ ఉండ‌టం లేదు. బండి సంజ‌య్ త‌న మానానా తాను జేబులో చెయ్యి పెట్టుకొని న‌డుచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ సంగ్రామంలో రేవంత్‌రెడ్డిదే వ‌న్ మ్యాన్ షో న‌డుస్తోంది. ఆ.. ఏముంది రేవంత్‌రెడ్డే క‌దా.. చూసుకుందాం అనుకున్నారు మొద‌ట్లో. కేసులు, జైలుతో గ‌తంలోనే తొక్కేశాం.. ఇప్పుడు మాకో లెక్కా అనుకుంది అధికార పార్టీ. అయితే, ఆ లెక్క‌ల‌న్నీ స‌రి చేయ‌డానికే గోడ‌కు కొట్టిన బంతిలా వ‌చ్చాడ‌ని అస్స‌లు ఊహించ‌లేక‌పోయింది. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్‌రెడ్డి.. థౌజండ్ వాట్స్ ప‌వ‌ర్ ఉన్న పొలిటిక‌ల్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌లా మారిపోయారు. ట‌చ్ చేస్తే మాడి మ‌సైపోతున్నారు. ద‌ళిత గిరిజ‌న దండోరా స‌భ‌ల‌తో కాంగ్రెస్ స‌త్తా, త‌న నాయ‌కత్వ ప‌టిమ‌ను ఘ‌నంగా చాటారు. ల‌క్ష‌లాది మంది జ‌నంతో వ‌రుస స‌భ‌లు నిర్వ‌హించి త‌న‌ను తాను నిరూపించుకున్నారు. నిర్మ‌ల్‌లో బీజేపీ స‌భ పెట్టి, కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షా వ‌స్తే.. స‌భా ప్రాంగ‌ణం చాలా వ‌ర‌కు ఖాళీ. అదే రోజు దాదాపు అదే స‌మ‌యంలో కేటీఆర్ ఇలాఖా గ‌జ్వేల్‌లో రేవంత్‌రెడ్డి స‌భ పెడితే 2 ల‌క్ష‌ల మంది జ‌నంతో మాంచి ఊపు. వ‌రుస స‌భ‌ల‌తో రేవంత్ ఎంత‌టి మొన‌గాడే తేలిపోయింది. ఆయ‌న వెన‌కే కాంగ్రెస్ అంతా క‌దిలొచ్చింది. ఆయ‌న వెనుకున్న అభిమాన గ‌ణం లెక్క తేలిపోయింది. ఇలా బ‌ల నిరూప‌ణ త‌ర్వాత‌.. త‌న రాజ‌కీయ చ‌తుర‌తను అధికార పార్టీకి రుచి చూపించారు రేవంత్‌రెడ్డి. అది.. మ‌రింత దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ చేసింది. వైట్ ఛాలెంజ్‌తో కారు పార్టీ యువ‌రాజు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లాక్కోలేక పీక్కోలేక విల‌విల్లాడు. అంత‌కుముందు శ‌శిథ‌రూర్ విష‌యంలో రేవంత్‌రెడ్డిని ఇరికిద్దామ‌నుకున్నారు కేటీఆర్‌. కానీ, కేటీఆర్ ఉచ్చు నుంచి గంట‌ల వ్వ‌వ‌థిలోనే తుర్రున జారుకున్నారు. నేరుగా శ‌శిథ‌రూర్‌కే ఫోన్ చేసి.. సారీ చెప్పి.. తాను ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన నిజ‌మైన నాయ‌కుడిన‌ని నిరూపించుకున్నారు రేవంత్‌రెడ్డి. పాపం.. కేటీఆర్ ఆ ఎపిసోడ్‌లో బాగా డిస‌ప్పాయింట్ అయిన‌ట్టున్నారు. ఇక వైట్ ఛాలెంజ్‌తో అన్నీ మూసుకొని కోర్టు ర‌క్ష‌ణ‌లో దాక్కున్నారు.  ఇక‌, ఓవ‌రాక్ష‌న్ చేయ‌బోయిన టీఆర్ఎస్ కిందిస్థాయి కార్య‌క‌ర్త‌ల‌ను త‌రిమి త‌రిమి కొట్టారు రేవంత్‌రెడ్డి అనుచ‌రులు. ఆ ఘ‌ట‌న‌తో ఆయ‌న‌ మామూలు లీడ‌ర్‌ని కాద‌ని.. రేవంత్‌ వెనుక క‌రుడు క‌ట్టిన ప్ర‌జాభిమానం ఉంద‌ని స్ప‌ష్ట‌మైంది. ప‌ది మంది గులాబీ కార్య‌క‌ర్త‌లు పోగై.. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్ట‌డించాల‌ని బ‌రితెగించారు. అదేమైనా గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసా.. ఇలా వెళ్లి.. అలా ముట్ట‌డించి.. ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో పెట్టుకోడానికి. రేవంత్‌రెడ్డి ఇల్లు. తాము చేసింది ఎంత‌టి త‌ప్పుడు సాహ‌స‌మో వారికి అక్క‌డికి వెళ్ల‌గానే తెలిసొచ్చింది. ఇంకా రేవంత్ ఇంటి దాకా కూడా వెళ్ల‌లేదు.. ఆ ఇల్లు ఉండే గ‌ల్లిలోకి ఇలా ఎంట‌ర్ అయ్యారో లేదో.. అలా రేవంత్ అనుచ‌రులు క‌ర్ర‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఎవ‌డ్రా మీరు.. మా రేవంత‌న్న ఇంటి మీద‌కే వ‌స్తార్రా.. అంటూ క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడి చేశారు. రేవంత్‌రెడ్డిపై ఉన్న అభిమానం.. టీఆర్ఎస్ గుంపుపై ఆవేశంగా మార‌డంతో.. వారిని పోలీసులు సైతం కంట్రోల్ చేయ‌లేక పోయారు. గులాబీ మూక‌ను క‌ర్ర‌ల‌తో త‌రిమి త‌రిమి కొట్టారు. రేవంత్‌రెడ్డి ఇంటి గ‌ల్లీలో కూడా ప్ర‌త్య‌ర్థుల‌ను కాలు పెట్ట‌నీయ‌కుండా.. కంటికి రెప్ప‌లా.. సుశిక్షితులైన సైనికుల్లా.. కాపు కాశారు రేవంత్‌రెడ్డి అనుచ‌రులు, అభిమానులు. అదీ రేవంత్‌రెడ్డి బ‌లం..బ‌ల‌గం.  ఇలా.. దండోరా స‌భ‌ల‌తో కేసీఆర్‌కు, వైట్ ఛాలెంజ్‌తో కేటీఆర్‌కు, క‌ర్ర‌ల స‌మ‌రంతో టీఆర్ఎస్ కేడ‌ర్‌కు.. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే మొత్తం గులాబీ సైన్యానికి త‌న స‌త్తా ఏంటో ఓ రౌండ్ రుచి చూపించారు పీసీసీ చీఫ్  రేవంత్‌రెడ్డి. ఈ దెబ్బ‌తో గులాబీ ద‌ళానికి ఇప్ప‌టికే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. మ‌రి, కొన్నాళ్ల పాటు రేవంత్‌రెడ్డి పేరెత్త‌డానికి కూడా అధికార పార్టీ సాహ‌సించ‌లేక పోవ‌చ్చు. రేవంత్‌రెడ్డా.. మ‌జాకా.

