ఇప్పటిదాకా ఓ లెక్క.. రేవంత్‌రెడ్డితో మరో లెక్క.. ఇక కాస్కో కేసీఆర్..
posted on Sep 22, 2021 @ 2:56PM
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆడిస్తున్నారు. గులాబీ నేతలంతా ఆడుతున్నారు. రేవంత్‌రెడ్డి ఉచ్చు పన్నుతున్నారు. అందులోకి వచ్చి టీఆర్ఎస్ నేతలు చిక్కుతున్నారు. రేవంత్‌రెడ్డి కవ్విస్తున్నారు.. ఏకంగా మంత్రి కేటీఆరే కంగారు పడుతున్నారు. రేవంత్‌రెడ్డి టాపిక్ డిసైడ్ చేస్తున్నారు.. మంత్రులు, ఎమ్మెల్యేలంతా దానిపై స్పందిస్తున్నారు. అందుకే, కొన్ని వారాలుగా రేవంత్‌రెడ్డి పేరు తెలంగాణలో మారిమోగిపోతోంది. రేవంత్‌రెడ్డి చుట్టూనే రాజకీయం నడుస్తోంది. అధికార పార్టీని తోలుబొమ్మలాటలా ఆటాడుకుంటున్నారు పీసీసీ చీఫ్. ఈ పొలిటికల్ స్ట్రాటజీలో పువ్వు గుర్తు పార్టీ సోదిలో కూడా లేకుండా పోతోంది. ఈ మధ్య ఈటల రాజేందర్ న్యూసేమీ ఉండటం లేదు. బండి సంజయ్ తన మానానా తాను జేబులో చెయ్యి పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ సంగ్రామంలో రేవంత్‌రెడ్డిదే వన్ మ్యాన్ షో నడుస్తోంది.
ఆ.. ఏముంది రేవంత్‌రెడ్డే కదా.. చూసుకుందాం అనుకున్నారు మొదట్లో. కేసులు, జైలుతో గతంలోనే తొక్కేశాం.. ఇప్పుడు మాకో లెక్కా అనుకుంది అధికార పార్టీ. అయితే, ఆ లెక్కలన్నీ సరి చేయడానికే గోడకు కొట్టిన బంతిలా వచ్చాడని అస్సలు ఊహించలేకపోయింది. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్‌రెడ్డి.. థౌజండ్ వాట్స్ పవర్ ఉన్న పొలిటికల్ ట్రాన్స్‌ఫార్మర్‌లా మారిపోయారు. టచ్ చేస్తే మాడి మసైపోతున్నారు. దళిత గిరిజన దండోరా సభలతో కాంగ్రెస్ సత్తా, తన నాయకత్వ పటిమను ఘనంగా చాటారు. లక్షలాది మంది జనంతో వరుస సభలు నిర్వహించి తనను తాను నిరూపించుకున్నారు. నిర్మల్‌లో బీజేపీ సభ పెట్టి, కేంద్రహోంమంత్రి అమిత్‌షా వస్తే.. సభా ప్రాంగణం చాలా వరకు ఖాళీ. అదే రోజు దాదాపు అదే సమయంలో కేటీఆర్ ఇలాఖా గజ్వేల్‌లో రేవంత్‌రెడ్డి సభ పెడితే 2 లక్షల మంది జనంతో మాంచి ఊపు. వరుస సభలతో రేవంత్ ఎంతటి మొనగాడే తేలిపోయింది. ఆయన వెనకే కాంగ్రెస్ అంతా కదిలొచ్చింది. ఆయన వెనుకున్న అభిమాన గణం లెక్క తేలిపోయింది. ఇలా బల నిరూపణ తర్వాత.. తన రాజకీయ చతురతను అధికార పార్టీకి రుచి చూపించారు రేవంత్‌రెడ్డి. అది.. మరింత దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ చేసింది.