గుర్తు పెట్టుకుంటా.. పోలీసుల‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్‌ వార్నింగ్‌..

రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లారు. పోలీస్ అధికారుల‌కు ఖ‌త‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్‌కు వత్తాసు పలికే అధికారులను గుర్తుపెట్టుకుంటామని హెచ్చ‌రించారు. తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని గ‌ట్టిగా చెప్పారు రేవంత్‌రెడ్డి.   తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్టు చెప్పిందని పోలీసుల‌కు గుర్తు చేశారు రేవంత్‌రెడ్డి. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు పీసీసీ చీఫ్‌. తన ఇంటిపై టీఆర్ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారంటూ జూబ్లీహిల్స్‌ పోలీసులకు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే, దాడి చేసిన టీఆర్ఎస్‌ కార్యకర్తలపై కేసులు పెట్టకుండా.. కాంగ్రెస్‌ కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించారని మండిప‌డ్డారు.  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను భయపెడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తమ కార్యకర్తలపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రాన్ని బిహార్‌గా మార్చాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణుల‌పై ప్ర‌తీకార చ‌ర్య‌లు త‌గ‌వంటూ మండిప‌డ్డారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.    

జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ కు రేవంత్ రెడ్డి..

తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తన అనుచరులపై కేసులు పెట్టడంపై ఆయన పోలీసులను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పీఎస్ కు రావడంతో అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. దీంతో జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు మంగళవారం టీఆర్ఎస్ కార్యకర్తలు ప్ర‌య‌త్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా  ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు తక్కువగా ఉండటంతో కొంత సేపు రణరంగం నెలకొంది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి తరలించడంతో టెన్షన్ తగ్గింది.  అయితే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఈ విషయంపైనే పీఎస్ కు వచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. త‌న ఇంటిపై టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడి చేశార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు పాల్ప‌డితే పోలీసులు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని  కోరారు. 

టీటీడీ జంబో బోర్డుపై జ‌గ‌న్ స‌ర్కారుకు బిగ్ షాక్.. హైకోర్టు స్టే...

విచిత్రం. ఆశ్చ‌ర్యం. మునుపెన్న‌డూ లేన‌ట్టు ఏకంగా 80 మందికి పైగా టీటీడీ జంబో బోర్డు నియామ‌కం. అందులో ప్ర‌త్యేక ఆహ్వానితులు 50 మందికి పైనే. ఇదేమి చోద్యం అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. ఏకంగా సెంచ‌రీ కొడితే స‌రిపోయేదిగా అంటూ సెటైర్లు. కొవిడ్ కాలంలో స‌ర్వ ద‌ర్శ‌నమే గ‌గ‌న‌మ‌వుతుంటే.. ఏకంగా ఇంత మంది ప్ర‌త్యేక ఆహ్వానితులను నియ‌మించి ఏం చేస్తార‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం. పారిశ్రామికవేత్త‌ల‌ను, రాజ‌కీయ నేత‌ల‌ను అడ్డ‌దారిలో బోర్డులో జొప్పించార‌నే ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఏకంగా కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి పేరును వాడేసుకొని, ఆయ‌న రిక‌మెండ్ చేశారంటూ ఓ స‌భ్యుడిని టీటీడీ బోర్డులో చేర్చ‌డం.. ఆ విష‌యంపై కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డే నేరుగా సీఎం జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇలా తీవ్ర వివాదాస్ప‌ద‌మైన టీటీడీ జంబో బోర్డు నియామ‌కంపై తాజాగా హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.   ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యులతో పాటు భారీగా ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవో జారీ చేసింది. పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సభ్యులను నియమించారని.. దీని వల్ల సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్లు అందులో పేర్కొన్నారు. టీటీడీ స్వతంత్రతను దెబ్బతీసేలా జీవోలు ఉన్నాయని పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు వాదించారు. నిబంధనలనకు అనుగుణంగానే నియమకాలను చేపట్టినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్ర‌భుత్వం, టీటీడీకి నోటీసులు ఇచ్చింది. 

జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. టీటీడీ పాలకమండలి జీవో సస్పెండ్ 

ఆంధ్రప్రదేశ్ లోని జగన్ రెడ్డి ప్రభుత్వానికి మరో బిగ్ షాక్ తగలింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి బోర్డు నియామకంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టిటిడికి ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవో 569 ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇటీవలే  కొత్త పాలకమండలిని నియమించింది వైసీపీ ప్రభుత్వం. గతానికి భిన్నంగా 81 మందితో జంబో బోర్డును ఏర్పాటు చేసింది.ఇందులో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చింది. గతంలో టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులు లేరు.  టీటీడీ జంబో బోర్డుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడంపై  హైకోర్టులో పిల్‌ దాఖలైంది. టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ పిల్‌ వేశారు. పాలకమండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం చట్ట విరుద్ధమని, దీని వల్ల సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బందని చెప్పారు.  హిందూ ధర్మాదాయ, దేవాదాయ చట్టానికి ఈ నియామకాలు విరుద్ధమని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. పాలకమండలిపై ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను కొట్టివేయాలన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. టిటిడికి ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవో 569 ను ధర్మాసనం సస్పెండ్ చేసింది.  గతంలో టీటీడీ బోర్డు కేవలం 18 మంది సభ్యులకే పరిమితం చేశారు. వైసీపీ వచ్చీ రాగానే దీనిని విస్తరించే కార్యక్రమం చేపట్టింది. 2019లో ఏర్పాటైన పాలకమండలిలో సభ్యుల సంఖ్యను 18 నుంచీ 37కు పెంచేశారు. ఇప్పుడు  ఏకంగా 81కి చేశారు. ఇందులో సభ్యులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులను పక్కనపెడితే... 50 మంది  ప్రత్యేక ఆహ్వానితుల కథ మరీ ‘ప్రత్యేకం’. వీరికి ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు. ఓటింగ్‌ హక్కు లేదు. కనీసం పాలకమండలి సమావేశంలో కూడా వీళ్లు పాల్గొనలేరు. మరి వీరేం చేస్తారంటే... ఏమీ చేయరు. కొండపై ప్రత్యేక మర్యాదలను మాత్రం అనుభవిస్తారు. పాలక మండలి సభ్యులకు వర్తించే ‘ప్రొటోకాల్‌’ మొత్తం ప్రత్యేక ఆహ్వానితులకూ వర్తిస్తుంది. అంటే... వారితో సమానంగా తగిన మర్యాదలతో శ్రీవారిని దర్శించుకోవచ్చు. దర్శనాలకు సిఫారసులూ చేయవచ్చు.