వైట్ ఛాలెంజ్‌తో కారు పార్టీ యువరాజు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లాక్కోలేక పీక్కోలేక విలవిల్లాడు. అంతకుముందు శశిథరూర్ విషయంలో రేవంత్‌రెడ్డిని ఇరికిద్దామనుకున్నారు కేటీఆర్. కానీ, కేటీఆర్ ఉచ్చు నుంచి గంటల వ్వవథిలోనే తుర్రున జారుకున్నారు. నేరుగా శశిథరూర్‌కే ఫోన్ చేసి.. సారీ చెప్పి.. తాను ఎక్కడ తగ్గాలో తెలిసిన నిజమైన నాయకుడినని నిరూపించుకున్నారు రేవంత్‌రెడ్డి. పాపం.. కేటీఆర్ ఆ ఎపిసోడ్‌లో బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. ఇక వైట్ ఛాలెంజ్‌తో అన్నీ మూసుకొని కోర్టు రక్షణలో దాక్కున్నారు.
ఇక, ఓవరాక్షన్ చేయబోయిన టీఆర్ఎస్ కిందిస్థాయి కార్యకర్తలను తరిమి తరిమి కొట్టారు రేవంత్‌రెడ్డి అనుచరులు. ఆ ఘటనతో ఆయన మామూలు లీడర్‌ని కాదని.. రేవంత్ వెనుక కరుడు కట్టిన ప్రజాభిమానం ఉందని స్పష్టమైంది. పది మంది గులాబీ కార్యకర్తలు పోగై.. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడించాలని బరితెగించారు. అదేమైనా గవర్నమెంట్ ఆఫీసా.. ఇలా వెళ్లి.. అలా ముట్టడించి.. ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకోడానికి. రేవంత్‌రెడ్డి ఇల్లు. తాము చేసింది ఎంతటి తప్పుడు సాహసమో వారికి అక్కడికి వెళ్లగానే తెలిసొచ్చింది. ఇంకా రేవంత్ ఇంటి దాకా కూడా వెళ్లలేదు.. ఆ ఇల్లు ఉండే గల్లిలోకి ఇలా ఎంటర్ అయ్యారో లేదో.. అలా రేవంత్ అనుచరులు కర్రలతో విరుచుకుపడ్డారు. ఎవడ్రా మీరు.. మా రేవంతన్న ఇంటి మీదకే వస్తార్రా.. అంటూ కర్రలు, రాళ్లతో దాడి చేశారు. రేవంత్‌రెడ్డిపై ఉన్న అభిమానం.. టీఆర్ఎస్ గుంపుపై ఆవేశంగా మారడంతో.. వారిని పోలీసులు సైతం కంట్రోల్ చేయలేక పోయారు. గులాబీ మూకను కర్రలతో తరిమి తరిమి కొట్టారు. రేవంత్‌రెడ్డి ఇంటి గల్లీలో కూడా ప్రత్యర్థులను కాలు పెట్టనీయకుండా.. కంటికి రెప్పలా.. సుశిక్షితులైన సైనికుల్లా.. కాపు కాశారు రేవంత్‌రెడ్డి అనుచరులు, అభిమానులు. అదీ రేవంత్‌రెడ్డి బలం..బలగం.
ఇలా.. దండోరా సభలతో కేసీఆర్‌కు, వైట్ ఛాలెంజ్‌తో కేటీఆర్‌కు, కర్రల సమరంతో టీఆర్ఎస్ కేడర్‌కు.. వారం రోజుల వ్యవధిలోనే మొత్తం గులాబీ సైన్యానికి తన సత్తా ఏంటో ఓ రౌండ్ రుచి చూపించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఈ దెబ్బతో గులాబీ దళానికి ఇప్పటికే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. మరి, కొన్నాళ్ల పాటు రేవంత్‌రెడ్డి పేరెత్తడానికి కూడా అధికార పార్టీ సాహసించలేక పోవచ్చు. రేవంత్‌రెడ్డా.. మజాకా.