ప‌న్ను ఎగ‌వేత‌పై సోనూసూద్ క్లారిటీ.. ఆయ‌న ఏమ‌న్నారంటే...

20 కోట్ల పన్ను ఎగ‌వేత‌. 18 కోట్ల విరాళాలు సేక‌ర‌ణ‌. ఖ‌ర్చు చేసింది మాత్రం కేవ‌లం 1.9 కోట్లు మాత్ర‌మే. మిగ‌తా సొమ్మంతా అకౌంట్‌లో అలానే ఉంది. ఇదీ సోనూసూద్‌పై 4 రోజుల త‌నిఖీల త‌ర్వాత ఐటీ శాఖ వెల్ల‌డించిన వివ‌రాలు. ఈ ప్ర‌క‌ట‌న‌తో రెండేళ్లుగా సోనూసూద్ సంపాదించుకున్న క్రెడిట్ అంతా పోయింది. ఆయ‌న ఇమేజ్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. క‌రోనా కాల‌పు దేవుడిగా భావించిన వాళ్లే.. ఇప్పుడు గుచ్చిగుచ్చి అనుమానించాల్సి వ‌స్తోంది. సోనూసూద్ ఫ్రాడ్ అట‌. పన్ను ఎగ‌వేశాడ‌ట‌. డొనేష‌న్స్ ఖ‌ర్చు చేయ‌లేద‌ట‌. ఇలా దేశ‌వ్యాప్తంగా గుస‌గుస‌లు. ఢిల్లీ స‌ర్కారుతో చేతులు క‌లిపినందుకు బీజేపీ చేప‌ట్టిన ప్ర‌తీకార చ‌ర్య‌ల‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇలా త‌న‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లపై సోనూసూద్ తొలిసారి స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చారు. ఇరవై కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డానన్న ఆరోపణలతో తన ఇంట్లో ఐటీశాఖ సోదాలు నిర్వహించడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తన ఫౌండేషన్‌కు విరాళాల రూపంలో వచ్చిన డబ్బులోంచి పైసా కూడా వృధా చేయలేదని స్పష్టం చేశారు. తాను వెచ్చించిన మొత్తంలో విరాళాల కన్నా, తన రెమ్యూనరేషనే ఎక్కువని చెప్పారు.   రూ.18.94 కోట్ల విరాళాలల్లో రూ.1.9 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయనే దానికీ సోనూసూద్ బదులిచ్చారు. ఆ డబ్బు ఖర్చు పెట్టేందుకు 18 నిమిషాలు చాలన్నారు. అయితే ప్రతి సమస్య వాస్తవమైనదేనా? అన్న కోణంలో తమ బృందం పరిశీలిస్తుందని, క్షేత్రస్థాయి వర్గాలను ఆరా తీస్తుందని,  సాయానికి ఖ‌ర్చు చేసిన ప్రతి పైసా వృధా కాలేదన్నారు.  ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై స్పందిస్తూ తన ఫోండేషన్‌ ఎఫ్‌సీఆర్‌ఏ కిందకు రాదని చెప్పారు. అయినా తాను విదేశాల నుంచి పైసా కూడా విరాళంగా తీసుకోలేదన్నారు. విరాళాలన్నీ క్రౌడ్‌ ఫండిగ్‌ ప్లాట్‌ఫాంలోనే ఉన్నాయని, ఆ నిధులు భారత్‌కు వచ్చినప్పుడే కాదా ఉల్లంఘన జరిగిందా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేది అని సోనూసూద్‌ ప్రశ్నించారు. సమస్యలను బట్టి ఆ సొమ్ము నేరుగా ఆస్పత్రులకు, విద్యా సంస్థలకే వెళుతుందని, అలాంటప్పుడు ఉల్లంఘన అనే ప్రశ్న ఎలా తలెత్తుతుంద‌ని ప్రశ్నించారు. మున్ముందు సోనూ సోద్‌ లేకపోయినా సహాయ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.  ‘దేశ్‌ కీ మెంటార్‌’ అనే కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఆహ్వానించిందని చెప్పారు.  ప్రజల ముఖాల్లో ఆనందాలను నింపేందుకు తనను ఎవరైనా పిలిస్తే అది ఏ రాజకీయ పార్టీ, ఢిల్లీ ప్రభుత్వమా, గుజరాత్‌ ప్రభుత్వమా, బిహార్‌ ప్రభుత్వమా అని చూడకుండా వెళ్తానని సోనూసూద్ స్పష్టంచేశారు.